ఇది కార్పొరేట్ చీకటి ఆర్థిక ప్రపంచం

2 0
Read Time:5 Minute, 40 Second
‘పారడైజ్ పేపర్స్’లో బట్టబయలు..
ఎలిజబెత్ రాణి నుంచి వైఎస్ జగన్ వరకు..
రహస్య ఆర్థిక లావాదేవీల్లో నేతలు, సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు, వారితో సంబంధాలున్న ప్రముఖులు, రాజకీయ నేతల చీకటి ఆర్థిక కార్యకలాపాలు అనేకం తాజాగా రట్టయ్యాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్షార్షియం (ఐసిఐజె) వెల్లడించిన ’పారడైజ్ పేపర్స్’ అనేక రహస్య ఆర్థిక కార్యకలాపాలను బట్టబయలు చేశాయి. పన్ను ఎగవేతదారుల స్వర్గధామాలుగా ప్రసిద్ధి చెందిన దేశాలు, దీవులలో రహస్యంగా జరుగుతున్న లావాదేవీలు, పోగుపడుతున్న చీకటి సంపదపై ఐసిఐజె చేపట్టిన పరిశోధనా ఫలితమే ‘పారడైజ్ పేపర్స్’.

‘పారడైజ్ పేపర్స్’లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వరకు రహస్యంగా నడిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు, కేసుల ప్రస్తావనలు ఉన్నాయి. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా అధ్యక్షుల బంధు మిత్రుల పాత్రనూ ఈ పేపర్స్ వెల్లడించాయి. ప్రపంచలోనే అతి పెద్ద కంపెనీ యాపిల్, అతి పెద్ద స్టార్టప్ కంపెనీ ఉబర్, మన దేశానికి చెందిన సన్, మన రాష్ట్రానికి చెందిన జీఎంఆర్ రహస్య ఆర్థిక కార్యకలాపాలను నడిపినట్టు స్పష్టం చేశాయి.

ఇండియన్ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి పెద్దల సాయంతో దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యాకు సంబంధించి ఇప్పటిదాకా వెల్లడి కాని వివరాలు కొన్ని ‘పారడైజ్ పేపర్స్’లో కనిపిస్తాయి. అమితాబ్ బచ్చన్ నుంచి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల వరకు అనేక మంది రహస్య సంపదకు ’టాక్స్ హెవెన్స్’ ఎలా భద్రత కల్పించిందీ లీకైన ఈ పేపర్లు స్పష్టం చేస్తున్నాయి.

ఏమిటీ పారడైజ్ పేపర్స్?

చరిత్రలోనే అతి పెద్ద లీకులలో రెండోది ‘పారడైజ్ పేపర్స్’. ఏకంగా కోటీ 34 లక్షల పత్రాలను ఈసారి ఐసిఐజె వెల్లడించింది. ప్రపంచం మొత్తంమీద 95 మంది మీడియా భాగస్వాములున్న ఐసిఐజె ఇలా రహస్య డాక్యుమెంట్లను వెల్లడించడం ఇది నాలుగోసారి. ఈసారి జర్మనీ న్యూస్ పేపర్ రెండు సంస్థలనుంచి రహస్యంగా సేకరించిన డాక్యుమెంట్లను ఐసిఐజె ఆదివారం బహిర్గతం చేసింది.

మెజారిటీ పత్రాలు ‘యాపిల్ బై’ అనే లా కంపెనీ నుంచి సంపాదించినవి. బెర్ముడాలో, మరికొన్ని దేశాల్లో కార్యాలయాలున్న ఈ ’లా‘ సంస్థ… 50 ఏళ్ళుగా చేస్తున్న కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఐసిఐజె వెల్లడించినవాటిలో ఉన్నాయి. సుమారు 70 లక్షల రుణ ఒప్పందాలు, ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు, ఇమెయిల్స్, ట్రస్ట్ డీడ్స్, ఇతర పత్రాలు లీకయ్యాయి. మరో సంస్థ ఆసియాసిటీ నుంచి 100 పేజీల చొప్పున ఉన్న కార్పొరేట్ లావాదేవీల షీట్లు, డాలర్లలో పేమెంట్ లెడ్జర్లను జర్మనీ పత్రిక సేకరించింది.

స్థూలంగా చెప్పాలంటే… రాజకీయ నేతలకు విదేశాల్లో ఉన్న కంపెనీల వాటాలు, వారి ఫైనాన్షియర్ల వివరాలు, రహస్యంగా లావాదేవీలు నిర్వహించడం ద్వారా పన్నులు ఎగవేసిన పెద్దల వివరాల సమాహారమే ‘పారడైజ్ పేపర్లు’. బిలియనీర్లు, సెలబ్రిటీల డీల్స్ కూడా ఇందులో భాగమే. ప్రపంచవ్యాప్తంగా 120 మంది రాజకీయ నాయకులు, 100 కార్పొరేట్ కంపెనీల గుట్టు రట్టు చేశాయీ పేపర్లు. ఐసిఐజె ఆరు నెలలుగా ఆరు ఖండాల్లోని 30 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 380 మంది జర్నలిస్టులతో పని చేసింది. జర్నలిస్టులు కోర్టు రికార్డులను సైతం వదలకుండా సేకరించారు.

పన్నుల ఎగవేత… ఆఫ్ షోర్ సబ్సిడరీ కంపెనీల నిర్వహణపై సలహాలు ఇచ్చే ’యాపిల్ బై’… రెండో అతి పెద్ద కస్టమర్ ఇండియన్ కంపెనీనే కావడం గమనార్హం. 19 ట్యాక్స్ హెవెన్స్ నుంచి 180 దేశాలకు సంబంధించిన వివరాలు ‘పారడైజ్ పేపర్స్’లో ఉంటే అందులో పేర్ల సంఖ్య రీత్యా ఇండియా 19వ స్థానంలో నిలిచింది. మొత్తంగా 714 మంది ఇండియన్లు ఈ రహస్య సంపదను పోగేసిన… రహస్య లావాదేవీలు నడిపినవారిలో ఉన్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %

Leave a Reply