పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి..
కేంద్ర వైఖరిపై పెదవి విరుపు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు పూర్తి చేయకపోతే ఇక జీవితంలో సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ప్రాజెక్టును నిర్మించి తీరాలని ఉద్ఘాటించారు. నిధుల సమస్య, అంచనాల పెంపు, కాంట్రాక్టర్ మార్పు తదితర అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చోపచర్చలు నడిచిన నేపథ్యంలో… ముఖ్యమంత్రి శనివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు చంద్రబాబు నాగపూర్ వెళ్ళి మరీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలసిన విషయం తెలిసిందే. ఖర్చు చేసిన నిధులు త్వరితగతిన విడుదల చేయడం, పెరిగిన అంచనాలను ఆమోదించడం, కాంట్రాక్టర్ మార్పుతో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడం అన్న అంశాలపై గడ్కరీతో మాట్లాడిన చంద్రబాబు.. విదేశీలనుంచి వచ్చాక తొలిసారి శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి నిధులను ముందుగానే ఇవ్వకుంటే తాము పని చేయలేమని కాంట్రాక్టు సంస్థ చెబుతోందని, కేంద్రమేమో త్వరగా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. పోలవరంతో పాటు ప్రత్యేక ప్యాకేజీలోని ఇతర అంశాలకూ నిధుల రావడంలేదని ముఖ్యమంత్రి ఒకింత అసహనంగానే చెప్పారు. పోలవరంలో అనేక సంస్థలు సబ్ కాంట్రాక్టులు చేస్తున్నాయన్న సిఎం, చేసిన పనికి నిధులు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయని, పని ఏమాత్రం ఆలస్యమైనా వ్యయం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం సవరించిన అంచనాల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావసం తదితర అంశాలకే రూ. 33 వేల కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని, 200 గ్రామాలు, నివాస ప్రాంతాలు ఖాళీ చేయించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం అధిక కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉందని, అందుకే వ్యయం పెరుగుతోందని చెప్పారు. దానికి తోడు కాంగ్రెస్ హయాంలో పోలవరం టెండర్ ను 14 శాతం తక్కువకు ఇచ్చారని, ఈ విధంగా రాష్ట్రంలో అన్నిచోట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేసిందని విమర్శించారు.
వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని పనులకూ వారు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. విదేశాల్లో సముద్రాలపైనే వంతెనలు కడుతుంటే.. మనదగ్గర మాత్రం నదిపక్కన రాజధాని నిర్మాణమూ వద్దంటున్నారని, కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ఆక్షేపించారు.
ఈసారి నా ఫోకస్ వ్యవసాయమే..
గతంలో ఐటీ ద్వారా నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికానని, ఈసారి మాత్రం తన ఫోకస్ వ్యవసాయంపైనేనని చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చిన చంద్రబాబు.. శనివారం ఆ వివరాలను విలేకరు సమావేశంలో వెల్లడించారు. తొమ్మిది రోజుల పర్యటనలో మూడు ఖండాల్లోని ఏడు నగరాను సందర్శించి 800 మంది సీఈవోలను కలిశానని, ఐదు ఎంఒయులు, 75 ఎల్ఒఐలు కుదుర్చుకున్నాని, రూ. 65 వేల కోట్ విలువైన పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చలు జరిపామని, అవి సఫలమైతే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు.
వ్యవసాయం ఏ విధంగా లాభసాటి చేయగలుగుతామన్న ఆలోచనతోనే.. విదేశీ పర్యటనలో కూడా ఫోకస్ పెట్టానని సిఎం చెప్పారు. ప్రపంచంలో వ్యవసాయానికి సంబంధించిన అత్యుత్తమ టెక్నాలజీ, నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే అయోవా, వాగనింగన్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.
ఒకప్పుడు ఐటీ ద్వారా నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికానని, ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే వ్యవసాయంపై కేంద్రీకరించామని సిఎం చెప్పారు. వ్యవసాయానికి ఎక్కువ సమయం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 5,000 ఎంపిఇఒలను నియమించానని, రెయిన్ గేజింగ్, విత్తనాలు, మందులు కొరత లేకుండా, మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా చూస్తున్నానని చెప్పారు.
పోలవరంపై జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, అధికారులతో సిఎం సమావేశమయ్యారు. పోలవరంపై ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో ఢిల్లీలో జరిగిన సమావేశానికి ఉమ హాజరయ్యారు. తాజా పరిస్థితి, అంచనాల్లో చేయవలసిన మార్పులపై ఈ సందర్భంగా చర్చించారు.