తమిళనాట కొత్త కమలం వికసిస్తోంది. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్టు మహానటుడు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఎన్నికల్లో పోటీ అనే లక్ష్యానికి మాత్రమే పరిమితం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందడుగు వేయనున్నట్టు ఆయన ప్రకటించారు. తన 63వ పుట్టిన రోజున కమల్ హాసన్ ప్రజాజీవితానికి సంబంధించి తన అభిప్రాయాలను రేఖామాత్రంగా వెల్లడించారు.
పార్టీ ఏర్పాటుకు ముందుగా సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో చర్చకు శ్రీకారం చుట్టిన కమల్ హాసన్, నాలుగు హ్యాష్ ట్యాగ్ లను విడుదల చేశారు. ప్రజలతో చర్చించడంకోసం ఒక ఆన్ లైన్ వేదికను సిద్ధం చేస్తున్నామని, వచ్చే జనవరికి అది సిద్ధమవుతుందని కమల్ చెప్పారు. తాను ఏం చేయాలని ప్రణాళిక వేసుకుంటున్నానోో దానిపై పని ప్రారంభించానన్న కమల్… పార్టీ ఆవిర్భావం, పేరు, ఎజెండా తదితరాలపై ఆలోచనాపరులతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.
త్వరలో తమిళనాడు అంతటా పర్యటిస్తానని కమల్ చెప్పారు. పార్టీ సంబంధించిన ప్రణాళికను వచ్చే జనవరిలో లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘ఒక సంస్థను సుస్థిరం చేయాలంటే పునాదులు గట్టిగా వేయాలి’ అని కమల్ అభిప్రాయపడ్డారు.
ఇవీ కమల్ హ్యాష్ ట్యాగ్స్
#KH, #virtuouscycles, #theditheerpomvaa, #maiamwhistle. ఈ నాలుగు హ్యాష్ ట్యాగ్ లను కమల్ మంగళవారం ఆవిష్కరించారు. ‘తేడి తీర్పోం వా’ అంటే ‘మనం అన్వేషిద్దాం… పరిష్కరిద్దాం’ అనే అర్ధం వస్తుంది. ‘ప్రజలెప్పుడూ వారి సమస్యలతో మీ వద్దకు రాకపోవచ్చు’ అంటున్నారు కమల్. ‘మైయం విజిల్’ అంటే ‘విజిల్ కేంద్రం’ అని అర్ధం. సమస్యలను, తప్పులను ఎత్తిచూపే విజిల్ బ్లోయర్లకోసం ఈ హ్యాష్ ట్యాగ్.
తప్పుడు నేతలకు చోటుండదు
తప్పులు చేసేవారికి తన పార్టీలో చోటు ఉండదని, అక్రమ ధనాన్ని విరాళాలుగా తీసుకునే ప్రశ్నే లేదని కమల్ స్పష్టీకరించారు. గత 30 సంవత్సరాల్లో తన వ్యాపారంలోకి అక్రమ ధనం రాలేదని, అలాగే పార్టీ విరాళాల సొమ్ము ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకునే వీలుందని చెప్పారు.
‘టెర్రరిజం’పై స్పందన
‘హిందూ టెర్రరిజం’పై చెలరేగిన వివాదాన్ని ప్రస్తావించినప్పుడు.. తాను టెర్రరిస్టు అనే పదాన్ని ఉపయోగించలేదని, ఎక్ట్స్రీమ్ (Extreme) అనే పదానికి తమిళంలో ‘తీవరం’ అనే పదాన్ని వాడితే తప్పుగా (Terror అని) అనువదించారని కమల్ చెప్పారు. ఏ మతంలోనూ హింస ఆమోదయోగ్యం కాకూడదని ఉద్ఘాటించారు.
నేను హేతువాదిని
తనను నాస్తికుడని పిలవడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసిన కమల్, ఆ పదాన్ని వాడుతున్నది ఆస్తికులేనన్నారు. తాను హేతువాదినని కమల్ స్పష్టం చేశారు.