టీడీపీతో పొత్తు: జనసైన్యానికి పవన్ కళ్యాణ్ స్పష్టత

admin
11 0
  • త్రిముఖ పోటీలో జనసేన బలి కాదు

  • పాపులారిటీ ఉంటే రాత్రికి రాత్రి అధికారం వస్తుందనేది కలే!

  • వ్యూహంతోనే అధికారానికి దగ్గరవుతాం 

  • ముఖ్యమంత్రి పదవిపై ఎన్నికల తర్వాతే చర్చ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు స్పష్టత ఇచ్చారు. జనసేనకు ప్రత్యర్థి వైసీపీ అని ప్రకటించిన పవన్... త్రిముఖ పోటీలో బలి కావడానికి పార్టీ సిద్ధంగా లేదని, మరోసారి ఓడిపోవడానికి తాను సిద్ధపడనని ఉద్ఘాటించారు. జనసేన బలం గత ఎన్నికలనాటికంటే కనీసం రెట్టింపు అయిందని, అయితే అధికారం సాధించడానికి అది చాలదని, అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పవన్ పేర్కొన్నారు.

శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ మండల, డివిజన్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది మన బలాబలాలను బట్టి ఎన్నికల తర్వాత చర్చిద్దామని, ముందుగా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంపై దృష్టి సారించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్న వైసీపీ నుంచి అధికారం తీసుకొని ప్రజలకు అధికారం ఇవ్వాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ లక్ష్య సాధనకోసం అందరూ కలసి వస్తే సంతోషమని, గౌరవప్రదంగా ఉంటే టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. పొత్తులను తక్కువగా అంచనా వేయవద్దని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని చెప్పాలంటూ సలహాలు ఇస్తున్న పెద్ద మనుషులెవరూ తాను గత ఎన్నికల్లో పోటీ చేస్తే భీమవరం వచ్చి ప్రచారం చేయలేదని పవన్ ఆక్షేపించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చీకొట్టినవాడికి మద్ధతుగా కాపు నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. ‘‘మీరు నిలదీయాల్సింది తప్పు చేసినవాళ్లనా లేక పవన్ కళ్యాణ్ నా?’’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తప్ప పొత్తు ఉండదని జనసేన నాయకులు మాట్లాడటం సరి కాదన్నారు.

అధికారం రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనే నినాదాలతో ప్రయోజనం లేదని, ఓట్లు వేస్తేనే సిఎం అవుతానని పవన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 40-50 సీట్లలో గెలిచి ఉంటే ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. ‘‘ఎంఐఎంలా కనీసం 7 సీట్లలో కూడా గెలిపించలేదే. కనీసం విజయకాంత్ లా, 2009లో ఇచ్చినట్టు 18 సీట్లు కూడా ఇవ్వలేదే. నిజాయితీగా రాజకీయం చేస్తే ఫలితం ఇలా ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయని, అహంకారాలు ఉండవని పవన్ వ్యాఖ్యానించారు. వ్యూహం సంగతి బాధ్యతగల వ్యక్తులకు వదిలేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో అందరి అభిప్రాయాలను స్వీకరించి వ్యూహాత్మకంగా తాను నిర్ణయం తీసుకుంటానన్న పవన్, దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలని నాయకులను కోరారు.

ఎన్.టి. రామారావు పార్టీ పెట్టిన సమయంలో పరిస్థితులు వేరని, 60 ఏళ్ల వయసులో ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఇంత అరాచకం లేదని, ఒకే పార్టీ ఉందని, ఆయనకు అనుభవజ్ఞులైన నేతల సహకారం ఉందని పవన్ పేర్కొన్నారు. ఒక వ్యక్తికి పాపులారిటీ ఉన్నంత మాత్రాన రాత్రికి రాత్రి అధికారం వస్తుందనేది కల మాత్రమేనని, ఎన్.టి. రామారావు తరహాలో తానూ అధికారం సాధిస్తానని అనుకోలేదని స్పష్టం చేశారు.

టీడీపీ నేతను ముఖ్యమంత్రిని చేయడానికా... లాజిక్ లేదు!

తెలుగుదేశం పార్టీ నేతను ముఖ్యమంత్రిని చేయడానికే తాను రాజకీయాలు చేస్తున్నానన్న విమర్శలో లాజిక్ లేదని పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ‘‘డివిజన్ స్థాయిలో పార్టీకి నాయకులు మీరే కావాలని కోరుకుంటారు తప్ప పక్కన వ్యక్తి కావాలని కోరుకోరు కదా? అలాగే ఒక పార్టీ అధినేతగా నేను వేరే పార్టీవారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు రాజకీయం చేస్తాను. లాజిక్ ఉందా?’’ అని పవన్ ప్రశ్నించారు.

‘‘ముఖ్యమంత్రి పదవి తానై వరించాలి గాని, నేను దాని కోసం వెంపర్లాడను. మనోహర్ గారు ఇదే మాట అన్నప్పుడు కొందరు ఆయనను తీవ్రంగా విమర్శించారు. అది సరి కాదు. సినిమాల్లో కూడా ఎవరూ నన్ను సూపర్ స్టార్ ను చేయలేదు. అది నేను సంపాదించుకున్నాను.’’ - పవన్

ఈ వ్యక్తి మళ్లీ సిఎం అయితే ఆంధ్రప్రదేశ్ కోలుకోదు

రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతిని, గూండాయిజాన్ని వైసీపీ పెంచి పోషించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ‘‘హెలికాప్టర్ లో వెళ్తూ కూడా కింద చెట్లను కొట్టించే వ్యక్తి అతను’’ అంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ప్రజల్లో పచ్చదనాన్ని చంపేశాడని, దారిపోడవున పచ్చని చెట్లను కూల్పించాడని విమర్శించారు.

‘‘ఏ కులానికి న్యాయం చేశాడాయన? షాదీ ముబారక్ ఇచ్చాడా? అంబేడ్కర్ స్కాలర్ షిప్ తీసేశాడే!! అతనిని ఆంధ్రప్రదేశ్ ప్రత్యర్ధిగానే ప్రకటించాలి. అతన్ని తీసేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మామూలు వ్యక్తి కాదతను. అడ్డగోలుగా డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో గూండాలను అధికారులను కొనేసి మనందరినీ బెదిరిస్తున్నాడు. ఈ వ్యక్తి మరోసారి సిఎం అయితే ఆంధ్రప్రదేశ్ జీవితంలో మళ్లీ కోలుకోదు. అలాంటి వాళ్ళను ప్రత్యర్థిగా ప్రకటిస్తామా... టీడీపీని ప్రత్యర్థిగా ప్రకటిస్తామా?’’ అని పవన్ ప్రశ్నించారు.

డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయంటున్న నేపథ్యంలో... జూన్ నుంచి పార్టీ ఎన్నికల కార్యాచరణ ఉంటుందని, త్వరలో నాదెండ్ల మనోహర్ వివరాలు ప్రకటిస్తారని పవన్ చెప్పారు. జూన్ నుంచి తాను రాష్ట్రంలో తిరగడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

‘‘అజాత శత్రువుగా ఉండటానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. కొంతమంది నన్ను శత్రువుగా పరిగణిస్తానంటే సంతోషమే. మెజారిటీ బాగుండటానికి కొంతమందికి శత్రువు కావడానికి నేను సిద్ధమే.’’ అని పవన్ పేర్కొన్నారు.

error

Enjoy this blog? Please spread the word