‘పార్లే’ నుంచి 10,000 ఉద్యోగాలు పోతున్నాయ్!

18 1

ఇండియాలో బిస్కట్ తయారీదారుల్లో దిగ్గజం పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడా కంపెనీ బిస్కట్ల అమ్మకాలు తగ్గిపోవడంతో ఏకంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఓ అధికారి బుధవారం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని తగ్గించినట్టు ఆయన చెప్పారు.

ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాలో ఇప్పుడు పలు రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. కార్ల నుంచి దుస్తులవరకు అమ్మకాలు పడిపోయాయి. కంపెనీలు ఉత్పత్తి తగ్గించుకొని ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఆయా రంగాలకు సంబంధించిన ప్రముఖులు ప్రభుత్వం నుంచి ఉద్ధీపన పథకాలను ఆశిస్తున్నాయి.

పార్లే కంపెనీ కేటగరి హెడ్ మయాంక్ షా శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కంపెనీ కష్టాన్ని ఏకరవు పెట్టారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన చెబుతున్నారు. ‘‘బిస్కట్ల అమ్మకాలు వేగంగా పడిపోయాయి. దీంతో ఉత్పత్తిని తగ్గించుకోక తప్పదు. దాని ఫలితంగా 8000 నుంచి 10,000 మందిని తొలగించవచ్చు’’ అని మయాంక్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకుంటే అన్ని ఉద్యోగాలను రద్దు చేయక తప్పకపోవచ్చని మయాంక్ అభిప్రాయపడ్డారు.

‘పార్లే-జి’ బిస్కట్లపై జి.ఎస్.టి. దెబ్బ

1929లో స్థాపించిన పార్లే కంపెనీలో ప్రస్తుతం లక్ష మంది వరకు పని చేస్తున్నారు. కంపెనీకి చెందిన 10 ఫ్యాక్టరీలు, 124 కాంట్రాక్టు తయారీ ప్లాంట్లలో ప్రత్యక్ష ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది కలిపి అంతమంది ఉంటారు. కంపెనీ ప్రస్తుత వార్షికాదాయం 1.4 బిలియన్ డాలర్లు. కంపెనీ పాపులర్ బ్రాండ్లలో పార్లే-జి బిస్కట్లది అగ్రస్థానం. 2017లో వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చాక పార్లే-జి బిస్కట్ల డిమాండ్ దారుణంగా పడిపోయిందని మయాంక్ షా చెబుతున్నారు.

జి.ఎస్.టి.తో ఒక్కో ప్యాకెట్ బిస్కట్లపై కనీసంగా రూ. 5 లేదా 7 సెంట్లు పన్ను భారం పడుతోందట. పన్ను పెరగడంతో ప్రతీ ప్యాకెట్లో బిస్కట్ల సంఖ్య తగ్గించింది కంపెనీ. దీంతో.. గ్రామీణ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల నుంచి బిస్కట్లకు డిమాండ్ తగ్గిపోయింది. పార్లే ఆదాయంలో సగభాగం గ్రామీణ ప్రాంతాలనుంచే వస్తోంది. అక్కడ వినియోగదారులు ధరలను గమనిస్తుంటారని, ఓ నిర్ధిష్ట ధరకు ఎన్ని బిస్కట్లు వస్తున్నాయో వారు చూస్తారని మయాంక్ విశ్లేషించారు. జి.ఎస్.టి. రేటును తగ్గించాలని గత ఏడాది కాలంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితోనూ, జి.ఎస్.టి. కౌన్సిల్ తోనూ చర్చలు జరిపినట్టు ఆయన చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బిస్కట్ బ్రాండ్

పార్లే-జి పూర్వనామం ‘పార్లే గ్లూకో’. పేరు మారాక 1980లు, 90లలో ఇండియాలో ఇంటింటా ప్రాచుర్యం పొందింది. 2003లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కట్ బ్రాండుగా పేరు సంపాదించింది. ఈ బ్రాండే కాదు. పార్లే ప్రధాన పోటీదారు అయిన బ్రిటానియా కంపెనీ బిస్కట్ల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి.

ఆర్తిక వ్యవస్థలో తీవ్రమైన సమస్య

ఆర్థిక వ్యవస్థలో ఓ తీవ్రమైన సమస్య ఉన్నట్టు స్పష్టమవుతోందని బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వరున్ బెర్రీ అంటున్నారు. 5 రూపాయల విలువైన ప్యాకెట్ కొనడానికి కూడా వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని ఆయన కొద్ది రోజుల క్రితం చెప్పారు.