ఉన్నత స్థానాల్లో నిజాయితీ కావాలి

1 0
Read Time:5 Minute, 24 Second
  • కేవీ చౌదరి ఉద్యోగ జీవితం ఆదర్శప్రాయం..
  • రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రదాన సభలో సిఎం.

ఉన్నత స్థానాలలో ఉన్నవారు క్రమశిక్షణ, నిజాయితీతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని ఉదహరిస్తూ… ఆయన ఉద్యోగ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు. తప్పు చేస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టని తత్వం ఆయనదని ప్రశంసించారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ఉదయం జరిగిన రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి పురస్కార గ్రహీతలను సత్కరించారు.

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరికి ముఖ్యమంత్రి విశిష్ఠ పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ గీతా వేముగంటి, ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, తెలుగు రంగస్థల నటుడు ఆర్ నాగేశ్వరరావు (సురభి బాబ్జి)లకు విశేష పురస్కారాలు అందించారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తిని… నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడని వ్యక్తిగా సిఎం కొనియాడారు. స్టెమ్ సెల్ థెరపీలో డాక్టర్ గీత జరిపిన పరిశోధనలు అంతర్జాతీయంగా ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయని, నాటక రంగానికి సురభి బాబ్జి చేస్తున్న విశేష కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించిందని గుర్తు చేశారు.

రామినేని ఫౌండేషన్ అనేక సంవత్సరాలుగా సమాజంలోని వేర్వేరు రంగాల్లో వెలుగొందుతున్న ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారిని పురస్కారాలతో గౌరవిస్తూ ఒక ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పిందని సిఎం ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ ఏడాది పురస్కారాలు అందుకున్న ప్రముఖులలో ఒక్కొక్కరూ ఆయా రంగాలలో విశిష్ఠ వ్యక్తులుగా ఉన్నారని అన్నారు. సమాజంలో అత్యుత్తమ వ్యక్తులను గౌరవించుకోవడం ద్వారా వర్తమాన, భవిష్యత్ తరాలు స్ఫూర్తిపొందుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

సాంకేతికత దుర్వనియోగం కాకూడదు

ఆధునిక సాంకేతికత దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. కాలానుగుణంగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో దాన్ని అభివృద్ధి కోసం వినియోగించుకోవడం కూడా అంతే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికత ఎంత పెరిగినా మానవ విలువలను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సాంకేతికతకు బానిసగా మారితే చాలా సమస్యలు వస్తాయని, ఇప్పటికే అందరూ యాంత్రిక జీవులుగా తయారవుతున్నారని అన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న దేశం మనదని, దాన్ని ఎవరూ విస్మరించరాదని చెప్పారు.

జనాభాను నియంత్రించుకుంటూ పోతే యువజనుల శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం జపాన్ అటువంటి స్థితిని ఎదుర్కొంటోందనని గుర్తుచేశారు. ఒకప్పుడు అధిక సంతానం భూమికి భారంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా తగినంత సంతానాన్ని కనాలని ప్రోత్సహించాల్సి వస్తోందన్నారు. సమాజంతో పాటు, ప్రకృతిని కూడా ప్రేమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని అన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశంలో ఒక నూతన అధ్యాయానికి తెరతీశామని చెప్పారు. కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply