కేసీఆర్ ‘ముందస్తు’ విజయం

8 0

తెలంగాణ రహదారులపై కారు స్వైరవిహారం

119 అసెంబ్లీ సీట్లలో 88 టీఆర్ఎస్ సొంతం

‘‘గ్రేటర్’’ సహా అన్నిచోట్లా ఆధిపత్యం

ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ మెరుగు

రెండు సీట్లకు పరిమితమైన టీడీపీ

ఖాతా తెరవని కూటమి ఇతర భాగస్వాములు

నష్టపోయిన బీజేపీ... 7 సీట్లు నిలబెట్టుకున్న ఎంఐఎం

తెలంగాణ తొలి అసెంబ్లీని గడువుకు 9 నెలల ముందే రద్దు చేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) వ్యూహాత్మక విజయాన్ని సాధించారు. హంగ్ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ.. కూటమి కట్టిన ప్రతిపక్షాలు విస్తుపోయేలా టిఆర్ఎస్ పార్టీ ఏకంగా 88 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ... గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా అన్నిచోట్లా టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చాటుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక్కచోట మాత్రమే ‘‘ప్రజాకూటమి’’కి మెజారిటీ సీట్లు దక్కాయి. టీడీపీకి పట్టున్నట్టుగా భావించే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అక్కడా కారు స్వైర విహారం చేసింది.

119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష ‘‘ప్రజాకూటమి’’కి 21 మాత్రమే దక్కాయి. భాగస్వాములలో పెద్దదైన కాంగ్రెస్ పార్టీ 19 సీట్లతో సరిపెట్టుకోగా తెలుగుదేశం పార్టీ కేవలం 2 సీట్లకు పరిమితమైంది. కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలు... తెలంగాణ జనసమితి (టీజేఎస్), సీపీఐ ఖాతా తెరవలేదు. ఎంఐఎం ఇంతకు ముందున్న 7 అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోగా.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామన్న బీజేపీకి ఒకే ఒక్క సీటు మిగిలింది.

విజేత టీఆర్ఎస్ కోటికి దగ్గరగా 97,00,749 కోట్లను (పోలైన మొత్తంలో 46.9 శాతం) సాధించింది. ‘‘ప్రజాకూటమి’’ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కలిపి 32.8 శాతం ఓట్లు లభించాయి. కూటమిలో... కాంగ్రెస్ 58,83,111 ఓట్లు (28.4 శాతం) తెచ్చుకోగా... 13 సీట్లలో మాత్రమే పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం 7,25,845 (3.5 శాతం) ఓట్లను పొందింది. తెలంగాణ జనసమితి 95,364 ఓట్లు (0.5 శాతం), సీపీఐ 83,215 ఓట్లు (0.4 శాతం) పొందాయి. పార్టీలవారీగా చూసినప్పుడు ఓట్ల వేటలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 18.5 శాతం వెనుకబడి ఉంది. మిగిలిన కూటములు, పార్టీలు ఏవీ ప్రభావం చూపించలేకపోయాయి.

ప్రతిపక్షాల కోటలు బద్ధలు

టీఆర్ఎస్ కు ఉత్తర తెలంగాణ పెట్టని కోటగా ఉండేది. ఆ ప్రాంతంలో ఈసారి పోటీ స్థూలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది. దక్షిణ తెలంగాణలో కాస్త భిన్నత్వం ఉంటుంది. హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వామపక్షాల ప్రభావం కనిపిస్తాయి. అయితే, ఈసారి ఆ వైవిధ్యాన్ని టీఆర్ఎస్ తుడిచిపెట్టింది. మిత్రపక్షం అన్న ఎంఐఎం ఒక్కటే 7 సీట్లను నిలబెట్టుకుంది. అటు బీజేపీ, ఇటు వామపక్షాలు డీలాపడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ లో చూసినా, చుట్టుప్రక్కల జిల్లాల్లో చూసినా కారు ప్రభంజనమే.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 సీట్లలో 13 టీఆర్ఎస్ సొంతమయ్యాయంటే ఈసారి ఓటర్ల తీర్పు ఎంత నిర్ణయాత్మకంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ విజయం 93 శాతం. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అనుకున్న రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి వంటివారు మట్టికరిచారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన రంగారెడ్డి జిల్లాలోనూ ఈసారి గులాబి జెండా రెపరెపలాడింది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 11 టీఆర్ఎస్ వశమయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో అయితే మొత్తం 15 సీట్లలో ఒక్కటే ప్రతిపక్షాలకు మిగిలింది. ఎంఐఎం 7 సీట్లు పోను టీఆర్ఎస్ మరో 7 సీట్లు గెలుచుకుంది.

టీఆర్ఎస్ కు మొదటినుంచీ గొడుగు పట్టిన మెదక్ జిల్లాలో 10 సీట్లకు 9, వరంగల్ జిల్లాలో 12కు 10, కరీంనగర్ జిల్లాలో 13కు 11, ఆదిలాబాద్ జిల్లాలో 10కి 9, నిజామాబాద్ జిల్లాలో 9కి 8 టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. నల్లగొండ జిల్లాలోనూ 12 సీట్లకు 9 టీఆర్ఎస్ సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక్కటే టీఆర్ఎస్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసింది. ఇక్కడ 10 సీట్లలో కేవలం ఒక్క సీటును టీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. టీడీపీకి ఈ జిల్లాలో మాత్రమే 2 సీట్లు రాగా... ఆ పార్టీ మద్ధతుతో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది.

గ్రేటర్ మరోసారి కేటీఆర్ దే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ జిల్లాలకు చెందిన 28 సీట్లు ఉంటే అందులో 18 టీఆర్ఎస్ గెలుచుకోవడం అసాధారణమైన విషయమే. గత ఎన్నికల్లో ఇక్కడ 10 సీట్లు గెలిచిన టీడీపీ ఈసారి మట్టికొట్టుకుపోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటుకోలేకపోయిన టీఆర్ఎస్... 2015 కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను ఏకంగా 99 గెలిచి ఇకపైన రాజధాని కూడా తనదేనని చాటింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే వచ్చాయి. అప్పట్లో కేవలం ఒక్క (కూకట్ పల్లి) కార్పొరేటర్ స్థానాన్ని పొందిన టీడీపీ... ఈసారి ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బాధ్యత తీసుకొని విజయాన్ని సాధించిన కేటీఆర్... ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

పెరిగిన మెజారిటీలు

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ వ్యత్యాసాలు ఉండవన్న అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఘన విజయాలను నమోదు చేశారు. తెలంగాణ మొత్తంలో అత్యధిక మెజారిటీ ఆ పార్టీ ముఖ్య నేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మేనల్లుడు హరీశ్ రావుది. సిద్ధిపేటలో కాంగ్రెస్ అభ్యర్ధిపై హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మంత్రిగా పని చేసిన కె. తారకరామారావు (కేటీఆర్) 89,009 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వీరు కాకుండా వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్ధి ఆరూరి రమేష్ 99,240 ఓట్లు, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్ధి చామకూర మల్లారెడ్డి 87,990 ఓట్లు మెజారిటీ సాధించారు.

పైలట్ కారును అడ్డుకోలేకపోయారు

కారు దూకుడుకు కళ్లెం వేసేవారే లేకపోయారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగ్ 21 యుద్ధ విమానాలనైతే నడిపారు గాని... పార్టీని విజయపథంలో నడిపించలేకపోయారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. కేసీఆర్ ట్రాప్ లో పడిన ప్రతిపక్షాలు కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రతిగా లోకల్ ఫీలింగ్, తెలంగాణ ఆత్మగౌరవ నినాదాలతో కేసీఆర్ దుమ్ము రేపారు.

కూటమి వస్తే.. కరెంటు పోతుందని, కూటమి వస్తే అమరావతికి తిరగాలని టీఆర్ఎస్ చేసిన ప్రచారం తెలంగాణ మొత్తం హోరెత్తింది. ‘‘మన పాలన మల్ల దెచ్చుకుందాం’’ అన్న కేసీఆర్ పిలుపునకు అనుకూలంగా తెలంగాణ సమాజం స్పందించింది. అయోమయానికి తావు లేకుండా తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతకు కళ్లెం వేసి, జమిలి ఎన్నికల ప్రమాదంనుంచి తప్పుకొని, తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రగిలించి అందరి అంచనాలనూ పటాపంచలు చేశారు.

అసెంబ్లీని రద్దు చేసిన రోజు కేసీఆర్ అన్న ఓ మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ఓడిపోయారని విలేకరులు గుర్తు చేసినప్పుడు... తెలంగాణ రాష్ట్ర సాధనలో చెన్నారెడ్డి విఫలమైనా తాను విజయవంతం కాలేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘ఎన్టీఆర్, బాబుల కంటే నేను మొగోడిని కావద్దా’’ అన్న ప్రశ్నతో కేసీఆర్ ముక్తాయించారు. ఎట్టకేలకు ‘‘ముందస్తు విజేత’’గా నిలిచారు. ప్రాంతీయ పార్టీల్లో ఒకటి మాత్రమే మనగలిగే పరిస్థితిని కల్పించారు.