ఇవాంకా… అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్!

7 0

ఇవాంకా ట్రంప్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె. అంటే అమెరికాకే మొదటి కుమార్తె! భవిష్యత్తులో ఆమే అమెరికా మొదటి పౌరురాలు అవుతుందట!! అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ప్రెసిడెంట్ కావాలన్న కోరిక ఇవాంకాకు బలంగా ఉందట. అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశంకోసమే ఆమె తండ్రి పాలనా యంత్రాంగంలో భాగమైందట. ఆ ఒప్పందంపైనే ఆమె, ఆమె భర్త జేర్డ్ కుష్నర్ వైట్ హౌస్ లో చేరారంటున్నారు జర్నలిస్టు మైఖేల్ ఉల్ఫ్. ఆయన రాసిన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ - ఇన్ సైడ్ ట్రంప్ వైట్ హౌస్’లో ఇలాంటి సంచలన విషయాలు ఎన్నో ఉన్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తన కుమార్తె ఇవాంకాను సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే. తన వైట్ హౌస్ సలహాదారు పాత్ర భవిష్యత్తులో అధ్యక్ష పీఠానికి దగ్గర చేస్తుందని ఇవాంకా భావిస్తున్నట్టు మైఖేల్ ఉల్ఫ్ పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎంతమంది వద్దన్నా వైట్ హౌస్ లో చేరినట్టు తన పుస్తకంలో రాశారు. అమెరికాలో తాజా సంచలనానికి కారణమైన ’ఫైర్ అండ్ ఫ్యూరీ‘ ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఇవాంకా దంపతుల పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బేనన్ ఈ ఒప్పందంగురించి విన్నప్పుడు భయపడ్డారని మైఖేల్ ప్రస్తావించారు.

ఈ పుస్తకంలోని మిగిలిన అంశాాల మాట ఎలా ఉన్నా ఇవాంకా ట్రంప్ పాత్రపై పేర్కొన్న అంశాలు ఇప్పటికే తలెత్తిన అనుమానాలకు దగ్గరగా ఉన్నాయి. ఇవాంకా తండ్రిని, పాలనను ప్రభావితం చేసే శక్తిగా మారారనే విమర్శలు తొలి ఏడాదే వచ్చాయి. తండ్రి తర్వాత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే కోరిక ఆమెకు ఉండటం సహజమనే అభిప్రాయం వినిపిస్తోంది. 228 సంవత్సరాల చరిత్రలో ఒక్క మహిళనూ అధినేతగా ఎన్నుకోని దేశం అమెరికాకు ‘తొలి ప్రెసిడెంట్’ అయ్యే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఇవాంకా అసలే వదులుకోదు.

’ఫైర్ అండ్ ఫ్యూరీ’ కవర్ పేజీ