‘గుజరాత్’లో ఓడితే మోదీ పతనమే.. కానీ,

1 0
2012 నాటికంటే సీట్లు తగ్గినా కమలనాధులదే అధికారం!
సీఎల్ఎస్ఎ ఎండీ క్రిస్టోఫర్ వుడ్ అంచనా

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తిరిగి గెలుస్తుందా... రెండు దశాబ్దాల తర్వాత అధికారాన్ని కోల్పోతుందా? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదో కీలకమైన చర్చనీయాంశం. గెలిస్తే వరుసగా ఆరోసారి అధికారం చేపట్టిన రికార్డు సొంతమవుతుంది. ఓడితే... అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పతనానికి దారి తీస్తుందట! ఆసియాలోని ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ సీఎల్ఎస్ఎ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ వుడ్ మాట ఇది.

ఈక్విటీ స్ట్రాటజిస్ట్ అయిన ఈ మార్కెట్ వెటరన్ కంపెనీ నోట్ ‘గ్రీడ్ అండ్ ఫియర్’లో గుజరాత్ ఎన్నికలపై తన అభిప్రాయాల్ని, అంచనాలను పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... సొంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికల్లో గట్టి సవాలునే ఎదుర్కొంటున్నారని క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. అయితే, 2012 నాటికంటే తక్కువ సీట్లతో గుజరాత్ లో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన అంచనా వేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ డిసెంబర్ 9, 14 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్ సిఎంగా పని చేసిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రానికి జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తిన్నా అత్యంత కీలకమైన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో విజయం మోదీ నైతిక స్థైర్యాన్ని పెంచింది. ఇప్పటివరకు వచ్చిన జయాపజయాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు సొంత రాష్ట్రం గుజరాత్ మరో ఎత్తు.

గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడమంటూ జరిగితే... మోదీ పని అయిపోయినట్టే’’-క్రిస్ వుడ్.

కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు

అయితే, కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యం కాని రాహుల్ గాంధీ నేతృత్వంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసిందని వుడ్ అభిప్రాయపడ్డారు. జాతీయాంశాలైన జీఎస్టీ, డీమానెటైజేషన్ లతో క్యాంపెయిన్ చేయడం వ్యూహాత్మక తప్పిదంగా క్రిస్ వుడ్ పేర్కొన్నారు. సంప్రదాయంగా బిజెపి మద్ధతుదారులైన చిన్నవ్యాపారులు, వాణిజ్యవేత్తలు ఆ విధానాలవల్ల నష్టపోవడంవల్ల కాంగ్రెస్ అవే అంశాలపై క్యాంపెయిన్ చేసి ఉండొచ్చని, అయినా మోదీ ఆయా వర్గాల్లో ఇప్పటికీ బాగా పాపులర్ అని క్రిస్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ స్థానిక అంశాలను, బలహీనుడైన రాష్ట్ర ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని ఉంటే ఫలితం ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేయడం ద్వారా కౌంటర్ రియాక్షన్ మరో రూపంలో వచ్చిందని క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. గుజరాతీయులు తమ మాజీ ముఖ్యమంత్రి మోదీ ప్రధాని కావడంపట్ల గర్వంగా ఫీలవుతున్నారన్నది క్రిస్ వుడ్ అంచనా.

2019 ఎన్నికలకు ముందు ఉపాధిపై దృష్టి...

2019 ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగాల కల్పనపై ఫోకస్ చేస్తారని క్రిస్ వుడ్ అంచనా వేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రగతి సాధించలేదని ఆయన ఫీలయ్యారు. 2022నాటికి అందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, రోడ్ల నిర్మాణం, టెక్ట్సైల్ రంగంలోనూ ఉపాధి పెరుగుదలకు అవకాశాలున్నాయని క్రిస్ అంచనా వేశారు.

Leave a Reply