‘ఆయన రాజు, నేను మంత్రినే’

బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుపై కామినేని కామెంట్

‘ఆయన రాజు. నేను ఆయన చెప్పినట్టు నడుచుకోవలసిన మంత్రినే’.. తమ పార్టీ (బిజెపి) శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య ఇది. బుధవారం శాసనసభలో తన శాఖకు సంబంధించిన అంశాలపై విష్ణుకుమార్ రాజు విమర్శలు చేసిన నేపథ్యంలో కామినేని ఇలా స్పందించారు. ‘ఆయన మా శాసనసభా పక్ష నాయకుడు. ఆయన రాజు. నేను మంత్రినే. ఆయన చెప్పినట్టు నడుచుకోవలసినవాడినే’ అని కామినేని వ్యాఖ్యానించారు.

తాను బిజెపికి చెందినవాడినని పరోక్షంగా ప్రస్తావించిన మంత్రి, విష్ణుకుమార్ రాజుగారు తనా… మనా చూసుకొని కాస్త విమర్శలు తగ్గించాలని సూచించారు. రాజుదగ్గర కత్తులు పోయాక నోటిదోనే దాడి చేస్తున్నారని కామినేని చమత్కరించారు. ఈ కామెంట్లు వింటూ విష్ణుకుమార్ రాజు హాయిగా నవ్వుకున్నారు.

కొద్ది రోజుల క్రితం కూడా సొంత పార్టీకి చెందిన మంత్రి కామినేని శాఖకు సంబంధించిన అంశాలపై విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. ఢిల్లీ కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలోనూ గాలి, నీరు కాలుష్యం పెరిగిందని, కల్తీలు పెరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కామినేని విష్ణుకుమార్ రాజుగారి విమర్శలతో తాను ఏకీభవించనంటూ.. ‘అన్నీ కల్తీ అయితే మా రాజుగారు అంత దిట్టంగా ఆరోగ్యంగా ఎలా ఉంటారు’ అని చమత్కార బాణం వదిలారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం అసెంబ్లీలో మరోసారి ‘రాజు-మంత్రి’ సంవాదం నడిచింది.

Related posts

Leave a Comment