‘నెలవంక’ అంతర్ధానమైంది…! ఇప్పుడు ‘రాచమర్యాద‘లపై చర్చ

admin
8 0

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘అతి’థి మర్యాదలతో..

హైజాకైన ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్

ఇవాంకా.. అమెరికా నెలవంక! తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ళ పతాక శీర్షికల నిండా ఇదే విశేషణం. ఆమె అందచందాలు, నవ్విన.. మాట్లాడిన తీరు, ధరించిన వస్త్రాలు, వాటి ఖరీదు.. డిజైన్లు, ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన విందులో వడ్డించిన ప్రత్యేక పదార్ధాలు వగైరా వగైరాలన్నీ వార్తా కథనాల రూపం దాల్చాయి. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్) 2017కోసం హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కు రెండు రోజులపాటు భాగ్యనగరిలో రాచమర్యాదలు జరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పోటాపోటీగా ‘నెలవంక’కు డిజైనర్ దుస్తుల, నగలు సమర్పించుకున్నారు. నిజాం నవాబు కట్టించిన ఫలక్ నుమా ప్యాలెస్ లో తొలి రోజు, గోల్కొండ కోటలో మలి రోజు రాత్రి విందులు పసందుగా సాగాయి. ఒక ఉపన్యాసం, రెండు ప్యానల్ చర్చలు, విందులు, వినోదాలు ముగించుకొని... మర్యాదలు, బహుమతులు మూటగట్టుకొని బుధవారం రాత్రి ఎమిరేట్స్ విమానమెక్కి ఈ నెలవంక అదృశ్యమైపోయింది.

ఇప్పుడొక చర్చ మొదలైంది. అసలు ఇవాంకా ఎవరు? అదేం ప్రశ్న..ఆమె అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడి కూతురు.. (జీతం తీసుకోని) సలహాదారు కూడా..! ఒక సలహాదారుకు ఈ స్థాయిలో రాచ మర్యాదలుంటాయా? గతంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా కనీ వినీ ఉన్నామా? ఒక దేశాధ్యక్షుడికి, అందునా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి తప్ప మరే దేశాధినేతకూ జరగనంత మర్యాద ఇవాంకాకు జరిగింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు అతిధి మర్యాదలు చేశారు. ఆమెతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం, వారిద్దరూ కలసి జీఈఎస్2017ను ప్రారంభించడం, ప్రధాని స్థాయిలో ఇవాంకా గౌరవార్ధం విందు ఇవ్వడం, అది కూడా హైదరాబాద్ వచ్చి మరీ ఆయన ఏర్పాటు చేయడం అత్యంత అరుదైన పరిణామాలు.

ఇవాంకా పర్యటనలో చోటు చేసుకున్న ఈ ‘అతి’ సరికొత్త చర్చకు కారణమైంది. భారత ప్రభుత్వ ఔన్నత్యాన్ని, ప్రధానమంత్రి పదవి స్థాయిని నరేంద్ర మోదీ తగ్గించారన్న విమర్శ ప్రతిపక్షం నుంచి వినిపించింది. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ (జీఈఎస్) 2017లో ఇవాంకా, నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు ఈ విమర్శలకు తావిచ్చింది. (ఇక్కడ ఇవాంకా పేరు ముందు రాయడానికి ఓ కారణముంది. వార్తలకు ప్రామాణికంగా భావించే ఓ టీవీ ఛానల్ నిన్న ఇవాంకా పేరు ముందు చెప్పి ప్రధాని పేరు తర్వాత చెప్పింది. ఆ స్థాయిలో ఇవాంకా ఫీవర్ ప్రభుత్వాలను, మీడియాను కమ్మేసింది).

ఇవాంకా షోకు సమర్ధనలివే

మొత్తంగా జీఈఎస్2017 హైజాకైంది. ఇవాంకా, మోదీ షోలా నడిచింది. అసలు ఉద్దేశాలు మరచి కొసరు అంశాలపైనే చర్చంతా సాగింది. ఏ వంక చెప్పినా ఇవాంకా పర్యటనలో ప్రొటోకాల్స్ పాటించలేదనే విషయం సుస్పష్టం. ఓ సినిమా తార (మహిళ) వస్తే అభిమానులు ఎలా ముచ్చటపడతారో... అచ్చు అలాగే ప్రభుత్వాలు, పారిశ్రామిక రంగ పెద్దలు ఇవాంకా చుట్టూ తిరిగారు. ‘మహిళలే ఫస్ట్’ అన్న థీమ్ కదా.. అందుకే ఇవాంకాకు అంత మర్యాద ఇచ్చారని సమర్ధించేవారు కొందరు. అదే నిజమైతే ఇవాంకా-మోదీ జీఈఎస్ ప్రాంగణమంతా కలియదిరుగుతున్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రేక్షకుల స్థానంలో కూర్చునేవారా?

