ఇవాంకా గో బ్యాక్… గొంతెత్తిన సైబరాబాద్

8 0

ఐటీ ఉద్యోగుల తొలగింపుపై నిరసన

ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారుకు డిజిటల్ సెగ...

#IvankaTrumpGoBack #StopRetrenchmentsInIT

సైబరాబాద్ ఐటీ క్షేత్రంలో ప్రస్తుతం వినిపిస్తున్న డిజిటల్ నినాదాలివి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్. ఆమె హైదరాబాద్ పర్యటనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హైదరాబాద్ నగరంలో మహామహులు స్వాగతిస్తుంటే ఐటీ ఉద్యోగుల్లో మాత్రం నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలతో అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ గుండె మండుతోంది. ఇవాంకా భాగ్యనగరిలో అడుగుపెడుతున్న వేళ ‘రేపటి ఉద్యమం’ ఇదే అంటోంది.

గత వారమే ‘ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్ (హెచ్ఆర్170)’కు అమెరికన్  కాంగ్రెస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీ ఆమోద ముద్ర వేసింది. హెచ్1బి వీసాలతో అమెరికా వెళ్తున్న ఇండియన్ల ఉద్యోగాలకు ఈ చట్టం ఒక మరణ శాసనం. మరోవైపు ఇంట్లో ఈగల మోత ప్రారంభమై చాలా రోజులైంది. గత ఏడాది కాలంలోనే సుమారు లక్షమంది ఐటీ ఉద్యోగులను దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు తొలగించినట్టు అంచనా. ఇదంతా డొనాల్డ్ ‘ట్రంప్ ఎఫెక్ట్’. ఇండియాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమయ్యాక ఉద్యోగుల సంఖ్య నికరంగా తగ్గడం ఇప్పుడే.

’ట్రంప్ ఎఫెక్ట్‘ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ‘ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ భారతీయుల ఉద్యోగాలకు భద్రత ఎందుకు కల్పించరు’ అని ‘ఫర్ ఐటి’ సంస్థ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని... ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల (మీడియా) మొత్తాన్ని ఇవాంకా ఫీవర్ పట్టి పీడిస్తుంటే... ‘ఇవాంకా గో బ్యాక్’ నినాదాన్ని ఇచ్చింది ఫర్ ఐటి (@For_IT) సంస్థ. కచ్చితంగా ఇవాంకా అడుగు పెట్డానికి ముందు సైబరాబాద్ ఐటీ ఉద్యోగులు ఈ నినాదాన్ని అందుకున్నారు.

సంఘటితమైతేనే భద్రత

ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించడంపై ‘ఫర్ ఐటీ’ ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది. కోర్టులో ఒక కేసులో విజయం సాధించింది. ఐటీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్న చట్టాలు ప్రామాణికమైనవేనని, వాటిని అమలు చేయాలని కోర్టు స్పష్టం చేయడం కొంత ఊరటనిచ్చింది. ఒక్కరితో ప్రారంభమైన ఉద్యమం 2000 మంది హైదరాబాద్ లేబర్  కమిషనర్ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేేసేవరకు వచ్చింది. అందులో చాలా మందికి 6 నెలల వేతనాలను పరిహారంగా కంపెనీలు చెల్లించవలసి వచ్చింది.

ఇక్కడ కూడా చిన్నవాళ్లే ఎక్కువగా బాధితులవుతున్నారు. ప్రధానమైన బహుళజాతి కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు కలసికట్టుగా చర్చలు జరిపి ఫలితాలు సాధించుకుంటుండగా ఇతరులు బాధితులై వీధుల్లోకి వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. వారికి ‘ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్’ అండగా నిలుస్తోంది.

చట్టం మనకు మద్ధతుగా ఉంది. ఒకసారి కార్మిక శాఖ కమిషనర్ వద్ద పిటిషన్ దాఖలైతే... దానిపై నిర్ణయం పెండింగ్ లో ఉన్నంత వరకు ఏ కంపెనీ ఉద్యోగిని తొలగించలేదు. కంపెనీలు వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉద్యోగులను తొలగించలేవు. వాళ్లు ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే -ఫర్ ఐటి.

ట్రంప్ కుమార్తె పర్యటనపై అమెరికా ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలుంటే హైదరాబాద్ లో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో అతిథి మర్యాదలు అదరగొడుతున్నాయి. అమెరికా ప్రభుత్వంపై ఐటీ ఉద్యోగులు, ముఖ్యంగా బాధితుల్లో ఎంత మంట ఉందో ‘అప్పుడు సైమన్ గోబ్యాక్.. ఇప్పుడు ఇవాంకా గోబ్యాక్’ అనే నినాదంలో కనిపిస్తోంది. కడుపు కొట్టినవారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంటే వచ్చే స్పందన ఇలాగే ఉంటుంది.

ఎవరు ఏ నినాదమిచ్చినా... ట్రంప్ విధానాలకు భారతీయ ఐటీ నిపుణుల ప్రతిఘటనే వాటిలో కనిపిస్తోంది. ఇవాంకాను స్వాగతిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆమెతోపాటు ‘గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2017’లో పాల్గొనడానికి మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. మోదీకి, ఇవాంకాకు మంగళకరమైన ఈ మంగళవారం ఐటీ ఉద్యోగులు ప్రధానిని ఒక్కటే కోరుతున్నారు. ‘మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ఆగాలి’.