కుల సామరస్యం… అమరావతికి అవశ్యం…

పరిటాల నాకు గుండు కొట్టించారనడం అవాస్తవం

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా నిర్మాణం జరగాల్సిన అమరావతి మహానగరం ప్రపంచ ప్రమాణాలు అందుకోవాలంటే ఈ ప్రాంతంలో కులసామరస్యం అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. దశాబ్దాలు గడచినా విజయవాడలో కులాల వైరుధ్యాలు అలాగే ఉన్నాయని పవన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో తన పాత్ర ఉందన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయంతో తాను ఏకీభవిస్తానని, అయితే… చారిత్రకంగా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతూనే వచ్చిందని, అది అన్ని జిల్లాలు.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల సహజీవనానికి నెలవుగా మారిందని పవన్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా చినకాకానిలో తమ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ముఖ్యంగా విజయవాడలో ఉన్న కుల వైరుధ్యాలను ప్రస్తావించారు.

హైదరాబాద్ లో కులం ప్రభావం లేదని, అక్కడ తెలంగాణ భావన మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్ సమాజంలో కులం ప్రభావం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన కమ్మ, కాపు ఘర్షణలను ప్రస్తావించిన పవన్… దానివల్ల ఇరు పక్షాల్లోని సామాన్యులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వంగవీటి మోహన్ రంగా హత్యను ప్రస్తావించిన పవన్.. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆ హత్య జరిగిందని, నిరాయుధుడైన రంగాను చంపడం తప్పని వ్యాఖ్యానించారు. రంగాగురించి మాట్లాడకుండా విజయవాడ రాజకీయ చరిత్ర గురించి మాట్లాడలేమన్నారు.

రంగా హత్య తర్వాత జరిగిన గొడవల్లో అమాయకులైన కమ్మవర్గంవారిపై దాడులు జరిగాయని, చాలా మంది నష్టపోయారని పవన్ చెప్పారు. నిజానికి రంగా హత్యతో వారికేమీ సంబంధం లేదని, ఇలా సంబంధం లేనివారిపై దాడులు చేసే ఉన్మాదం వల్ల సమాజానికి చాలా నష్టమని పేర్కొన్నారు. అప్పటి పరిణామాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల మనసుల్లో ఉన్నాయని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో అన్ని కులాలు, వివిధ మతాల ప్రజలు సహజీవనం సాగించినప్పుడే రాజధాని సమున్నతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. తనకూ ఓ కులం ఉందని, అయితే దానికి పరిమితం కానని స్పష్టం చేశారు. ఒక కమ్మ అమ్మాయి ఏదైనా సమస్యను ఎదుర్కొంటే తాను తప్పనిసరిగా స్పందిస్తానన్నారు.

పరిటాల రవి గుండు కొట్టించారనడం అవాస్తవం

కీర్తిశేషులు పరిటాల రవీంద్ర తనకు గుండు కొట్టించారని జరిగిన ప్రచారాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ ప్రస్తావించారు. అందులో ఏమాత్రం నిజం లేదని, నిజానికి ఆ ప్రచారం జరిగే సమయానికి తనకు పరిటాల రవి ఎవరో తెలియదని పవన్ చెప్పారు. ఈ ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీవారే చేశారని, ఆ విషయం కూడా తనకు తెలిసినా అది మనసులో పెట్టుకోకుండా టీడీపీకి గత ఎన్నికల్లో మద్ధతు ఇచ్చానంటే అది రాష్ట్రంకోసమేనని పవన్ పేర్కొన్నారు. ‘నేను బీహెచ్ఇఎల్ వద్ద తమ్ముడు సినిమా షూటింగ్ లో ఉండగా మా రెండో అన్నయ్య నాగబాబు ఫోన్ చేశారు. ఎక్కడున్నావని అడిగితే షూటింగ్ చేస్తున్నానని చెప్పాను. పరిటాల రవి నిన్ను కొట్టినట్టుగా టీడీపీ ఆఫీసునుంచి ఫోన్ వచ్చిందని మా అన్నయ్య చెప్పాడు. ఈ మాట విన్నప్పుడు నా మొదటి స్పందన ఏమిటంటే.. పరిటాల రవి ఎవరు? అదే మా అన్నయ్యను అడిగాను’ అని పవన్ దాదాపు దశాబ్దంనర క్రితం వ్యవహారాన్ని మననం చేసుకున్నారు.

అప్పట్లో వరుస సినిమాలతో విసిగిపోయి తానే తల భారంగా అనిపించి గుండు చేయించుకున్నానంటూ.. పరిటాల రవి కొట్టి గుండు చేయించినట్టుగా మూడేళ్లపాటు జరిగిన ప్రచారం తనను ఎంతో బాధించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన ఈ ప్రచారం అప్పట్లో చంద్రబాబునాయుడుకు తెలియకపోయి ఉండవచ్చన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులతో సమావేశం

కార్యకర్తలతో సమావేశానికి ముందు పవన్ విజయవాడలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పవన్ ను కలసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం వల్ల తాము ఎలా నష్టపోతున్నదీ వివరించారు. వారి సమస్యల పరిష్కారంకోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చిన పవన్, విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన సమ్మెకు మద్ధతు ప్రకటించారు. ఫాతిమా కళాశాల బాధిత విద్యార్ధులు కూడా పవన్ ను కలసి తమ సమస్యను వివరించారు.

Related posts

Leave a Comment