కేవలం సలహాదారుగానే కాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రభావితం చేసే శక్తి అయినందున ఇవాంకాకు ఈ స్థాయి ప్రాధాన్యత అనేది మరో సమర్ధన. అమెరికా అధ్యక్షుడిని ప్రభావితం చేయవలసిన అవసరం ఏ అంశంలో భారత ప్రభుత్వానికి వచ్చిందో తెలియదుగాని, ఈ సమర్ధన విడ్డూరంగా ఉంది. దీనికి చైనా ఉదాహరణ చెబుతున్నారు. చైనా పట్ల ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ చాలా కటువుగా ఉన్నారని, ఆయన మనసు మార్చింది ఇవాంకానేనని, అందువల్లనే ట్రంప్ చైనా పర్యటన సాధ్యమైందని అమెరికా ప్రతినిధి బృందంలోని ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలను ఎవరు ప్రభావితం చేస్తే వారికి అధికారిక హోదాలో రాచమర్యాదలు చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిచ్చేవారు లేరు.

అధ్యక్షుడి అందమైన కూతురు కాకపోతే...!

అసలు అమెరికా అధ్యక్షుడి (శ్వేతవర్ణపు) అందమైన కూతురు కాకపోతే... ఓ సాధారణ సలహాదారుగా ఇవాంకాకు ఇందులో వందో వంతు మర్యాద చేసేవారా? అది కూడా నరేంద్ర మోదీ కాకుండా మరొకరు ప్రధానమంత్రిగా ఉంటే ఇంత ‘అతి’ ఉండేదా? మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పరోక్షంగా రాజకీయాధికారం సాగించేవరకు వచ్చిన ఇవాంకాకు కారణాలవేవైనా భారత కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ అతిథి మర్యాదలు చేశాయి. ప్రభుత్వాలు అధికారికంగానే బాకా ఊదుతున్నప్పుడు మీడియా సహజంగానే అదే మంత్రం జపించింది. జీఈఎస్ ప్రారంభ సభలో ఇవాంకా పొగడ్తలకు ప్రధానమంత్రి ఫిదా అయ్యారు. వేదికపై ఇవాంకా ప్రశంసిస్తుంటే.. వేదిక ముందు కూర్చుని మోదీ ముకుళిత హస్తాలతో నమస్కరించారు.

ఇతర అంశాల్లో వచ్చిన విమర్శలను ప్రక్కన పెడితే... జీఈఎస్2017 సదస్సులో ఇవాంకా ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే తేలిపోయారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఫోకస్ ఎక్కువగా ఇవాంకా మీదే ఉందని... ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరై ఉండాల్సింది కాదని కొంతమంది గుసగుసలాడారు. అసలు ఇవాంకాను భారత దేశానికి ఆహ్వానించిందే నరేంద్ర మోదీ అయినప్పుడు ఆయన హాజరు కాకుండా ఎలా ఉంటారు?!

జీఈఎస్ సదస్సులకు అమెరికా అధ్యక్షుడు హాజరు కావడం కద్దు. ఆయన రాకుండా ఈసారి తన కుమార్తెను పంపించారు. అక్కడే ఇండియా జీఈఎస్ ప్రాధాన్యత తగ్గింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ ఈ సదస్సుకు రావలసింది. అయితే, ఇవాంకా వస్తున్న నేపథ్యంలో టిల్లర్ సన్ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. మన దేశం తరపున చురుగ్గా వ్యవహరించాల్సిన విదేశాంగ, వాణిజ్య శాఖల మంత్రులను.. అందునా మహిళలను ప్రేక్షకుల్లా మార్చి, ఇవాంకాకు అన్నీ తానే అయి వ్యవహరించారు ప్రధానమంత్రి. టిల్లర్ సన్ పాటి విచక్షణ ఇక్కడ కనిపించలేదు.

Next Post

ఆయుధాల అమ్మకంతోనే అమెరికాకు రెండున్నర లక్షల కోట్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ‘అతి’థి మర్యాదలతో.. హైజాకైన ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ ఇవాంకా.. అమెరికా నెలవంక! తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ళ […]
error

Enjoy this blog? Please spread the word