4-5 శాతం ఇవ్వాలని బీసీ కమిషన్ సిఫారసు
5శాతం ఇద్దామన్న సిఎం.. ఒకే అన్న కాపు మంత్రులు
అదనపు కోటా కాబట్టి తమకూ ఓకే అన్న బీసీ మంత్రులు
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముతో తంటా…! కాపు రిజర్వేషన్ల విషయంలో ఇదీ ప్రభుత్వ పరిస్థితి. రాజకీయంగా కత్తిమీద సాములాంటి కసరత్తు. అందుకే… ఆచితూచి చర్చను పొడిగించి అందరిచేతా ఇక తప్పదు అనిపించి అప్పుడు లాంఛనప్రాయమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాజకీయంగా బలహీనవర్గాల మద్ధతు కోల్పోకుండా… గత ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపారని భావిస్తున్న కాపులను నిలబెట్టుకోవడానికి సుదీర్ఘ కసరత్తే చేశారు.
చివరికి బీసీ కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించే ముందు కూడా సిఎం అభిప్రాయ సేకరణ ఆపలేదు. శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చివరిసారి ఇరువర్గాలకు చెందిన (కాపు, బీసీ) మంత్రులను అడిగి ప్రతిపాదనను ఆమోదింపజేశారు. నిజానికి జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ 4, 5 శాతం మధ్య రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. అయితే, ముఖ్యమంత్రి 5 శాతం ఇద్దామని ప్రతిపాదించారు. ఇదే విషయమై.. మంత్రివర్గ సమావేశంలో కాపు మంత్రులను అడిగారు. ‘5 శాతం రిజర్వేషన్ ఓకేనా’ అన్న సిఎం ప్రశ్నకు కాపు మంత్రులంతా ఖుషీ అయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి బీసీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులను ఇదే విషయమై అడిగారు.
కాపులను బీసీలలో చేర్చినా తమ రిజర్వేషన్లకు కోత వేయకుండా అదనపు కోటా ఇస్తున్నందున ఇబ్బంది లేదని బీసీ వర్గాలకు చెందిన మంత్రులు అభిప్రాయపడ్డారు. దానికి తోడు రాజకీయ రిజర్వేషన్లు ఉండవు కాబట్టి… కాపులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించడంవల్ల ఎవరికీ నష్టం లేదని వారు పేర్కొన్నారు. కోటాపై కాపు మంత్రులు, బీసీలలో చేర్చడంపై ఆయా వర్గాలకు చెందిన మంత్రుల తుది అభిప్రాయం తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనపై మిగిలినవారివైపు తిరిగారు. దీంతో.. రిజర్వేషన్ నిర్ణయానికి మంత్రివర్గ లాాంఛనం పూర్తయింది.
ఏడాదిన్నర క్రితం కాపు రిజర్వేషన్ల అంశంపై కసరత్తు ప్రారంభమైనప్పుడు ఈ పరిస్థితి లేదు. బీసీ కమిషన్ ను నియమించే సమయానికి మంత్రివర్గంలో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సమాజంలో అయితే… బీసీలలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కాపులను బీసీలలో చేర్చడంవల్ల సామాజికంగానే కాకుండా ఆర్థికంగా కూడా వెనుకబడిన తమకు నష్టం జరుగుతుందని బలహీనవర్గాల నుంచి అభ్యంతరాలు బలంగా వ్యక్తమయ్యాయి. బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణలోనూ అనేక చోట్ల గందరగోళం నెలకొంది. కాలక్రమంలో ఈ ఆందోళన కొంత తగ్గింది. బీసీలకు నష్టం జరగకుండా అదనపు కోటా ఇస్తామన్న వాదనను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా…బలహీనవర్గాల ఆందోళనను తగ్గించడంలో పాక్షికంగా విజయవంతమయ్యారు. రాజకీయ రిజర్వేషన్ కల్పించడం లేదు కాబట్టి.. బీసీ రాజకీయ నేతలకూ పెద్దగాా అభ్యంతరం లేకుండా పోయింది.