‘5 ట్రిలియన్లు’ కలేనా..?! జీడీపీ ర్యాంకుల్లో 7వ స్థానానికి జారిన ఇండియా

39 0

2024 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా పరిణతి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బీజేపీ గల్లీ నేతల వరకు ఊరూరా చెబుతున్నారు. రెండోసారి గెలిచాక మోదీ తన ప్రధాన లక్ష్యం ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే పరిస్థితులున్నాయా? అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానలకంటే సందేహాలే ఎక్కువగా వినవస్తున్నాయి.

2025 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల (రూపాయల్లో 350 లక్షల కోట్ల) ఎకానమీ కావాలంటే స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సగటున 8 శాతం పైనే వృద్ధి చెందాల్సి ఉంటుందని ప్రభుత్వమే చెప్పింది. మరి ఆరేళ్ళపాటు అంత వృద్ధి రేటు సాధ్యమవుతుందా?

ఇండియా వృద్ధి రేటు మందగమనం దిశగా సాగుతోందని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్నాయి. నిన్న (ఆగస్టు 1న) రేటింగ్ సంస్థ ‘క్రిసిల్’ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం వెలువడిన ప్రపంచ బ్యాంకు ర్యాకులు భారతీయ ఆశలకు శరాఘాతంలా తగిలాయి. జీడీపీ ర్యాంకుల్లో ఇండియా 7వ స్థానానికి పడిపోయింది. 2018 జీడీపీ ర్యాంకుల ప్రకారం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యు.కె., ఫ్రాన్స్ తర్వాత ఇండియా 7వ స్థానంలో ఉంది. ఇటలీ, బ్రెజిల్, కెనడా తర్వాత మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇండియా ఈసారి యు.కె.ను అధిగమించి 5 ర్యాంకుకు ఎగబాకుతుందని ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. కొంతమంది ఏకంగా 5 స్థానానికి వెళ్లినట్టే ప్రచారం చేశారు. అందుకు భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్ (6) కంటే వెనక్కు వెళ్లింది.

2018లో ఇండియా జీడీపీ 2.726 ట్రిలియన్ డాలర్లుగా ప్రపంచ బ్యాంకు తేల్చింది. ఈ రోజు రూపాయి మారకం విలువ ప్రకారం అది రూ. 189.86 లక్షల కోట్లు. ఫ్రాన్స్ జీడీపీ ఇండియా కంటే సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఉంది. అమెరికా జీడీపీ 20.494 ట్రిలియన్ డాలర్లు కాగా, చైనా జీడీపీ 13.608 ట్రిలియన్లు. జపాన్ 4.971 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ 3.997 ట్రిలియన్ డాలర్లు, యు.కె. 2.825 ట్రిలియన్ డాలర్లతో 3,4,5 స్థానాల్లో ఉన్నాయి.

5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంలో ఇండియా ప్రస్తుత జీడీపీ సుమారు 54 శాతంగా ఉంది. 2024 నాటికి మిగిలిన మొత్తాన్ని సాధించడం సాధ్యమా? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. ఆర్థిక వ్యవస్థ ఏటా ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. వృద్ధి రేటు ఎంత అన్నదాన్నిబట్టే లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా? అన్న అంశం ఆధారపడి ఉంటుంది.

తాజా గణాంకాల ప్రకారం.. 8 ప్రధాన పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అందులో 4 రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. డిమాండ్ పడిపోయింది. పెట్టుబడి తగ్గిపోయింది. బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయి. కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు అసాధారణంగా పడిపోయాయి.

నిజానికి ప్రతికూలతలు కొద్ది సంవత్సరాలుగా క్రమంగా పెరిగాయి. గతం నుంచీ వచ్చిన ప్రతికూలతలకు తోడు.. మోదీ అధికారంలోకి వచ్చాక అనుసరించిన విధానాలు, వాటిలో ముఖ్యంగా 2016లో చేపట్టిన నోట్ల రద్దు, 2017లో చేపట్టిన జీఎస్టీ కూడా జీడీపీ వృద్ధి రేటును ప్రభావితం చేశాయి. అయితే, ప్రభుత్వం చూపుతున్న జీడీపీ వృద్ధి రేటు లెక్కల్లో మాత్రం అవేవీ ప్రతిఫలించలేదు. తమ విధానాలతో ప్రతికూల ఫలితాలు వచ్చాయన్న విమర్శను తిరస్కరిస్తూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం, సవరించిన గణాంకాల్లో వృద్ధి రేటు పెరిగినట్టుగా చూపించింది.

భారత జీడీపీ గణాంకాలపై ఇంటా బయటా సందేహాలు ముసురుకున్నాయి. ఐఎంఎఫ్ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అయితే... ఓ పరిశోధనాత్మక పత్రాన్నే సమర్పించారు. 7 శాతం దాటిందని ప్రభుత్వం చెబుతున్న జీడీపీ వృద్ధి రేటు నిజానికి 5 శాతం దాటలేదని ఆయన నిర్ధారించారు.

ప్రధాన ఆర్థిక సూచీలు మందగమనం లేదా తిరోగమనంలో ఉంటే.. జీడీపీ వృద్ధి రేటు 7-8 శాతం ఎలా సాధ్యమన్న ఇంగితజ్ఞానం సామాన్యుల్లోనూ ప్రభుత్వంపై సందేహాలను పెంచుతోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పులో ఒప్పులో ప్రక్కన పెడితే.. ఆ ప్రాతిపదికల ప్రకారం చూసినా జీడీపీ ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. తక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అభివృద్ధి చెందిన దేశాలకంటే జీడీపీ ర్యాంకుల్లో వెనుకబడటం ఇందుకు ఒకానొక తార్కాణం.