పాయింట్ ఫైవ్ కులపోడే తెలంగాణ తెచ్చింది!

1 0
Read Time:9 Minute, 17 Second
  • నేనా దొరను… అసలు దొర ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కోదండరాం టీఆరెస్ పట్ల విషపూరితం
  • విమర్శకులపై విరుచుకుపడ్డ కేసీఆర్

పాయింట్ ఫైవ్ (జనాభాలో 0.5 శాతం) కులపోడు రాజ్యం ఏలడం ఏమిటి…ఇదీ కొంతమంది అడుగుతున్నది. దుర్మార్గమైన భాష. ఈ పాయింట్ ఫైవ్ కులపోడే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్య ఇది. సింగరేణి ఎన్నికల్లో టీఆరెస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ విజయం సాధించిన నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. తన కులాన్ని ప్రస్తావించి తనను దొరగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.తాను జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్న కేసీఆర్… కులంతో ఎవరూ అధికారంలోకి రారని ఉద్ఘాటించారు.

“మా సామాజిక వర్గాన్ని వెలమ దొరలు అంటారు. వాస్తవానికి మేము మైనారిటీ. తెలంగాణ జనాభాలో మా కులం జనాభా 1.1 శాతం ఉంటుంది. అయినా ప్రభుత్వానికి, ప్రజా జీవితానికి కులం ఏమిటి? పని చేస్తే అధికారంలోకి వస్తాం. కులాన్ని బట్టి కాదు. దొర అంటే కులం కాదు. కల్ట్. ఎవరి వద్ద భూమి ఉంటుందో, పెత్తనం చేస్తారో వాళ్ళే దొరలు. మాదగ్గర ఒక కంసాలి దొర ఉన్నాడు. నాకు తెలిసిన ఒక యాదవ, ఒక మాల దొర కూడా ఉన్నారు. నేను దొరను కాదు. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చా” అని కేసీఆర్ విమర్శకులకు బదులిచ్చారు. తాను దొరను కాదని స్పష్టం చేస్తూ తనను విమర్శిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే అసలు దొర అని కేసీఆర్ చెప్పారు.

మేము మైనారిటీ.. అందుకే మంత్రి కావడానికి 13 ఏళ్ళు!

అదే సమయంలో తన కులం జనాభా మైనారిటీ కావడం వల్లనే మంత్రిని కావడం ఆలస్యమైందని చెప్పారు. ”నేను మంత్రి కావడానికి 13 ఏళ్ళు పట్టింది. ఎన్ఠీఆర్ నాతో అనేవాడు. తమ్ముడూ నువ్వు ప్రతిభావంతుడివి.. కానీ కుల సమీకరణాల వల్ల పదవి ఇవ్వలేకపోతున్నా అని.. ఆయన నన్ను చాలా లైక్ చేసేవాడు. 100 సార్లు ఆయనకు నాకు మాట తేడా వచ్చింది. అన్నగారు మీకు ఎవరో తప్పు చెబుతున్నారు… నేను కులం వల్ల గెలవడం లేదు… అని చెప్పా” అని కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లారు.

తెలంగాణ బలహీన వర్గాల రాష్ట్రం అని కేసీఆర్ ఉద్ఘాటించారు. ”సకల జనుల సర్వే ప్రకారం రాష్ట్రంలో 90.65 శాతం జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మ, వెలమ తదితర అగ్ర వర్ణాలన్నీ కలిపినా 9.35 శాతం. ఇక ఈ పీకుడేందుకు?” అని కేసీఆర్ ప్రశ్నించారు. అసలు కేసీఆర్ కు ఏం కుల బలం ఉందని తెలంగాణ వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ అంతా కేసీఆర్ కులమేనని ఉద్ఘాటించారు. తెలంగాణ ఎప్పుడూ కులం ఆధారంగా స్పందించలేదని, అంశాల ఆధారంగానే స్పందించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

కోదండరాం విషపూరితం

కోదండరాం టీఆరెస్ పట్ల పూర్తి విషపూరితంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పదే పదే కోదండరాం ప్రస్తావన తెచ్చిన కేసీఆర్… మొదటినుంచీ అతను టీఆరెస్ కు వ్యతిరేకి అని పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆరెఎస్ అనుబంధ సంగం గెలిస్తే… సంస్థ నాశనం అవుతుందన్న కోదండరాం వ్యాఖ్యలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.

