18 మంది పటేళ్ళకు సీట్లు… సిటింగ్ ఎమ్మెల్యేలకే బీజేపీ జై

0 0
Read Time:4 Minute, 56 Second

70 మందితో తొలి జాబితా… 
నలుగురు మహిళలకే చోటు
ముగ్గురు సిటింగ్ లకే ఉధ్వాసన

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో… ప్రస్తుత ఎమ్మెల్యేలు చాలామందికి సీట్లు ఉండవని హెచ్చరికలు చేసిన బీజేపీ అధిష్ఠానం చివరికి వెనక్కు తగ్గింది. శుక్రవారం ప్రకటించిన తొలి జాబితాలో కేవలం ముగ్గురికి మినహా సిటింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు కేటాయించింది. గుజరాత్ అసెంబ్లీలోని 182 అసెంబ్లీ సీట్లకు గాను రెండు దశల్లో (డిసెంబర్ 9, 14 తేదీల్లో) పోలింగ్ జరగాల్సి ఉంది. వాటిలో 70 సీట్లకు అభ్యర్ధులను బిజెపి తొలి జాబితాలో ప్రకటించింది.

రాజకీయార్థిక డిమాండ్లతో రాష్ట్రంలో పాటీదార్లు చేపట్టిన ఉద్యమ ప్రభావం బీజేపీ జాబితాపై ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. హార్ధిక్ పటేల్ నేతృత్వంలో పాటీదార్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విమర్శలతో ఉధ్యమాన్ని ఉధృతం చేసిన నేపథ్యంలో… ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఎక్కువ సీట్లను కేటాయించింది. తొలి జాబితాలోని 70 మందిలో ఏకంగా 18 మంది పటేళ్ళు ఉన్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఓబీసీలు మొత్తానికి కలిపి 16 సీట్లు కేటాయించిన బీజేపీ ఎస్టీలకు 11, ఎస్సీలకు మూడు సీట్లు కేటాయించింది.

తమను ఓబీసీలలో చేర్చాలన్న పటేళ్ళ ఉద్యమానికి ప్రతిగా ఓబీసీలు ఉద్యమించిన నేపథ్యంలో ఇరు వర్గాలను బ్యాలన్స్ చేయడానికి బీజేపీ అధినాయకత్వం ప్రయత్నించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జీతు వాఘాని పేర్లు కూడా తొలి జాబితాలో ఉన్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజ్ కోట్ వెస్ట్ నుంచి, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహ్సానా (మోదీ సొంత జిల్లా) నుంచి, వాఘాని భావ్ నగర్ (వెస్ట్) నుంచి పోటీ చేస్తున్నారు.

మొత్తం 49 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు తిరిగి కేటాయించిన బిజెపి… కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన మరో నేతకు సీట్లు ఇచ్చింది. రాష్ట్ర మంత్రివర్గంలోని 25 మందికిగాను 15 మందికి తొలి జాబితాలోనే సీట్లు దక్కాయి. ఇటీవలే పోలీసు ఉద్యోగానికి రాజీనాామా చేసిన ఐపిఎస్ అధికారి పిసి బరండాకు భిలోడా (ఎస్టీ) సీటు కేటాయించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాఘవ్ జీ పటేల్, ధర్మేంద్ర సింగ్ జడేజా, సికె రావోల్జి, మాన్ సిన్హ్ చౌహాన్, రామ సిన్హ్ పర్మర్ రాజ్య సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి అహ్మద్ పటేల్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరారు. వారికి ఇచ్చిన హామీ మేరకు బీజేపీ సీట్లు ఖరారయ్యాయి. అయితే వారితోపాటే వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భోలాభాయ్ గోహెల్ మాత్రం సీటు సంపాదించలేకపోయారు. ఆయనపైన 2012లో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన భారత్ భాయ్ బోఘ్రాకే సీటు దక్కింది.

బిజెపి సిటింగ్ ఎమ్మెల్యేలలో భావనా మక్వానా, వర్షా దోషి, నలిన్ కొటాడియాలకు సీట్లు లభించలేదు. ఒక ఎమ్మెల్యే సీటు మారారు. బీజేపీ తొలి జాబితాలో ప్రకటించిన 70 సీట్లలో 45 మొదటి దశ పోలింగ్ జరిగే ప్రాంతాలలోనివి కాగా మిగిలిన 25 సీట్లకు రెండో దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. మొత్తంమీద కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

%d bloggers like this: