ఆదాయంలో కృష్ణా జిల్లా టాప్

రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే జిల్లాల్లో కృష్ణా మొదటి స్థానంలో ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి అరు నెలలు (సెప్టెంబరు వరకు) జిల్లాల వారీగా ఆదాయాన్ని పరిశీలించినప్పుడు కృష్ణాజిల్లా రూ. 8,471.87 కోట్లతో టాప్ లో నిలిచింది. రూ. 6,842.35 కోట్ల ఆదాయంతో విశాఖపట్నం జిల్లా రెండవస్థానంలో ఉండగా… దానికి సమీపంలోనే ఉన్న విజయనగరం జిల్లా రూ. 364.46 కోట్ల ఆదాయంతో చివరిస్థానంలో ఉంది. రాష్ట్రంలోని ఏడు ఆదాయార్జన శాఖలు సాధించిన ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సమీక్షించారు.

ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో… రాష్ట్ర ఆదాయార్జన విభాగాలు 13.26 శాతం వృద్ధితో రూ. 25,834 కోట్ల రెవెన్యూను సాధించాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. వృద్ధి రేటులో అటవీ శాఖ ముందుంది. ఆ శాఖ సాధించిన ఆదాయం రూ. 64.19 కోట్లు మాత్రమే అయినా… ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 140.63 శాతం అధికం కావడం గమనార్హం. ఆదాయపరంగా చూస్తే ఈ శాఖదే చివరిస్థానం.

అత్యధిక ఆదాయం ఆర్జించిన శాఖలలో రాష్ట్ర వాణిజ్యపన్నుల విభాగం రూ. 18,090.84 కోట్లతో (9.03 శాతం వృద్ధి) టాప్ లో ఉంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆదాయం గత ఏడాది తొలి ఆర్నెల్లతో పోలిస్తే 1.48 శాతం తగ్గింది. ఈ శాఖ సెప్టెంబరు వరకు రూ.2,024 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ల్యాండ్ రెవిన్యూ శాఖలో వృద్ధి తిరోగమనంలో ఉంది. ఈ శాఖ 24.08 శాతం నెగెటివ్ వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం రూ. 99.76 కోట్లుగా ఉంది. భూగర్భ గనుల శాఖ రూ. 862 కోట్ల ఆదాయంతో, 16 శాతం వృద్ధిని సాధించింది. రవాణా శాఖలో వృద్ది 27.10 శాతంగా వుంది. ఆ శాఖ రూ. 1,532.10 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

Related posts

Leave a Comment