తెలంగాణ ఏ ఒక్కరివల్లనో రాలేదు

2 0

  • ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు

  • కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏ  ఒక్కరివల్లనో జరగలేదని, సాధించింది తానేనని కేసీఆర్ చెప్పుకోవడం సరికాదని ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో చేసిన పరుషమైన వ్యాఖ్యలకు కోదండరాం శనివారం స్పందించారు. ముందుగా జెెెఎసి సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ వ్యాఖ్యలపై చర్చించిన కోదండరాం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సిఎం వాడిన భాష హింసను రెచ్చగొట్టేలా ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన మొత్తం కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉందన్న కోదండరాం సిఎం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరుకున్నది ఈ పాలన కాదని, ఉద్యమించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తాము పోరాట పంథాను ఎంచుకున్నామని కోదండరాం చెప్పారు.

టీఆరెస్ ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో వ్యతిరేకించిన అన్ని అంశాలనూ.. ఇప్ఫుడు ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తర్వాత అనుసరిస్తోందని కోదండరాం విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వల్ల నష్టపోయిన పార్టీనే రాష్ట్రం వచ్చాక ఫిరాయింపులకు నాంది పలికిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని కోదండరాం దుయ్యబట్టారు.