1980ల తర్వాత ఇప్పుడే కొత్త రాజకీయ శకం…
కాపులకు రిజర్వేషన్ సాధ్యమేనా?
మభ్యపెట్టి కోల్డ్ స్టోరేజీలోకి పంపారు
జనసేన ఏ కులాన్నీ మభ్యపెట్టదు
జనసేన ఆవిర్భావ సభలో వ్యాఖ్యలు
రాజకీయ అధికారం కొన్ని కులాల గుప్పిట్లో ఉండటానికి వీల్లేదని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బుధవారం పవన్ ప్రసంగించారు. ప్రతి 30ఏళ్ళకు ఓ రాజకీయ మార్పు జరుగుతుందన్న సూత్రాన్ని ఉటంకించిన పవన్ కళ్యాణ్… రాష్ట్రంలో 1980లలో మొదలైన ఓ రాజకీయ శకం ఇప్పుడు ముగిసిందని, ఓ నూతన రాజకీయ శకం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. 1982లో ప్రారంభమైన టీడీపీ శకం ముగిసిందని, జనసేనతో నూతన రాజకీయ శకం ప్రారంభమైందని పవన్ పరోక్షంగా చెప్పారు.
‘‘అభివృద్ధి, అధికారం కొందరికేనా? కొన్ని కులాల గుప్పిట్లోనేనా… కుదరదు. అన్ని కులాలకూ న్యాయమైన అధికారం రావాలి. కొద్దిమంది ఆధిపత్యంలో రాజకీయం ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి’’ అని జనసేనాని వ్యాఖ్యానించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో బోలెడు వనరులున్నా ప్రజలు వలసలు వెళ్తంటారని, కానీ రాజకీయ నాయకులు వలసలు వెళ్ళరని, దీనికి కారణం స్థానికంగా ఉండే ఆర్థిక వనరులపై నాయకుల ఆధిపత్యం ఉంటుందని చెప్పారు. ఉదాహరణగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రస్తావించారు.
ప్రస్తుత సిఎం సహా రాయలసీమ నుంచి అనేకమంది సీఎంలు వచ్చారని, అయినా అక్కడ ఎన్నో కన్నీటి గాథలున్నాయని పవన్ పేర్కొన్నారు. ఏపీ రాజకీయ చిత్రపటం బలంగా మారబోతోందని, సరికొత్త రాజకీయ వ్యవస్థ వస్తోందని పవన్ ఉద్ఘాటించారు. ‘‘జనసేన ఈ మూడున్నర సంవత్సరాల్లోనేర్చుకున్నదేమిటంటే… రోడ్లపైకి వచ్చే పోరాడేవారే కాదు… ఇంటలెక్చువల్ వారియర్స్ కూడా కావాలి. వారి సలహాలు సంప్రదింపులతో జనసేన పనిచేస్తుంది’’ అని పేర్కొన్నారు.
తాను మద్ధతిచ్చింది రాష్ట్ర పునర్నిర్మాణానికే గాని, టీడీపీ పునర్నిర్మాణానికి కాదని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులాల మధ్య చంద్రబాబు ప్రభుత్వం చిచ్చు పెట్టిందని పవన్ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమేనా అన్న అంశంతో నిమిత్తం లేకుండా మభ్య పెట్టారని, ఆ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయంలో కోల్డ్ స్టోరేజీకి చేరిందని, ఇక అది బయటకు రాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కాపులు, బీసీల మధ్య తగాదా పెట్టారని ఆక్షేపించారు. మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చి ఆదివాసులతో వారికి తగాదా పెట్టారని, తాను మత్స్యకారులకు మద్ధతు ఇచ్చినట్టుగా ప్రచారం చేసి గిరిజనులను తనపైకి ఉసిగొల్పారని విమర్శించారు. ఎస్సీల మధ్య కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారని ఆరోపించారు.
‘‘జనసేన యువతను విడదీస్తుందా? మీరే చెప్పండి. జనసేన ఏ కులాన్నీ మభ్యపెట్టదు. ముందు ఎవరికి ఏం కావాలో తెలుసుకొని అవి చేస్తుంది. కుల నిర్మూలన చేయలేకపోవచ్చు..కానీ జనసేన కులాల మధ్య ఐక్యతను సాధిస్తుంది. ఇప్పుడు బస్సుల్లో వచ్చినవారిలో ఎవరు ఏ కులమో తెలియదు’’ అని పవన్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 14న జనసేన విడుదల చేసే మేనిఫెస్టోతో పార్టీ విధానాలు అర్ధమవుతాయని పేర్కొన్నారు. సాధించలేమని తెలిసీ మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చారంటూ… ప్రజలను ఎందుకు విడదీస్తారని పవన్ ప్రశ్నించారు.
పథకాలకు మీపేర్లేనా?
ప్రభుత్వ పథకాలకు కేంద్రంలో గాంధీల పేర్లు, రాష్ట్రంలో చంద్రన్న పేరు పెట్టడాన్ని పవన్ ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, డొక్కా సీతమ్మ వంటి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టరు? ఆహార పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాలన్న ఆలోచన మీకెందుకు రాలేదు? ఆ పని జన సేన చేస్తుంది. గౌతు లచ్చన్న పేరు పెట్టవచ్చు కదా.. చంద్రన్న పేరుకు బదులు..! మీరు కాంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. కానీ, ఇంకా నాయకులున్నారు కదా? మీరు పుట్టక ముందే ప్రముఖులైన నాయకులున్నారు. వారి పేర్లు పెట్టవచ్చు కదా’’ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.