క్యాప్ జెమిని ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల్లో ఒకరైన సలిల్ పారేఖ్ ఇన్ఫోసిస్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. మూడు నెలల వేట తర్వాత ఇన్ఫోసిస్ యాజమాన్యం సలిల్ పేరును ఖరారు చేసింది. కొత్త సీఈవో జనవరి 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. బాంబే ఐఐటిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన సలిల్… తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీలు అందుకున్నారు.
సలిల్ నియామకాన్ని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని స్వాగతించారు. ఐటీ రంగంలో సలిల్ మూడు దశాబ్దాల అంతర్జాతీయ అనుభవం గడించారని, వ్యాపారాభివృద్ధి ప్రణాళికల అమలులో మంచి ట్రాక్ రికార్డు ఉందని నీలేకని ప్రశంసించారు. సలిల్ హయాంలో క్యాప్ జెమిని ఇండియా టీమ్ 800 మంది నుంచి 85,000 వరకు విస్తరించింది. 2000 సంవత్సరంలో క్యాప్ జెమిని సంస్థ కన్సల్టింగ్ కంపెనీ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ను కొనుగోలు చేసినప్పుడు సలిల్ చేరారు. 2015లో గ్లోబల్ డిప్యూటీ సీఈవోగా, బోర్డు సభ్యునిగా ప్రమోటయ్యారు.
ఇన్ఫోసిస్ పూర్వ సీఈవో విశాల్ సిక్కా ఈ ఏడాది ఆగస్టు 18న తప్పుకోవడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. కొత్త సీఈవోకోసం వెతికే పనిని నీలేకని ఒక ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థకు అప్పగించారు. సిక్కా నిష్క్రమణ అనంతరం తాత్కాలిక సీఈవోగా నియమితులైన యుబి ప్రవీణ్ రావు ఇకపైన సీవోవోగా వ్యవహరిస్తారట. ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకులు కాకుండా బయటినుంచి వచ్చిన సీఈవోలలో పారేఖ్ రెండో వ్యక్తి అవుతారు.
కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా పారేఖ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా ప్రభావితమైన సేవలతో సలిల్ పారేఖ్ ప్రస్తుతం పని చేసే కంపెనీకి నాయకత్వం వహించారని టెక్నాలజీ రీసెర్చర్ సంచిత్ వీర్ గొగియా ప్రశంసించారు.