రాజధాని కాలుష్యం దెబ్బకు రైళ్ళు రద్దు

దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం రవాణా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సెలవు రోజున ఢిల్లీ వాసులకు ఊరట లభించకపోగా… ఆదివారం సమస్య మరింత తీవ్రమై ఏకంగా రైళ్ళనూ రద్దు చేయాల్సి వచ్చింది. వాయు కాలుష్య సాంద్రత రీత్యా 34 రైళ్ళు ఆలస్యంగా నడిచాయి. మరో 21 రైళ్ళను రీషెడ్యూలు చేశారు. ఎనిమిది రైళ్ళు ఏకంగా రద్దయ్యాయి. ఇప్పటికే ట్రక్కుల ప్రవేశంపై ఆంక్షలు విధించగా… ఆదివారం రైళ్ళు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది.

వరదల సమయంలో ట్రాక్ బలహీనంగా ఉంటే రైళ్ళు రద్దు కావడం చూస్తుంటాం. కానీ, వాయు కాలుష్యంవల్ల రైళ్లు రద్దు కావడం అరుదైన విషయం. వారం రోజులనుంచి విపరీతమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయు కాలుష్యం ఎన్నిరోజులు ఉంటే ఆరోగ్యానికి అంత ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ నగరంలోని ఆర్ కె పురం, పంజాబీ బాఘ్ లలో అత్యధిక స్థాయి (999 ఎక్యూఐ) కాలుష్యం నమోదైంది. ఢిల్లీలోని మెజారిటీ ప్రాంతాల్లో 400 నుంచి 700 ఎక్యూఐ వరకు కాలుష్యం ఉంది.

ఫలితంగా ఈ నెల 13 నుంచి 30వ తేదీవరకు వివిధ తేదీల్లో నడవవలసిన ప్రత్యేక రైళ్ళను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 13,20,27 తేదీల్లో నంగల్ దామ్ నుంచి లక్నోకు… 14,21,28 తేదీల్లో ఇటునుంచి అటు నడిచే సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. లక్నో, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే ప్రత్యేక రైలు, హజ్రత్ నిజాముద్దీన్, కొచివేలి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ రైలుతోపాటు.. పూణె, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే ప్రత్యేక రైలు కూడా రద్దయ్యాయి. మరోవైపు.. నేవార్క్ నుంచి న్యూఢిల్లీకి నడిచే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కొద్ది రోజులు రద్దు చేసినట్టు ఎఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

Related posts

Leave a Comment