ముంబైలో రెండు రోజులపాటు సీఈవోలతో ఐటీ మంత్రి భేటీలు
రెండు రోజులపాటు ముంబైలో వివిధ కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలు, వాటికి కల్పిస్తున్న రాయితీలను వివరించిన లోకేష్...రాష్ట్రాభివృద్ధిలో బాగస్వామ్యులు కావాలని ముఖేష్ అంబానీని కోరారు. దీనికి ముఖేష్ అంబానీ సానుకూలంగా స్పందించినట్టు అధికారిక సమాచారం.
రాష్ట్రంలో ఐటి అభివృద్ధికోసం అనుసరిస్తున్న విధానాలను, గ్రామీణాభివృద్ధి మంత్రిగా తాను చేపట్టిన కార్యకలాపాలను అంబానీకి ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. విశాఖపట్నం నగరాన్ని ఐటి హబ్ గా, క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఎదుగుతున్నామని, అతి తక్కువ సమయంలోఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫలితాలను సాధించామని లోకేష్ పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయంతో సంక్షేమ కార్యక్రమాల అమలు మెరుగుపరిచామంటూ.. ఈ ప్రగతి, రియల్ టైం గవర్నెన్స్ తదితర కార్యక్రమాలను వివరించారు.
బ్యాంకులు, ఐటీ కంపెనీలతో భేటీలు
రెండు రోజుల ముంబై పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలు బ్యాంకులు, ఐటి, ఫిన్ టెక్ కంపెనీల సీఈవోలు, ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. డిసిబి బ్యాంక్ సిఈఓ నటరాజన్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ అధికారి పరగ్ రావ్, లైకి ఫిన్ టెక్ కంపెనీ బిజినెస్ హెడ్ మూల్చందాని, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు సిఐఓ టిన్వాలా, ఎల్.అండ్.టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ సుబ్రహ్మణ్యన్, థామ్సన్ రాయిటర్స్ కంపెనీ ప్రతినిధులు, వారి భాగస్వామ్య బ్యాంకుల ప్రతినిధులతో మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించాలని లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులను కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు భూమి కేటాయింపు కూడా వీలైనంత త్వరగా చేస్తున్నామని చెప్పారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోరారు. ఇటీవల తెచ్చిన కొత్త విధానాలను లోకేష్ వారికి వివరించారు.
50 శాతం రెంటల్ సబ్సిడీతో ఐటి కంపెనీలకు కార్యాలయ స్థలాలను కేటాయిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ పాలసీ లో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నిర్మించే ఆఫీస్ స్పేస్ ప్రకారం 50 నుండి 70 శాతం రెంటల్ గ్యారెంటీ ఉంటుందని,నిర్మించిన ఆఫీస్ స్పేస్ ఆధారంగా 18 నెలల నుండి గరిష్టంగా 36 నెలల వరకూ రెంటల్ గ్యారంటీ వర్తిస్తుందని కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెప్పారు. కాగా, త్వరలోనే తమ ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వస్తామని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
You must be logged in to post a comment.