ఇండియాతో ఆర్థిక, రక్షణ భాగస్వామ్యం.. హైదరాబాద్ సదస్సులో ఇవాంకా

7 0

ప్రధాని, భారతీయ నిపుణులపై ప్రశంసల జల్లు

‘మహిళా సాధికారతతోనే పూర్తి పురోగతి’

‘అమెరికాలో మహిళల వ్యాపారాల ఆదాయం ట్రిలియన్ డాలర్లు’

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ల సదస్సు (జిఇఎస్) 2017 ఇండియా, అమెరికా మధ్య పెరుగుతున్న ఆర్థిక, రక్షణ భాగస్వామ్యానికి సూచిక అని వైట్ హౌస్ సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇండియా నిజమైన ఫ్రెండ్ అని తన తండ్రి ట్రంప్ చెప్పారని గుర్తు చేశారు. మంగళవారం హైదరాబాద్ హైటక్స్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైన జిఇఎస్2017 ప్రారంభ సభలో ఇవాంకా మాట్లాడారు. ఈ సదస్సుకు 127 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

జిఇఎస్ భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి అని, ఇరు దేశాల ప్రజల మధ్య బలోపేతమవుతున్న స్నేహబంధానికి ఈ సదస్సు ఒక  తార్కాణమని ఇవాంకా పేర్కొన్నారు. చిన్నతనంలో టీ అమ్మిన స్థాయినుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టేవరకు నరేంద్ర మోదీ రూాపాంతంరం చెందిన తీరును ప్రశంసించిన ఇవాంకా... భారతీయులు తమను ఎప్పుడూ స్ఫూర్తినిస్తున్నారని కొనియాడారు.

జీఈఎస్ థీమ్ ‘ఉమన్ ఫస్ట్.. ప్రాస్పెరిటీ ఫర్ ఆల్’ను ప్రస్తావిస్తూ సదస్సుకు మెజారిటీ మహిళలే హాజరు కావడాన్ని ఇవాంకా ప్రస్తుతించారు. మహిళలు సాధికారత సాధిస్తేనే కుటుంబాలు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోగలుగుతాయని పేర్కొన్నారు. మహిళలు తమను తాము రుజువు చేసుకోవడానికి పురుషుల కంటే ఎక్కువ కష్టపడవలసి వస్తోందని, ఈ విషయాన్ని తాను మాజీ వ్యాపారవేత్తగా, పురుషాధిపత్యం ఉన్న పరిశ్రమలో ఒక ఎగ్జిక్యూటివ్ గా ప్రత్యక్షంగా చూశానని ఇవాంకా చెప్పారు.

2014, 16 మధ్య ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో మహిళల సంఖ్య 10 శాతం పెరిగిందన్న ఇవాంకా.. అమెరికాలో మహిళలు సొంతదారులైన వ్యాపారాల వాటా 45 శాతానికి చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం కోటీ పది లక్షల మంది అమెరికన్ మహిళలు సొంత వ్యాపారాల్లో ఉన్నారని, వారు 90 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారని, మొత్తంగా ట్రిలియన్ డాలర్ల (రూ.65 లక్షల కోట్ల) ఆదాయాన్ని సముపార్జిస్తున్నారని ఇవాంకా వివరించారు.

ఒక అధ్యయనం ప్రకారం... లింగ వివక్షను అధిగమిస్తే ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 2శాతం మేరకు పెరుగుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై ప్రధాని మోదీ విశ్వాసాన్ని ప్రశంసిస్తూనే... ఒక్క విషయాన్ని పరిశీలించాలని, శ్రమ శక్తిలో లింగభేదాన్నిఅరికడితే వచ్చే మూడేళ్లలో 150 బిలియన్ డాలర్లమేరకు పెరుగుతుందని ఇవాంకా చెప్పారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 70 శాతం మహిళలు చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో ఉన్నారని, వారికి రుణ సదుపాయం నిరాకరిస్తున్నారని ఆక్షేపించిన ఇవాంకా... ఆయా దేశాల్లో మహిళలకు 300 బిలియన్ డాలర్ల రుణ లోటు ఉందని చెప్పారు. పెట్టుబడి పెట్టేవారు పురుషులనేమో లాభాలకు ఉండే అవకాశాలను అడుగుతూ... మహిళలనేమో నష్టాలకు ఉండే అవకాశంపై ప్రశ్నిస్తున్నట్టు హార్వార్డ్ బిజినెస్ రివ్యూ రిపోర్టు పేర్కొందని ఇవాంకా ఎత్తి చూపారు. మహిళలకు శిక్షకులు కూడా దొరకడంలేదన్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ప్రభుత్వం గత ఏడాది కాలంలో మహిళా సాధికారత కోసం చాలా చర్యలు చేపట్టిందని ఇవాంకా చెప్పారు.