భారత ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు ఎంతగానో విన్నవించి..ఫలితం లేక విమర్శలు గుప్పించి.. 14 ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత ఎట్టకేలకు క్రెడిట్ రేటింగ్ లో కొద్దిపాటి మార్పులు వచ్చాయి. మూడీస్ సంస్థ 13 సంవత్సరాలకు పైగా భారత క్రెడిట్ రేటింగ్ ను బిఎఎ3 వద్దనే ఉంచి తాజాగా దాన్ని బిఎఎ2కి అప్ గ్రేడ్ చేసింది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రేటింగ్ సంస్థ మూడీస్ ఇచ్చే రేటింగ్ ప్రభావం అంతర్జాతీయంగా కొంతమేరకు ఉంటుంది. దేశానికి విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత పారిశ్రామిక వర్గాలకు తక్కువ వడ్డీకే విదేశీ రుణాలు దొరుకుతాయి. అయితే, ఇప్పుడు మూడీస్ రేటింగ్ లో జరిగిన మార్పులో హేతుబద్ధతపైన సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న ఇండియాకు ఈ రేటింగ్ చాలదన్నది నిపుణుల మాట. అదలా ఉంచితే.. ఈ మాత్రం మెరుగుదల కూడా ఉన్న పరిస్థితిని ప్రతిబింబించేలా నిజాయితీగా జరిగింది కాదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. భారత ప్రభుత్వ విన్నపాలు, విమర్శలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వెలువడిన హెచ్చరికల నేపథ్యంలోనే మూడీస్ ఇండియాకు తప్పనిసరి పరిస్థితుల్లో రేటింగ్ మార్చిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కారణం ఏమైనా నోట్ల రద్దు, జీఎస్టీ అస్తవ్యస్త అమలుతో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం మూడీస్ రేటింగ్ పెరుగుదలను పెద్ద ఊరటగా భావిస్తోంది. ముఖ్యంగా గుజరాాత్ ఎన్నికలకు ముందు రాజకీయ అంశాలతోపాటు ఆర్థిక అంశాలపై కూడా ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొంటోంది బిజెపి. ఈ నేపథ్యంలో మూడీస్ రేటింగ్ తాము చేపట్టిన సంస్కరణలకు సమర్ధనగా వచ్చిందని ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుందని కేంద్రం భావిస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. రేటింగ్ పెరుగుదల ప్రభావం స్టాక్ మార్కెట్, రూపాయి విలువపైనా సానుకూలంగా పడింది.
మొన్న ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో ఒకే ఏడాది 30 ర్యాంకులు మెరుగుపడి 100వ ర్యాంకు సాధించడం, నిన్న అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సంస్థ మోదీకి తిరుగులేని ప్రజాధరణ ఉందని పేర్కొనడం, తాజాగా మూడీస్ భారత క్రెడిట్ రేటింగ్ ను మెరుగుపరచడం… తమ పరిపాలన సవ్యంగా ఉందనడానికి సాక్ష్యాలుగా చెబుతున్నారు. 2004లోనూ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే రేటింగ్ పెరిగిందని, మళ్ళీ ఇన్నేళ్ళకు ఎన్డీయే 2 హయాంలో రేటింగ్ మెరుగుపడిందని కేంద్రప్రభుత్వం ప్రస్తుతిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష నేతలు, సామాజిక మాథ్యమాల్లో ఎక్కువ మంది ప్రజలు మాత్రం రేటింగ్ మార్పు వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించడంలేదని స్పష్టం చేస్తున్నారు. రేటింగ్ మార్పు నేపథ్యాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. గతంలో యుపిఎ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన చిదంబరం, ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని పెద్దలు అనేకసార్లు రేటింగ్ స్థాయిని సవరించాలని మూడీస్ సంస్థకు విన్నవించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి పాశ్చాత్య ప్రపంచపు రేటింగ్ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవడంలేదని, వివక్ష పాటిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఆసియాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతోపాటు బ్రిక్స్ దేశాలన్నీ ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. పశ్చిమ దేశాల రేటింగ్ సంస్థలపై ఆధారపడకుండా సొంతగా రేటింగ్ సంస్థలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని పలు సందర్భాల్లో ఆయా దేశాలు వెలిబుచ్చాయి. ఈ వాదనను మోదీ ప్రభుత్వం చాలా బలంగా ముందుకు తెచ్చింది. చైనా సావరిన్ బాండ్ రేటింగ్ ను తగ్గిస్తూ మూడీస్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన మరింత బలం పుంజుకుంది. ఈ పరిణామాలతో మూడీస్ వంటి రేటింగ్ సంస్థలకు కొత్త భయం పట్టుకుంది.
బ్రిక్స్ దేశాలు సరికొత్త రేటింగ్ సంస్థల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తే తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే ఆందోళన అభివృద్ధి చెందిన దేశాల రేటింగ్ సంస్థల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారత సావరిన్ బాండ్ రేటింగ్ పై మూడీస్ సానుకూల నిర్ణయం తీసుకుందంటున్నారు నిపుణులు. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఏ చర్యలు దారి తీశాయో ఆ సంస్కరణలవల్లనే రేటింగ్ పెరిగిందని మూడీస్ చెబుతోంది. అదే సమయంలో 2018 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇండియా స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 6.7 శాతం మాత్రమే ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరంపై వేసిన ముందస్తు అంచనాలకంటే బాగా తక్కువ.
మరోవైపు అంచనాలకు తగిన విధంగానే ఆర్థిక సూచీలున్న చైనా విషయంలో మూడీస్ ఆర్నెల్ల క్రితం ఇందుకు భిన్నంగా స్పందించింది. రేటింగ్ ను ఎ1కు పరిమితం చేసింది. ఈ ఆర్నెల్లలో పరిస్థితులు మారాయి. చైనా రేటింగ్ ను తగ్గించి ఇండియా రేటింగ్ ను పెంచినా ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య నాలుగు స్థానాల అంతరం ఉంది.