‘అర్ద భూస్వామ్యం’ తప్పు… అందుకే : మావోయిస్టు జంపన్న

1 0
Read Time:6 Minute, 9 Second

సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సహచరి లొంగుబాటు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అలియాస్ జినుగు నరసింహారెడ్డి ఆయన సహచరి అనితతో కలసి తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. 33 సంవత్సరాల ఉద్యమ జీవితం తర్వాత ‘సైద్ధాంతిక’ కారణాలతో తాను మావోయిస్టు పార్టీకి దూరమవుతున్నట్టు జంపన్న ప్రకటించారు. భారత సమాజంపై మావోయిస్టుల అవగాహన ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘అర్ద భూస్వామ్య అర్ద వలస’ నిర్వచనం మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని, అందులో ‘అర్ద భూస్వామ్య’ అన్న అవగాహనకు కాలం చెల్లిందని జంపన్న ఉద్ఘాటించారు. పార్టీ అవగాహనను ఈమేరకు మార్చుకుంటే బాగుండేదన్న జంపన్న… తాను మాత్రం పార్టీ వేదికలో ఈ విషయమై చర్చించలేదని చెప్పారు.

లొంగిపోయిన జంపన్నను, ఆయన సహచరి అనితను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం విలేకరుల ఎదుట హాజరుపరిచారు. తాము స్వచ్ఛందంగా తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోతున్నామని ప్రకటించిన జంపన్న.. ఇందులో ఎవరి బలవంతమూ లేదని, ఈ నిర్ణయానికి రావడానికి ముఖ్య కారణం సైద్ధాంతిక సమస్యలేనని స్పష్టం చేశారు. లొంగిపోవాలన్న తమ నిర్ణయాన్ని స్వేఛ్చగానే పార్టీ నాయకత్వం ముందు చర్చించామని కూడా జంపన్న చెప్పారు. పీపుల్స్ వార్, ఆ తర్వాత సీపీఐ మావోయిస్టు పార్టీ లైన్ ప్రకారం సుదీర్ఘంగా నిజాయితీగా నిబద్ధతతో పని చేశామని జంపన్న పేర్కొన్నారు.

ఆరోజు ఉన్న పరిస్థితుల్లో మేము పార్టీలో పని చేయడం సరైనదే. అది తప్పని అనుకోవడంలేదు. అయితే, గత 10, 15 సంవత్సరాల్లో దేశంలో అనేక సామాజిక మార్పులు జరిగాయి. జరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీ పంథాకు మూలమైన సామాజిక విశ్లేషణ… అర్ధ భూస్వామ్య, అర్ధ వలసలో..అర్ద భూస్వామ్య అనేది సరైనది కాదు. 1980లలో 90లలో ఉన్నట్టుగా భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాల్లో ఒకరో ఇద్దరో భూస్వాములు ఉంటారు. అర్దభూస్వామ్య అనే అవగాహనను మార్చుకుంటే పార్టీకీ, ప్రజలకూ ఉపయోగం. కానీ, పార్టీ ఆ పని చేయలేకపోయింది’’

పార్టీ వేదికపై చర్చించలేదు

‘‘ఈ పరిస్థితుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యునిగా నా పాత్ర కూడా ఉంది. అయితే నేను కమిటీతో చర్చించలేదు. కమిటీ సమావేశాల్లో ఒక వేదికపై చర్చించకపోవడం నాకు సంబంధించిన విషయం’’ అని జంపన్న పేర్కొన్నారు. అయితే, తాను లొంగిపోయే ముందు మాత్రం ఒక నోట్ రూపొందించి పార్టీ కమిటీకి అందించానని, ఆ తర్వాత కేంద్ర కమిటీ సహచరులు కొంతమంది వచ్చి తనతో మాట్లాడారని, పార్టీలోనే ఉండి ఫైట్ చేయాలని సూచించారని జంపన్న వివరించారు. పార్టీ వేదికలో చర్చించి పంథాను మార్చలేమని జంపన్న వ్యాఖ్యానించారు.

జంపన్న, అనితలకు రూ. 30 లక్షలు

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైనందున జంపన్నపై రూ. 25 లక్షలు రివార్డు ఉందని, అనితపై రూ. 5 లక్షలు ఉందని… ఆ మొత్తాన్ని కలిపి వారిద్దరికీ ఇస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. జంపన్న దంపతులు స్వచ్ఛందంగా లొంగిపోయినందున రివార్డు డబ్బును వారికే ఇస్తున్నామని, ఇది కాకుండా ఏవైనా అవసరాలుంటే రీహాబిలిటేషన్ పాలిసీ ప్రకారం జిల్లా యంత్రాంగం సాయం చేస్తుందని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు మరో 135 మంది వివిధ రాష్ట్రాల్లో వివిధ స్థాయిలలో పని చేస్తున్నారని, ఈ విలేకరుల సమావేశం జరిగే సమయంలోనే ఒక మహిళా నక్సలైట్ నిర్మల్ ఎస్పీ ఎదుట లొంగిపోయిందని చెప్పిన డీజీపీ… మిగిలిన అందరూ లొంగిపోవాలని విజ్ఒప్తి చేశారు.

కాగా జంపన్నపై వివిధ రాష్ట్రాల్లో 100 కేసులు ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. అందులో పోలీసుల హత్యలు, స్టేషన్లపై దాడుల కేసులు కూడా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జంపన్న 1984లో పీపుల్స్ వార్ లోకి వెళ్ళారు. అది మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందాక కొనసాగారు. ఉత్తర తెలంగాణ కమిటీకి నాయకత్వం వహించిన జంపన్న.. 2001 నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. జంపన్న సహచరి అనిత 2004లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 2012 నుంచి వారిద్దరూ కలసి జీవిస్తున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply