ఆహారశుద్ధి రంగంలో 23 సంస్థలతో ఎంవోసీలు

5 0
Read Time:4 Minute, 48 Second

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో కలిసి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 23 ప్రముఖ సంస్థలు, 110 మంది పెట్టుబడిదారులతో మెమోరాండం ఆఫ్ కో-ఆపరేషన్ (ఎంఓసీ)లు కుదుర్చుకుంది.

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంఓసీలపై సంతకాలు జరిగాయి. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ‘ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్’లో భాగంగా రూ.855 కోట్ల విలువైన ఎంఓసీలను కుదుర్చుకున్నారు. ఇవి అమలులోకి వస్తే మొత్తం 9477 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

ఆహార శుద్ధి ప్రక్రియలో, పంట నష్టాల తగ్గుదల విధానాల అమలులో, నవీన ఆహార పదార్ధాల అభివృద్ధిలో ఈ 23 సంస్థలకు మంచి అనుభవం ఉంది. విశాఖలో జరిగిన గత భాగస్వామ్య సదస్సుల్లో ఆహార శుద్ధి విభాగంలో మొత్తం 245 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ఈ ఏడాది 140 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. రూ.1600 కోట్ల విలువైన ఈ పారిశ్రామిక యూనిట్ల స్థాపనతో 25,000 ఉద్యోగావకాశాలు లభించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు కుదిరిన ఎంవోసీల ద్వారా రానున్న కాలంలో ఈ రంగంలో అభివృద్ధి ఊపందుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఆహార ఉత్పత్తిలో అగ్రపథాన ఉన్న భారతదేశం పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడం విచారకరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ఉద్యాన పంటలు సాగవుతున్నా తగినంత సంఖ్యలో ఆహారశుద్ధి పరిశ్రమలు లేకపోవడం ఆహార కొరతకు దారి తీస్తోందన్నారు. ఆహారశుద్ధి రంగంలో ప్రసిద్ధి చెందిన 23 సంస్థలతో ఎంవోసీ కుదుర్చుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని సిఎం పేర్కొన్నారు.

గత పాలకులు రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినా గడచిన మూడేళ్లుగా అత్యుత్తమ విధానాలను అనుసరించి ఈ రంగంలో ప్రగతి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సూక్ష్మపోషకాలు, భూసార పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డులతో రాష్ట్రంలో వ్యవసాయదారులకు ఊతం అందించామని, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రోత్సహించేందుకు మిలిందాగేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆధునిక సేద్యపు విధానాలు, ప్రపంచంలో అమలులో ఉన్న అత్యుత్తమ పద్ధతులను ప్రవేశపెట్టామన్నారు. ముఖ్యంగా నవీన సాంకేతికతను, యంత్ర పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు వచ్చాయన్న చంద్రబాబు… వాటికి అనుగుణంగా వ్యవసాయంలో ఉత్పత్తి జరగాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఏపీలో పెద్దఎత్తున ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయడమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమ రాష్ట్రంలో మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిలీనియం మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తగు ప్రయత్నాలు చేస్తోందని ప్రస్తావించారు. దేశంలో ఆహారశుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉత్తమ నమూనాగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply