2017-18 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రుణ ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యతా రంగాలకు రూ. 1,26,806 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలి. కానీ ఖరీఫ్ సీజన్ వరకు ఇచ్చిన మొత్తం 66,215 కోట్లు. అంటే 52 శాతం. ప్రాధాన్యేతర రంగాలకు రూ. 40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా అప్పటికే 43,690 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అంటే 109 శాతం. బ్యాంకుల ప్రాధాన్యతలకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి.
మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి రుణ ప్రణాళిక అమలు తీరును సమీక్షించారు. 2017-18 లో వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యం రూ.87,471 కోట్లు కాగా గత సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ. 49,055 కోట్లు (56.08%) మంజూరు చేసినట్లు బ్యాంకర్లు ఈ సమావేశంలో తెలిపారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ. 25,000 కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో రూ.13,553 కోట్లు (54.21%) మంజూరు చేశారు.
ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.14,335 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా రూ.3,607 కోట్లు (25.16%) మాత్రమే ఇచ్చారు. అన్ని రంగాలకూ కలిపి మొత్తం వార్షిక రుణ ప్రణాళిక కింద రూ. 1,66,806 కోట్ల మేరకు రుణాలు ఇవ్వవలసి ఉండగా రూ. 1,09,905 కోట్లు (65.89%) ఇచ్చారు. అందులో ప్రాధాన్యతా రంగాలకు లక్ష్యం రూ. 66,215 కోట్లు (లక్ష్యంలో 52.22%), ప్రాధాన్యేతర రంగాలకు రూ.43,690 కోట్లు (లక్ష్యంలో 109.23%) మంజూరయ్యాయి.
వ్యవసాయంలో పంట రుణాలకు రూ.38,894 కోట్లు మంజూరు చేస్తే.. అనుబంధ రంగాలకు మరో రూ.10,162 కోట్లు విడుదల చేశారు.