‘‘జన్మభూమి’’లో మరో 3 లక్షల కోట్ల పెట్టుబడులు : ముఖేష్ అంబానీ

వచ్చే పదేళ్లలో గుజరాత్ రాష్ట్రంలో మరో రూ. 3 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు భారత మహా సంపన్నుడు ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, వచ్చే పదేళ్లలో ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని అంబానీ చెప్పారు.

శుక్రవారం ‘‘వైబ్రంట్ గుజరాత్’’ కార్యక్రమంలో మాట్లాడిన అంబానీ ‘‘గుజరాత్ రిలయన్స్ పరిశ్రమలకు జన్మభూమి. అదే కర్మభూమి కూడా… గుజరాత్ ఎల్లప్పుడూ రిలయన్స్ పరిశ్రమలకు మొదటి ఛాయిస్’’ అని ఉద్ఘాటించారు.

వచ్చే పదేళ్ళలో విద్యుత్, పెట్రో కెమికల్, టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని అంబానీ వెల్లడించారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పారు. జియో నెట్ వర్క్ 5జికి రెడీగా ఉందని అంబానీ వెల్లడించారు.

జియో 4జి సేవలకు గుజరాత్ ప్రధాన వేదికైందన్న అంబానీ, ఇప్పుడు జియో నెటవర్క్ పూర్తి స్థాయిలో 5జికి రెడీ అయిందని పేర్కొన్నారు. అయితే, జియో 5జి సేవలు ఎప్పడు ప్రారంభమయ్యేదీ అంబానీ చెప్పలేదు.

జియో, రిలయన్స్ రిటైల్ కలసి ఇ కామర్స్ లోకి…

తమ టెలికం కంపెనీ, రిటైల్ సంస్థ కలసి కొత్త ఇ కామర్స్ వేదికను ప్రారంభించబోతున్నాయని, దీంతో చిన్న రిటైల్ వ్యాపారులు, కస్టమర్లను అనుసంధానిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. దేశవ్యాప్తంగా 9000 స్టోర్లు ఉన్న రిలయన్స్ రిటైల్, జియో కలసి ప్రత్యేకమైన కొత్త వాణిజ్య వ్యవస్థను ప్రారంభిస్తాయన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని 12 లక్షల మంది రిటైలర్లు, షాపుల యజమానులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ఈ వ్యవస్థతో అనుసంధానమవుతారని వివరించారు.

గుజరాత్ లోని పండిట్ దీన్ దయాళ్ యూనివర్శిటీని బలోపేతం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ. 150 కోట్లను వెచ్చిస్తుందని అంబానీ చెప్పారు.

Related posts