సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) సన్నాహాలు చేస్తోంది. లోక్ సభతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూలును మార్చి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సిక్కిం అసెంబ్లీ కాల పరిమితి మే 27వ తేదీతో ముగుస్తుండగా... మిగిలిన అసెంబ్లీలకు జూన్ 1 నుంచి 18 వరకు గడువు ఉంది. తెలంగాణ అసెంబ్లీకి కూడా జూన్ 8వరకు గడువు ఉన్నా... ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. కొత్త అసెంబ్లీ కూడా కొలువుదీరింది.
లోక్ సభతో పాటు ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చేరింది. కాశ్మీర్ అసెంబ్లీకి 2021 వరకు గడువు ఉన్నా.. ఇటీవల గవర్నర్ అర్ధాంతరంగా రద్దు చేశారు. నవంబర్ లో రద్దయిన కాశ్మీర్ అసెంబ్లీకి వచ్చే మే నెల (అర్నెల్ల) లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కాశ్మీర్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా విడిగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటే.. లోక్ సభ కంటే ముందుగా కూడా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రక్రియను చేపట్టవచ్చని భావిస్తున్నారు.
ఎన్నికలు షెడ్యూలును ఎప్పుడు విడుదల చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం జరగలేదని ఈసీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలి.. ఏయే నెలల్లో పోలింగ్ జరగాలి.. అనే అంశాలపై ఈసీ కసరత్తు చేస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. భద్రతా బలగాలు, ఇతర సిబ్బంది, ఎన్నికల సామాగ్రి అందుబాటును బట్టి ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటారు.

ఈసారీ సాగదీస్తారా?
2014లో మార్చి 5వ తేదీన ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఏకంగా 9 దశల్లో పోలింగ్ నిర్వహించారు. అసాధారణంగా రెండు నెలలపాటు ఎన్నికల ప్రక్రియ సాగింది. 2014 ఏప్రిల్ 7వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగితే మే 12వ తేదీన తుది దశ పూర్తయింది. అంతకు ముందు 2009లో మార్చి 2వ తేదీన షెడ్యూలు ప్రకటిస్తే... ఐదు దశల పోలింగ్ ఏప్రిల్ 16న ప్రారంభమై మే 13న ముగిసింది. 2004లో ఫిబ్రవరి 29న షెడ్యూలు ప్రకటించగా... కేవలం 4 దశలలో పోలింగ్ ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమై మే 10న ముగిసింది. ప్రతిసారీ పోలింగ్ దశలు పెరుగుతున్నాయి.
You must be logged in to post a comment.