-
రూ.10 వేల కోట్లతో 5 జోన్ల అభివృద్ధి... 2018లో వాటర్ ఫెస్టివల్
-
స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకొచ్చిన స్టెడీ ఎరీనా
అమరావతి, అక్టోబర్ 4 (న్యూస్ ల్యాండ్) : రాజధాని అమరావతిలో కీలకమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ ను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలోని మొత్తం 13 జోన్లలో 5 జోన్లను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద బుధవారం జరిగిన కీలక సమావేశంలో నిర్ణయించారు. ఈ ఐదు జోన్లలో చేపట్టబోయే పనుల విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశం బుధవారం సాయంత్రం వెలగపూడిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఉండే హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో పనులు చేపట్టేందుకు గల సానుకూలతలు, ప్రతికూలాంశాలపై సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు దేశంలో జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్ఏఐ) మాత్రమే ఈ హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ను అనుసరించి జాతీయ రహదారులను నిర్మిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌కు వెళుతున్నారు.
మొత్తం 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, నీటి సదుపాయాల కల్పన వంటి వివిధ రకాల పనులను చేపడతారు. రూ.2383 కోట్ల అంచనా వ్యయంతో 5,174 ఎకరాల మేర జోన్ 5లో అభివృద్ధి పనులను చేపడతారు. రూ.817 కోట్లతో 1360 ఎకరాల మేర జోన్ 4ను అభివృద్ధి చేస్తారు. రూ.3,714 కోట్ల వ్యయంతో 6902 ఎకరాల మేర జోన్ 9ని అభివృద్ధి చేయనున్నారు. రూ.2102 కోట్ల వ్యయంతో 7838 ఎకరాల మేర జోన్ 12 అభివృద్ధి పనులు చేపడతారు. రూ.1498 కోట్ల వ్యయంతో 3860 ఎకరాల మేర 12ఏ జోన్ పరిధిలో పనులు ఆరంభిస్తారు. ప్రతి జోన్‌లోనూ రహదారులు, వారధులు, విద్యుత్, నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఐసీటీ వంటి మౌలిక వసతుల ఏర్పాటుచేస్తారు.
'ఒక్క నిమిషమూ వృధా చేయొద్దు'
‘నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా వాటిని స్వీకరించాలి. వాటిపై అర్థవంతమైన చర్చ జరగాలి. మేధోమధనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి’ - ముఖ్యమంత్రి
అనేక తరాలు గర్వంగా చెప్పుకునే గొప్ప ప్రజారాజధానిని నిర్మిస్తున్నామన్న భావన ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిలో ఉండాలని, దానికి తగ్గట్టుగానే నిర్ధిష్ట కార్యప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క నిమిషం కూడా వృధాచేయకుండా పనులు జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
లండన్ వెళ్లనున్న సీఆర్డీయే బృందం
నిర్మాణమైన రాష్ట్ర శాసనసభ, హైకోర్టు భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో చర్చించడానికి ఏపీ సీఆర్‌డీఏ బృందం ఈనెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనున్నది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈనెల 12న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ సీఆర్‌డీఏ బృందానికి సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈనెల 9న ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతిలో చేపట్టే స్పోర్ట్స్ సిటీపై సమావేశంలో చర్చ జరిగింది. అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి స్టెడీఎరీనా అనే బ్రిటీష్ సంస్థ ముందుకొచ్చింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి క్రీడలకు అనువైన ప్రాంగణాలన్నీ ఒకేచోట నిర్మిస్తారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణానదికి అభిముఖంగా ఈ స్పోర్ట్స్ కాంప్లోక్స్ నిర్మించాలని సీఆర్‌డీఏ తలపోస్తోంది. దీనిని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటుచేయాలని మంత్రి పి. నారాయణ సూచించారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బోయపాటి ప్రెజెంటేషన్
విజయవాడ పవిత్ర సంగమం దగ్గర వేంకటేశ్వరుని ఆకృతితో ఆలయ శిఖర నిర్మాణానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలేశుని మూడు నామాలు, దానిపైన ఆలయ గోపురం ఉండేలా, వీటి కింది నుంచి నది ప్రవాహం సాగేలా ఈ నిర్మాణం ఉంటుంది. దశావతారాల థీమ్‌తో ఆలయ శిఖర ఆకృతికి రూపకల్పన చేసినట్టు బోయపాటి శ్రీను ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి అఖండ గోదావరి నుంచి పవిత్ర సంగమం మీదుగా రాష్ట్రంలో జలసిరికి హారతి పడుతున్నామని, అందుకే ఈ పవిత్ర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేయడానికి పూనుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. బోయపాటి సమర్పించిన ఆకృతులపై ఆగమ శాస్త్ర నిపుణులు, టీటీడీ పండితులతో చర్చించి పదిరోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అమరావతిలోనే తిరుమలేశుని ఆలయాన్ని తిరుమల తరహాలో దేదీప్యంగా వుండేలా నిర్మించాలన్నది తన ఆలోచనగా తెలిపారు. రాజధానిలోని పర్వత ప్రాంతంలో వున్న వైకుంఠపురం అందుకు అనువైన ప్రదేశంగా భావిస్తున్నట్టు తెలిపారు.
2018 నవంబర్‌లో వాటర్ ఫెస్టివల్
‘రానున్నకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతిపెద్ద ఆకర్షణ కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి జలక్రీడలకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతి చిరునామాగా మలచాలి’-అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘ఎఫ్1 హెచ్2వో’ పేరిట వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఇటలీకి చెందిన యుఐఎం సంస్థ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నవంబరు మాసంలో అంతర్జాతీయ జల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు యుఐఎం సిద్ధమవుతోంది. ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్, యుఏఈ తరువాత అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యుఐఎం ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఉత్సవాలపై వారు ముఖ్యమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్2వో రేసింగ్ పేరుతో పవర్‌బోట్ రేసింగ్, ఎఫ్1హెచ్2వో పేరుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆక్వాబైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300, 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు కనీసం వారం రోజులు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్ గదులు అవసరం అవుతాయని పర్యాటక కార్యదర్శి ఎం.కే. మీనా ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి, కృష్ణానదులలో ఏడాది పొడవునా జలక్రీడలకు సంబంధించిన ఈ తరహా అన్నిరకాల పోటీలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పర్యాటక శాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాథికార సంస్థని ఏర్పాటుచేస్తామని చెప్పారు.