నాదే అసలు నివేదిక… ఇది మంజునాథ్ మాట

సభ్యుల భిన్నాభిప్రాయాల నోట్లతో సహా నివేదిక సిద్ధం
సోమవారం సీఎస్ దినేష్ కుమార్ కు అందజేత!

కాపులను బీసీలలో చేర్చి అదనంగా 5 శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రతిపాదనకు శుక్రవారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శనివారం మళ్ళీ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి రిజర్వేషన్ బిల్లును ఆమోదించి వెను వెంటనే అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం తర్వాత ఇప్పుడు గవర్నర్ కు పంపుతున్నారు. 24 గంటల వ్యవధిలో వాయువేగంతో కాపు రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తన పనిని పూర్తి చేసింది. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరుగుతోంది.

తన సంతకం లేకుండా మిగిలిన సభ్యులు ఇచ్చిన నివేదిక న్యాయసమ్మతం కాదని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ్ కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు. తనదే అసలైన నివేదిక అని, అది ఇంకా ప్రభుత్వానికి అందించలేదని ఆయన శనివారం స్పష్టం చేశారు. మంజునాథ్ లేకుండా మిగిలిన సభ్యులు మాత్రమే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. ఛైర్మన్ సంతకం లేకుండా తాము రూపొందించిన నివేదికను మిగిలిన ముగ్గురు సభ్యులు మంత్రివర్గానికి సమర్పించారు. దాని ఆధారంగానే మంత్రివర్గ నిర్ణయం, బిల్లు ప్రవేశపెట్టడం, ఉభయ సభలు ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

కాపు రిజర్వేషన్లు, ఆ మాటకొస్తే మొత్తంగా బీసీలు, ఆర్థికంగా వెనుకబడినవారికి సంబంధించి రిజర్వేషన్లు కల్పించే విషయంలో మంజునాథ్, మిగిలిన ముగ్గురు సభ్యులు చెరోదారిగా ఉన్నారు. సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన అంశానికే పరిమితం కాగా మంజునాథ్ మొత్తం రిజర్వేషన్ల ఛట్రాన్నే సమీక్షించే విధంగా నివేదిక రూపొందించాలని భావించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ, కాలాతీతమవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంజునాథ్ తో కుదరదన్న అభిప్రాయంతో సభ్యులతో నివేదిక తెప్పించుకొని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో శనివారం మంజునాథ్ బీసీ కమిషన్ కార్యాలయంలో హడావిడిగా సమావేశాలను ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్ విషయంలో మిగిలిన సభ్యులకు, తనకు అభిప్రాయ భేదాలున్న నేపథ్యంలో… తన నివేదికపై వారి అసమ్మతి నోట్ లను కూడా తీసుకున్నట్టు తెలిసింది. వాటితో కలిపిన మొత్తం నివేదికను కమిషన్ సభ్య కార్యదర్శికి అందించి వెళ్లిపోయారు. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేదా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శికి అందజేయవలసిందిగా సూచించారు. ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు కాబట్టి తన నివేదికను అధికారులకు అందజేయాల్సిందిగా ఆయన కోరారు.

అందరి సంతకాలుంటేనే అసలు నివేదిక

బీసీ కమిషన్ చట్టం ప్రకారం సభ్యులందరి సంతకాలతో ఇచ్చేదే అధికారిక నివేదిక అని, సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలుంటే డిసెంట్ నోట్లు జత చేసి ఇస్తామని జస్టిస్ మంజునాథ్ చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే తన నివేదికను సభ్యులందరి సంతకాలతో, తన నివేదికపై వారికున్న అభ్యంతరాలపై నోట్ లను జత చేసి మరీ సమర్పించబోతున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నందున… కొద్దిరోజులపాటు అందుబాటులో ఉండరు కాబట్టి తాను కలవబోవడం లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయవలసిందిగా చెప్పి తమ సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ కి నివేదికను అందజేశానని మంజునాథ్ మీడియాకు వెల్లడించారు. సోమవారం అధికారులు అందుబాటులో ఉంటే వారికి నివేదికను తమ సభ్య కార్యదర్శి అందజేస్తారని మంజునాథ్ చెప్పారు.

సభ్యులంతా కూర్చొని చర్చించిన తర్వాత తుది నివేదికకు మెరుగులు దిద్ది ఇవ్వవలసి ఉంటుందని, అంతేగాని ఎవరికి వారు ఇచ్చే నివేదికలకు న్యాయపరంగా విలువ ఉండదని మంజునాథ్ తేల్చి చెబుతున్నారు. అయితే, శుక్రవారం తన ప్రమేయం లేకుండా మిగిలిన సభ్యులు ఇచ్చిన నివేదికలపై మంజునాథ్ వివరాల్లోకి వెళ్ళలేదు. కమిషన్ లోని ఇతర సభ్యులతో అభిప్రాయ భేదాలున్న విషయాన్ని స్పష్టంగానే చెప్పిన జస్టిస్ మంజునాథ్… తన నివేదికను ఆమోదించడమా లేక తిరస్కరించడమా అనేది ప్రభుత్వ ఇష్టమంటున్నారు. అయితే, తాను బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఓసీలలో ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో తన నివేదికను రూపొందించానని చెప్పారు.

Related posts

Leave a Comment