అసెంబ్లీల గడువు పొడిగించాలన్నా..కుదించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి
పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎలాంటి రాజ్యాంగ సవరణ, చట్టబద్దమైన ఛట్రం లేకుండా వచ్చే ఏడాది లోక్ సభతో పాటు ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి. రావత్ చెప్పారు. ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత కొనసాగించాలన్నా.. ఒక అసెంబ్లీని గడువును కుదించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమని రావత్ స్పష్టం చేశారు.
‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ అంటూ తమ విధానాన్ని సోమవారం అమిత్ షా పునరుద్ఘాటించిన నేపథ్యంలో మంగళవారం రావత్ ఈ అంశంపై స్పందించారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ 2015లోనే సమాచారాన్ని, సలహాలను ఇచ్చిందని రావత్ గుర్తు చేశారు. ఒకేసారి లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించడానికి ఇతర ఇబ్బందులు కూడా ఉన్నాయని రావత్ చెప్పారు. 100 శాతం వీవీపీఏటీలు ఒక సమస్య అని, అదనపు పోలీసు సిబ్బంది, పోలింగ్ సిబ్బంది అవసరమని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలతో పాటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగేలా చూడాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అందులో... ఈ ఏడాది డిసెంబర్ తో గడువు ముగిసే అసెంబ్లీలనుంచి వచ్చే ఏడాది చివరి వరకు గడువున్న అసెంబ్లీలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే... కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి లోక్ సభతో పాటే ఎన్నికలు నిర్వహించవచ్చని బీజేపీ వాదించింది.
లోక్ సభ గడువుకు ముందే అసెంబ్లీల గడువు ముగిసే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం, లోక్ సభ గడువు తర్వాత వచ్చే ఏడాది చివరి వరకు గడువున్న అసెంబ్లీలను ముందే రద్దు చేయడం ద్వారా తమ డిమాండ్ నెరవేరుతుందని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఏడాది చివరి వరకు గడువున్న రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉన్నందున ఆయా అసెంబ్లీల రద్దు సమస్య కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్ ఉన్నాయి. వాటిలో బీజేపీ సొంతగాగానీ, సంకీర్ణాల్లోగానీ ఉంది.
వచ్చే జూన్ లో లోక్ సభ గడువు ముగియక ముందే అసెంబ్లీల గడువు ముగిసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం ఉన్నాయి. వీటిలోనూ బీజేపీనే అధికారంలో ఉంది. ఆయా అసెంబ్లీల గడువు ఈ ఏడాది డిసెంబర్, వచ్చే జనవరితో ముగియనుంది. వీటి విషయంలోనే పీట ముడి పడుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగిసిన తర్వాత... ఎన్నికలు నిర్వహించే వరకు (లోక్ సభతోపాటు) రాష్ట్రపతి పాలన విధించవచ్చని బీజేపీ వాదిస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలంటే కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ కోల్పోతేనో... లేక సంకీర్ణ ప్రభుత్వాలు పతనమైతేనో... నివారించలేని కారణాలవల్ల ఎన్నికలను వాయిదా వేయవలసి వస్తేనో... 356 ఆర్టికల్ ను ఉపయోగించవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. బీజేపీ వాదనను కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అది రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని కాంగ్రెస్ అభిప్రాయం.
బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ యు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘ఒక దేశం.. ఒకే ఎన్నికలు’ ఐడియా మంచిదే గానీ ఇప్పుడు సాధ్యం కావని తేల్చి చెప్పారు. లోక్ సభతో పాటే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్న రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అయితే, ఒకేసారి ఎన్నికల మాట అటుంచి... బీజేపీకి ధైర్యం ఉంటే లోక్ సభ ఎన్నికలనే ముందుకు జరిపి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.