సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్…
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్…
36 సంవత్సరాల క్రితం మహానటుడు కమల్ హాసన్ అభినయించిన అద్భుతమైన పాట ఇది. సినిమా పేరు ఆకలి రాజ్యం… ఇన్నేళ్ళ తర్వాత ఇండియా పరిస్థతికి అదే టైటిల్ సూటవుతోందంటే అతిశయోక్తి కాదేమో…!
అంతర్జాతీయ ఆకలి ర్యాంకుల్లో ఈ ఏడాది సెంచురీ (100వ స్థానం) కొట్టంది ఇండియా. గురువారం వెల్లడైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం… మునుపటి కంటే భారతదేశం మూడు స్థానాలు దిగజారింది. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఐఎఫ్ పిఆర్ఐ) రూపొందించిన హంగర్ ఇండెక్స్ 2017లో 119 దేశాలకు ర్యాంకులు కేటాయించగా అందులో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం 100వ స్థానాన్ని పొందింది. ఆసియాలో మూడో అతి అధ్వాన దేశంగా ఇండియా నమోదైంది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ మాత్రమే ఇండియాకంటే వెనుకబడిన ఉన్నాయి.
అగ్రరాజ్యపు ఆంక్షలతో ప్రపంచమంతా ప్రక్కన పెట్టిన ఉత్తర కొరియా, మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కంటే ఆకలి ర్యాంకుల్లో ఇండియా వెనుకబడి ఉంది. 2014 నుంచి గడచిన మూడు సంవత్సరాల్లోనే ఇండియా ర్యాంకు 55 నుంచి ఏకంగా 100కు పడిపోవడం గమనార్హం. ఆకలి ఇండెక్స్ గణించడానికి 2015 నుంచి కొత్త ఫార్ములాను అనుసరిస్తున్నారు. 2006 నుంచి 2014 వరకు ఒక ఫార్ములాను అమలుపరిచారు. ఇండియా ర్యాంకు గణనీయంగా తగ్గడానికి ఇది కూడా ఒక కారణం.
ఇండికేటర్ల విలువను స్థిరీకరించి… ’తక్కువ బరువు’ పిల్లలు అనే స్థానంలో ’ఎదుగుదలలో మందగమనం’ అనే అంశాన్ని చేర్చారు. ఇండియాలో ఐదేళ్ళ కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఐదో వంతు మందికి పైగా వారి ఎత్తుకు తగిన బరువు లేరని, ఏకంగా మూడో వంతు పిల్లలు వారి వయసుతో పోలిస్తే ఎత్తు చాలా తక్కవు ఉన్నారని రిపోర్టు స్పష్టం చేసింది. ఇండియా హంగర్ ఇండెక్స్ స్కోరు 31.4గా నమోదైంది. దీంతో ’సీరియస్’ కేటగిరిలో చేర్చారు.
ఇండియా వంటి పెద్ద దేశాల్లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రేటు పెరుగుదల ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని ఆకలి ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.