రాష్ట్ర సచివాలయంలో… అదీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ఎమ్మెల్యే, ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి మధ్య నెలకొన్న వివాదం కలకలం రేపింది. డెల్టా సుగర్స్ రైతుల సమస్య పరిష్కారంకోసం ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కార్యదర్శి ఒకరు అడ్డుకోవడంతో మొదలైన వివాదం… కన్నీళ్ళు, రాజీనామా హెచ్చరికల వరకు వెళ్లింది. కన్నీటి పర్యంతమైన ఆ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఆయనను సమావేశంలో వద్దన్న ఐఎఎస్ అధికారి గిరిజా శంకర్. వారిద్దరి మధ్య నెలకొన్న వివాదం బుధవారమంతా సిఎం కార్యాలయంలోనూ, బయటా చర్చనీయాంశమైంది. సచివాలయంలోని ఐఎఎస్ అధికారులు, బయట ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపైనే ఆరాలు తీశారు. ఇంతకూ సిఎంఒలో ఏం జరిగింది?
బిజెపి ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా సుగర్స్ కంపెనీని మూసేయడంతో దాని పరిధిలోని రైతులు చెరకును ఎక్కడ అమ్ముకోవాలన్న సమస్య ముందుకొచ్చింది. డెల్టా షుగర్ ఫ్యాక్టరీని నమ్మి చెరకు వేసిన రైతులు ఇప్పుడు దూరంగా ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్లి అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఉన్న కేసీపీ సుగర్స్, ఆంధ్రా సుగర్స్ ఫ్యాక్టరీలు డెల్టా రైతుల పంటను కూడా కొనడానికి పోటీ పడ్డాయి. ఈ వ్యవహారం సిఎం ఆఫీసు వరకు వచ్చింది. డెల్టా సుగర్స్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేసి రైతులు ఎక్కడికైనా వెళ్లి చెరకు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని అధికారులు భావించారు. అయితే, ఈ పద్ధతిని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యతిరేకించారు. దూరం వెళ్లి సరుకు అమ్ముకునే క్రమంలో రవాణా ఛార్జీల భారం రైతులపై పడుతుందని ఇంతకు ముందు అధికారులతో వంశీ చెప్పారు.
ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్ ఫ్యాక్టరీల యజమానులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేసీపీ, ఆంధ్రా సుగర్స్ యాజమాన్యాలతో పాటు.. డెల్టా ఫ్యాక్టరీని అర్ధాంతరంగా మూసేసి రైతుల సమస్యకు కారకుడైన గోకరాజు గంగరాజు కూడా హాజరయ్యారు. మరోవైపు.. ఈ సమావేశం విషయం తెలుసుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన వంశీని సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్ వారించారు. దీనికి నొచ్చుకున్న వంశీ… తన నియోజకవర్గానికి సంబంధించిన రైతుల తరఫున వచ్చానని, సమస్య రైతులదే అయినందున వారి స్వరం కూడా వినిపించాల్సిన అవసరం ఉందని వంశీ వాదించారు. అయితే, ఫ్యాక్టరీల యజమానులు, అధికారులతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఎమ్మెల్యే మరో సందర్భంలో మాట్లాడాలని గిరిజా శంకర్ స్పష్టం చేశారు.
దీంతో వంశీ ఆగ్రహానికి, ఆవేదనకు లోనయ్యారు. బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఓ దశలో వలవలా ఏడ్చారు. ఎమ్మెల్యే అయిన తాను రైతుల సమస్యపై మాట్లాడడానికి వస్తే అధికారులు బయటకు పొమ్మనడం ఏమిటని ఆయన పదే పదే ప్రశ్నించారు. తాను రాజీనామా చేస్తానని వంశీ ఆవేదనతో పదే పదే చెప్పారు. సొంత ప్రభుత్వంలో తనకు ఇదేం అవమానమని, గతంలోనూ ఇలాగే జరిగిందని అక్కడ ఉన్నవారితో వంశీ పదే పదే వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల పట్ల అధికారుల వైఖరి బాగాలేదని, దానిపై ముఖ్యమంత్రిదాకా విషయం వెళ్ళడం లేదని వంశీ ఆక్షేపించారు.
కాగా, ఎమ్మెల్యేను సమావేశానికి ఆహ్వానించకపోవడంవల్లనే తర్వాత కలవాలని తాను సూచించినట్టు గిరిజా శంకర్ తన వాదనను వినిపించారు. అసలు (రైతుల) సమస్యకు ఆధ్యుడైన గోకరాజు గంగరాజు.. ఈ విషయంలో గిరిజా శంకర్ ను సమర్ధిస్తూ మాట్లాడారు. ఇది గోకరాజు గంగరాజు, వంశీ మధ్య వివాదమని, ఇందులో ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై తలో అభిప్రాయంతో ఉన్నారని, వంశీ ఓవైపు వకాల్తా పుచ్చుకున్నారని, అందుకే అడ్డుకున్నారని ఓ వెర్షన్ ప్రచారంలో ఉంది. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వచ్చినా.. అలాంటి లేఖ ఏదీ సిఎంఒకు అందలేదు.