అమెరికా యుద్ధనౌకను ఢీకొట్టిన జపాన్ బోటు

యుఎస్ నేవీ నౌకలకు ఈ ఏడాది ఇది ఐదో ప్రమాదం

అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ బెన్ ఫోల్డ్ శనివారం ప్రమాదానికి గురైంది. జపాన్ తూర్పు తీరంలోని సగామి బేలో జపాన్ బోటు ఒకటి అమెరికా యుద్ధనౌకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, అయితే యుద్ధ నౌకకు స్వల్పంగా నష్టం జరిగిందని అమెరికా నౌకాదళం తెలిపింది. జపాన్ టగ్ బోటు ఒకటి ప్రొపల్షన్ వ్యవస్థలో లోపం తలెత్తిన కారణంగా యుఎస్ఎస్ బెన్ ఫోల్డ్ వైపు మళ్ళింది.

అమెరికా పసిఫిక్ నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు ప్రమాదానికి గురి కావడం ఈ ఏడాదే ఇది ఐదోసారి. జనవరి 31న ఒక నౌక భూమికి తాకడంతో టోక్యో బేలో 1,100 గ్యాలన్ల ఆయిల్ లీకైంది. 4.2 మిలియన్ డాలర్లమేరకు ఆర్థిక నష్టం వాటిల్లింది. తర్వాత మే9వ తేదీన యుఎస్ఎస్ లేక్ చాంప్లేన్ దక్షిణ కొరియాకు చెందిన ఒక చేపల బోటును ఢీకొట్టింది.

జూన్ 17న జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు నావికులు మరణించారు. యుద్ధనౌక యుఎస్ఎస్ ఫిట్జ్ గెరాల్డ్ ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన కంటైనర్ ఓడను ఢీకొట్టింది. యుద్ధ నౌక బాగా దెబ్బతిని లోపలికి నీరు వెళ్ళింది. ఈ ఘటనలో నీటమునిగి ఏడుగురు అమెరికా నావికులు మరణించారు.

ఆగస్టు 21వ తేదీన యుఎస్ఎస్ జాన్ ఎస్. మెక్ కెయిన్ సింగపూర్ తీరానికి సమీపంలో మలక్కా జల సంథిలో ఒక వాణిజ్య వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా 10 మంది యుఎస్ నావికులు నీట మునిగిపోయారు. యుద్ధ నౌక కంపార్ట్ మెంట్లలోకి నీరు ప్రవేశించింది. ఈ ఘటనలోనే మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే… తమ నావికుల నైపుణ్యాన్ని , సమర్ధతను పెంచే దిశగా సస్కరణలు  చేపడుతున్నట్టు అమెరికా నేవీ ఇటీవల ప్రకటించింది. పసిఫిక్ నౌకా దళంలో పని చేస్తున్న అనేకమంది సిబ్బందికి సరైన శిక్షణ లేదని నిర్ధారించడమే ఇందుకు కారణం. దానికి తోడు పని ఒత్తిడివల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం ఉంది.

Leave a Comment