మడకశిర బ్రాంచి కెనాల్, అడవిపల్లి, పులిచింతల, గండికోట లిఫ్టు…
నిర్మాణం పూర్తి చేయడానికి సిఎం చంద్రబాబు నిర్దేశం
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గడువులోగా పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా (గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో) మడకశిర బ్రాంచి కెనాల్, చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా రెండో దశలో భాగమైన అడవిపల్లి ప్రాజెక్టు, కె.ఎల్ రావు పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని గండికోట సిబిఆర్ లిఫ్టు పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లా సంగం రిజర్వాయర్ పనులను ఈనెలాఖరుకు పూర్తిచేయాలని కోరారు. పోలవరంపై వారాంతపు సమీక్షలో భాగంగా ఆయన త్వరితగతిన చేపట్టిన మరో 28 ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సోమవారం సచివాలయంలో చర్చించారు.
గండికోట సిబిఆర్ లిఫ్ట్, కె.ఎల్ రావు పులిచింతల ప్రాజెక్టు, ఎస్ హెచ్-31 లను నవంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. మడకశిర బ్రాంచి కెనాల్ పనుల్లో రైల్వే క్రాసింగ్ దగ్గర పనులు, పెన్నానది దాకా ఆకృతుల నిర్మాణం క్లిష్టతరమైనదని విడియో కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అడవిపల్లి రిజర్వాయర్ 99% పూర్తయ్యిందని వారు చెప్పారు. అనంతపురం జిల్లా మరాల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్ ప్రాజక్టులు నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.
పోలవరం పనులకు వర్షంతో అంతరాయం
ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టులో 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం పనులు 759 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమేష్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు లైవ్‌లో మాట్లాడారు. వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని ఆయన వివరించారు.
జలసిరికి హారతి తర్వాత 810 టీఎంసీల జలాలు
రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ప్రజల్లో జల చైతన్య కార్యక్రమంగా నిర్వహించిన ‘జలసిరికి హారతి’ ప్రభావాన్ని చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్త ఆడిట్ చేశాక 810 టీఎంసీల జలాలు వచ్చాయని తేలిందని, గత ఆరునెలల్లో నిల్వచేసిన నీటిలో ఇది 56%తో సమానమని ఆయన చెప్పారు. జలసిరికి హారతి తర్వాత ప్రాజెక్టులు సహా అనేక చెరువులు నిండాయని అధికారులు ‘జలశోభ’ అనే పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రియల్ టైమ్ లో వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు పడటంతో రబీసాగుకు రాష్ట్రమంతా పరిస్థితి ఆశాజనకంగా మారిందని చంద్రబాబు అన్నారు.
జలవనరుల శాఖ పనుల ప్రస్తుత స్థితిగతులపై www.apwrims.ap.gov.in కు లాగిన్ అయి వివరాలు పొందవచ్చని సిఎం చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 600 మి.మి వర్షపాతం నమోదైందని, చెరువులు నిండాయని, 9 జల్లాల్లో గత ఏడాదికంటే బాగా వర్షాలు పడ్డాయని నివేదిక పేర్కొంది. జలసంరక్షణను మరింత సమర్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వర్షాలు కొంతకాలం వెనుకపట్టు పట్టి ఆకస్మికంగా కరవు ఏర్పడితే పరిస్థితిని ఎదుర్కోవడానికి జలసంరక్షణ, నీటి యాజమాన్య నిర్వహణతో సంసిద్ధంగా ఉండడాలని ముఖ్యమంత్రి అధికారులకు పిలుపునిచ్చారు.