ఢిల్లీలో ఎమర్జెన్సీ.. కాలుష్య బీభత్సానికి పరాకాష్ఠ

కాలుష్య మేఘాలు కమ్ముకున్న జాతీయ రాజధాని ఢిల్లీలో ఎమర్జెన్సీని ప్రకటించారు. నగరంలోకి ట్రక్కుల ప్రవేశాన్ని, నగరంలో నిర్మాణ కార్యకలాపాలనూ నిషేధించారు. మూడు రోజుల క్రితం కాలుష్య భూతం జడలు విప్పుకొని రోజురోజుకూ..ఆ మాటకొస్తే గంటగంటకూ దట్టమవుతుండటంతో భయానక వాతావరణం నెలకొంది.

ఇప్పటికే పాఠశాలలకు ప్రకటించారు. కాలుష్యం విస్తరించి ముందున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితుల్లో బుధవారం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పరిస్థితి విషమించడంతో మొత్తం ఢిల్లీ ప్రజానీకం ఇబ్బందులు పడుతోంది. తలనొప్పి, దగ్గు, కళ్ళు మంటల వంటి సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది ఇళ్ళు వదిలి బయటకు రావడంలేదు. దీంతో… నిత్యం రద్దీగా ఉండే రెస్టారెంట్లు, ఇతర వ్యాపార కేంద్రాలు బోసిపోతున్నాయి.

ఈ పరిస్థితికి పరాకష్ఠ కాలుష్య అత్యయిక పరిస్థితి ప్రకటన. అధికార వర్గాలు సరైన నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన తాజాగా ప్రకటించారు.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి సంఖ్యల విధానంతో కార్లను రోడ్లపైకి అనుమతించే చర్యలను చేపట్టింది. అయితే, ఈ చర్యలేవీ వెంటనే కాలుష్యాన్ని తగ్గించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ వారాంతం వరకు కాలుష్య భూతం కమ్ముకుని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, కృత్రిమ వర్షం వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

ఢిల్లీ కాలుష్యానికి కారణం.. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు పంట నూర్చిన తర్వాత మిగిలిన కట్టెను తగులబెట్టడమేననే వాదనలు ఉన్నాయి. ఈ వాదనను వినిపిస్తున్నవారు ’నాసా’ శాటిలైట్ ఫొటోలను సాక్ష్యాలుగా చూపుతున్నారు. అయితే, ఇలా వేస్ట్ ను తగులబెట్టకుండా రైతులను నిరోధించడం సాధ్యం కాదని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.

Related posts

Leave a Comment