ముందే బీజేపీ మంత్రులతో రాష్టంలో రాజీనామా చేయించిన అధిష్ఠానం
కేంద్రప్రభుత్వం నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. తమ మంత్రులు అశోక గజపతిరాజు, వైఎస్ చౌదరిల చేత రాజీనామా చేయించే ముందు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రికి ఓ మాట చెబుదామని భావించిన చంద్రబాబు...బుధవారం రాత్రి ఫోన్ చేశారు. అయితే, అప్పుడు ప్రధానమంత్రి అందుబాటులోకి రాకపోవడంతో తమ నిర్ణయాన్ని చంద్రబాబు బుధవారం రాత్రే ప్రకటించారు. చంద్రబాబు ఫోన్ కాల్ కు స్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం తిరిగి కాల్ చేశారు.
రాష్ట్రానికి తాము ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చామని, ఇంకా మిగిలినవేమైనా ఉంటే మాట్లాడుకుందామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూచించినట్టు తెలిసింది. అయితే, ప్రత్యేక ప్యాకేజీ సహా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న ఆగ్రహం ప్రజల్లో ఉందని చంద్రబాబు బదులిచ్చినట్టు సమాచారం. ఇప్పటిదాకా వేచి చూశామని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. దీనికి ప్రతిస్పందించిన ప్రధాని...మరోసారి మాట్లాడుకుంటే సరిపోయేదని అభిప్రాయపడినట్టు సమాచారం. కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాలన్నదే తమ నిర్ణయమని, ఎన్డీయేలోనే కొనసాగుతామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానికి చెప్పారు.
ఇప్పటికైనా మిగిలిన అంశాలపై సానుకూలంగా స్పందించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత గురువారం రాత్రి ప్రధాని టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులనూ తన ఇంట్లోనే కలిసేందుకు సమయమిచ్చారు. రాజీనామాలు దురదృష్టమని మాత్రమే మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతకు మించి వారించే ప్రయత్నంగానీ, రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై భరోసా ఇవ్వడంగానీ జరగలేదని తెలిసింది. గురువారం ఉదయమే రాష్ట్రంలో బీజేపీ మంత్రులచేత రాజీనామాలు చేయించిన బీజేపీ అధిష్ఠానం... కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ మంత్రులు రాజీనామా చేయడాన్ని తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ప్రధాని మోదీని కలసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి... అన్ని విషయాలూ ప్రధాని పరిష్కరిస్తారని ఆశించడం సరి కాదని, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సంబంధించిన అంశాలను ఆయా విభాగాలు చూస్తుంటాయని వ్యాఖ్యానించారు.