‘చైనా’లో అంతర్యుద్ధం..!

admin
2 0

‘నారాయణ’ది మోసం, అధికార దుర్వినియోగం : సుష్మ

‘చైతన్య’ నీచం, విద్యార్ధులను కొంటున్నారు : నారాయణ జీఎం

ఆ రెండూ ప్రైవేటు విద్యా సంస్థల్లో ధిగ్గజాలు. ఇంటర్మీడియట్, ఎంసెట్ కోచింగ్ సంస్థలతో ప్రారంభమైన వారి ప్రస్థానం ఎల్ కెజి నుంచి మెడికల్ పీజీ విద్య వరకు విస్తరించింది. మొదటి వారిద్దరూ పోటీదారులు. పోటీ అంటే అలాంటిలాంటి పోటీ కాదు. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ నువ్వా- నేనా అన్నట్టుగా ఉండేవారు. తర్వాత ఓ సుదినాన ఇద్దరికీ సయోధ్య కుదిరింది. ఇద్దరూ కలసి రెండు సంస్థల పేర్లూ కలసి వచ్చేలా ఓ అకాడమీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరూ ఎవరో... ఆ సంస్థలేవో ఇప్పటికే అర్ధమై ఉండాలి.

చైతన్య, నారాయణ.. వారి స్నేహానికి గుర్తుగా వెలసిందే ’చైనా’ అకాడమీ. ఇప్పుడా స్వల్ప కాల స్నేహానికి గ్రహణం పట్టినట్టుంది. నారాయణ, చైతన్య సంస్థల మధ్య మళ్ళీ యుద్ధ వాతారవణం నెలకొంది. తాజాగా నెల్లూరు కేంద్రంగా నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల మధ్య వివాదం రాజుకుంది. తమ విద్యార్ధులను శ్రీచైతన్య సంస్థ ఎత్తుకెళ్లిందని ’నారాయణ’ కేసు పెడితే.. అధికార దుర్వినియోగంతో తమ సిబ్బందిని బంధించారని శ్రీచైతన్య సంస్థ మండిపడింది.

పరిస్థితి కేసుల వరకు వెళ్ళిన నేపథ్యంలో.. చైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్, విద్యా సంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కుమార్తె సుష్మ ’నారాయణ’ మీద అంతెత్తున మండిపడ్డారు. నారాయణ విద్యా సంస్థలకు మూల కేంద్రమైన నెల్లూరులోనే ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలకు స్పందనగా నారాయణ విద్యా సంస్థల జీఎం హైదరాబాదులో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి నారాయణ విద్యా సంస్థల అధిపతి, మంత్రి పి. నారాయణ చుట్టూ తిరుగుతోంది. ఎవరెవరు ఏమేమన్నారో...

’నారాయణ’ది మోసం...అధికార దుర్వినియోగం

ఐదేళ్ళుగా ’నారాయణ’తో కలసి పని చేస్తున్న తాము విసిగిపోయామని శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ బొప్పన సుష్మ వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్ళలో అనేక మోసాలను, అవమానాలను భరించామన్న సుష్మ... ఇక తాము ‘నారాయణ’తో కలసి పని చేయలేమని స్పష్టం చేశారు. నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లారన్న ఆరోపణలపై ఆమె స్పందించారు.

వారం రోజుల క్రితం నెల్లూరు నుంచి ముగ్గురు విద్యార్థులు హైదరాబాదులోని శ్రీచైతన్య కోచింగ్‌ సెంటర్‌లో చేరేందుకు వచ్చారని, వారిని తల్లిదండ్రులే తీసుకొచ్చి తమ సంస్థలో చేర్చారని సుష్మ చెప్పారు. అయితే, ఆ విద్యార్థులను తాము కిడ్నాప్‌ చేశామంటూ ఓ విద్యార్థి తల్లిచేత నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు పోలీసు కేసు పెట్టించారని, ఆ కేసు ఆధారంగా తమ కళాశాల సిబ్బంది ఇద్దరిని నెల్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని కనిపించకుండా దాచారని ఆరోపించారు. తమ సిబ్బందిని విడిపించాలని జిల్లా ఎస్పీని, పోలీసు అధికారులను కోరితే... మా సంస్థలో చేరిన ముగ్గురు విద్యార్థులను నెల్లూరు పంపితేనే విడుదల చేస్తామన్నారని సుష్మ ఆరోపించారు.

అధికార దుర్వినియోగంతో నారాయణ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని సుష్మ మండిపడ్డారు. 31 సంవత్సరాలుగా శ్రీచైతన్య విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని, విద్యార్థులను అపహరించి మరీ తమ సంస్థలో చేర్చుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏటా తాము సాధించిన ఫలితాలను నారాయణ సాధించినట్టుగా ప్రకటించుకుంటున్నారని ఆక్షేపించారు.

ఇక నారాయణ విద్యాసంస్థలతో కలసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. తమ కళాశాల సిబ్బందిని స్టేషన్‌ నుంచి బయటకు ఎలా తెప్పించాలో తమకు తెలుసని సుష్మ వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ సొంత జిల్లాకే వచ్చామని, తమ సిబ్బందిని విడిపించుకొనే వెళుతామని సవాలు స్వరంతో చెప్పారు సుష్మ.

‘శ్రీచైతన్య నీచం... మా విద్యార్ధులను కొంటున్నారు’

శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ ఆరోపణలకు నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తమ విద్యార్ధుల తల్లిదండ్రులను ప్రలోభ పెట్టి హైదరాబాద్ లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు తరలించుకున్నారని ఆరోపించారు. శ్రీచైతన్యది నీచమైన వ్యవహారమని, తొలినుంచీ అనేక సంస్థల్లోని విద్యార్ధులను ఇదే విధంగా తమ సంస్థల్లో చేర్చుకునేవారని దుయ్యబట్టారు.

తమ విద్యా సంస్థలపైనా అనైతిక చర్యలకు పాల్పడ్డారన్న విజయభాస్కర్ రెడ్డి, ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలోనూ ఇలాగే చేశారని ఆరోపించారు. తమ వద్ద ప్రతిభావంతులుగా తయారైన పిల్లలను, వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని వారి తల్లిదండ్రులను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. ఆ విధంగా ప్రలోభపెట్టిన శ్రీచైతన్య సిబ్బందిపైన తాము నెల్లూరులో పోలీసు కేసు పెడితే... తమ తప్పును కప్పిపుచ్చుకోవడంకోసం ప్రత్యారోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.

విద్యార్ధులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం సహజమేనని చెబుతున్న శ్రీచైతన్య సంస్థ డైరెక్టర్ సుష్మ, ఏడాది మధ్యలో ఎందుకు మారారో చెప్పాలన్నారు. ర్యాంకులకోసం తమ విద్యార్ధులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించిన విజయభాస్కర్ రెడ్డి, ఇలాంటి చర్యలు మానుకోవాలని శ్రీచైతన్య సంస్థలకు హితవు పలికారు.

Next Post

టీడీపీకి రేవంత్ టాటా... ఎమ్మెల్యే పదవికీ రాజీనామా!

‘నారాయణ’ది మోసం, అధికార దుర్వినియోగం : సుష్మ ‘చైతన్య’ నీచం, విద్యార్ధులను కొంటున్నారు : నారాయణ జీఎం ఆ రెండూ […]
error

Enjoy this blog? Please spread the word