కోదండరాం అనేవాడు ఎవరు. నేను తయారు చేసిన వేల మంది కార్యకర్తల్లో వీడొకడు. ఇప్పుడు జేఏసి పేరుతో పూర్తిగా లోపాయికారీగా పని చేస్తున్నారు. అమరుల యాత్ర అంటాడు… మొదటి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబంతో మాట్లాడాడా

కోదండరాం మాట వినడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బ తిన్నదని వ్యాఖ్యానించారు. “కోదండరాంకు టీఆరెస్ అధికారంలోకి రావడం ఇష్టం లేదు. అప్పుడే ఢిల్లీ వెళ్లి సోనియాతో మీటింగ్ పెట్టారు. ఇతని మాట పట్టుకొనే కాంగ్రెస్ నాశనమైంది. లేకపోతే టీఆరెస్ తో పొత్తు పెట్టుకునేవారు” అని కేసీఆర్ పేర్కొన్నారు. కోదండరాం కెపాసిటీ తనకు తెలుసని, అతను చిన్నవాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కోదండరాంకు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయమని ఆఫర్ చేశానని కేసీఆర్ వెల్లడించారు. అది వదిలి తనను తాను ఎక్కువ ఊహించుకొని ఎదో చేయాలని చూస్తున్నాడని, అతని వల్ల ఏమీ కాదని వ్యాఖ్యానించారు.

”ఆయన పిలుపు ఇస్తాడట. ఆయనేమైనా మహాత్మా గాంధీనా.. ఆయన ఎవరు పిలుపులు ఇవ్వడానికి. ఓ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో పిలుపులు ఇస్తారు. ఈయనకు ఏమి బాధ్యత ఉంది” అని కేసీఆర్ ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ముసుగు తీసి రావాలని కోదండరాంకు సూచించారు. “నేను పార్టీ పెట్టేవరకు వీళ్లంతా ఎక్కడున్నారు. తెలంగాణ కావాలని ఎవరైనా మాట్లాడారా.. రాష్ట్రం వస్తుందని ఎవరైనా ఊహించారా..” అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారంటూ… వారిని పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీ పెట్టడం అంటే మాటలు కాదని, చాలా తెలివి-ధైర్యం కావాలని,14 ఏళ్లుగా పార్టీని నడిపిన తనకు సాధక బాధకాలు తెలుసని కేసీఆర్ పేర్కొన్నారు. కోదండరాం కార్యక్రమాల్లో వినిపిస్తున్న పాటను ప్రస్తావిస్తూ “ఎవరేలుతున్నారురా తెలంగాణ..అని పాట. ఎవరేలుతున్నారు… తెలంగాణ తెచ్చినోడే కదా” అని కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణకు శని కాంగ్రెస్

“మొత్తం తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా. శనిలా పట్టింది కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రు. తెలంగాణ అడిగితే కాల్చి చంపింది ఇందిరా గాంధీ. రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసి వందల మంది మరణానికి కారణమైంది సోనియా గాంధీ” అని కేసీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం చేసిందేమిటని ప్రశ్నించిన కేసీఆర్.. తెలంగాణలో పాల ఉత్పత్తి ఆరు లక్షల లీటర్లయితే వినియోగం 80 లక్షల లీటర్లు అని, రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయలేదని ఆక్షేపించారు.

మూడేళ్ళలోనే బంగారు తెలంగాణ వస్తుందని ఎవరూ చెప్పలేదన్న కేసీఆర్.. ఆ దిశగా పయనిస్తున్నామని ఉద్ఘాటించారు. మత కలహాలు, రౌడీ మామూళ్లు, ఎన్కౌంటర్లు లేకుండా తెలంగాణ ప్రశాంతంగా ఉందని చెప్పారు. తాను చెప్పినట్టుగానే తెలంగాణకు సాగునీరు, తాగునీరు వస్తుందని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి తీరతామని ఉద్ఘాటించారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply