రేవంత్ రెడ్డిపై వేటు..! రమణ స్పష్టమైన సంకేతాలు

1 0
Read Time:11 Minute, 33 Second

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోనుందా? ఆ పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటనలు, మీడియాతో చెప్పిన విషయాలు ఈ దిశగా ఇస్తున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రమణ మంగళవారం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నియమావళిని అతిక్రమించినవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ (జాతీయ) అధ్యక్షుని అనుమతి లేకుండా ఇతర పార్టీల నేతలను కలవడం తప్పని కూాడా స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసిన విషయమై స్పష్టమైన వివరణ కోరినట్టు వెల్లడించిన రమణ, ఇవ్వకపోతే బాధ్యతలనుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. ’మా పార్టీ నేతలు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ క్రమశిక్షణా సంఘం ద్వారా నోటీసులు ఇస్తాం. వారు వివరణ ఇవ్వాల్సిందే’ అని రమణ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి గత వారం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, మరికొందరు కాంగ్రెస్ పెద్దలను కలసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే మీడియాతో చిట్ చాట్లో రేవంత్… సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నేతలపై ఆరోపణలు చేస్తూ పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు. తర్వాత జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డికి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రమణ కూడా.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలవడాన్ని ఆక్షేపిస్తూ దానిపై వివరణ ఇవ్వాలని సూచించారు.

ఆ తర్వాత రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలపై మాట్లాడారు. అందులో వివరణ స్పష్టంగా లేదని వ్యాఖ్యానించిన రమణ.. మంగళవారం ఈ విషయమై విలేకరులతో ప్రత్యేకంగా చిట్ చాట్ ఏర్పాటు చేశారు. పార్టీ  ఎదుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించడం, వ్యక్తిగత స్వార్ధంకోసం ఆలోచించడం సరి కాదంటూ.. రమణ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మిత్రులెవరో.. ప్రత్యర్ధులెవరో ఇప్పుడే నిర్ణయించలేమని స్పష్టం చేస్తూ.. టీఆరెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలకు కూడా రమణ స్పందించారు. తాను టీఆరెస్ పార్టీలోచేరుతున్నట్టు ఎక్కడా ప్రకటించలేదని, తాను ఇతర పార్టీలకు చెందిన ఏ వ్యక్తినీ వ్యక్తిగతంగా కలసిన సందర్భం లేదని స్పష్టం చేశారు. ’మేం ఎవరి పార్టీ లైన్ లోకి వెళ్ళం. ఇతరులే మా పార్టీ లైన్ లోకి రావాలి. అప్పుడు పొత్తులపై పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం’ అని రమణ ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన తర్వాత రమణ ఓ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.

రమణ చెప్పిన విషయాలు, చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు

వ్యక్తిగత స్వార్ధంతో కాంగ్రెస్ నేతలను కలిస్తే…
  • పార్టీ నియమావళిని అతిక్రమించిన వాళ్ళకు వేటు తప్పదు.
  • ఎవరైనా పార్టీ జెండా, ఎజెండాకు కట్టుబడి పని చేయాల్సిందే.
  • పార్టీ అధ్యక్షుని అనుమతి లేకుండా ఎవరూ ఇతర పార్టీల నాయకులను కలవకూడదు. ఎవరైనా కలవాలనుకుంటే ఎందుకో చెప్పి అధ్యక్షుడి అనుమతి తీసుకోవలసిందే.
  • మోత్కుపల్లి నర్సింహులు మీడియా మిత్రులు అడిగినప్పుడు.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పొత్తులు ఉండవని చెప్పారు.
  • సింగరేణి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పొత్తులపై తన వైఖరి చెప్పారు.
  • ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయం చర్చిద్దామని, అప్పటివరకు ఎవరూ మాట్లాడవద్దని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పారు.
  • రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, అక్కడ జరిగిన పరిణామాలు, మీడియాలో వచ్చిన కథనాలపై పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాం. రేవంత్ రెడ్డిని వివరణ కోరాం.
  • కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుంతియా, ఇతర కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరనున్నట్టు ప్రకటనలు చేశారు.
  • డికె అరుణను రేవంత్ రెడ్డి కలసినట్టు, పార్టీలో చేరిక అధిష్ఠానం నిర్ణయమని అరుణ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
  • మా పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తా కథనాలు వచ్చాయి.
  • పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు మరోసారి పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించాం.
  • వ్యక్తిగత స్వార్ధం, రాజకీయ ప్రయోజనాలకోసం ఇతర పార్టీల నేతలను కలిస్తే… దానిపై మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించాలని ఆదేశించాం.
  • డీకే అరుణను రేవంత్ కలిశాడా.. లేదా? ఇతర కాంగ్రెస్ నాయకులను కలిశాడా..లేదా? అన్న విషయమై స్పష్టత అవసరం.
  • ఆదివారం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి స్పందించినా ఇంకా స్పష్టత రాలేదని భావిస్తున్నాం.
  • టీటీడీపీ శాసనసభాపక్ష నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠ దిగజారే విధంగా.. పార్టీకి నష్టం చేకూరే విధంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు ఆయన లీగల్ నోటీసులు ఇవ్వాలి.
  • పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విదేశీ పర్యటనలో ఉన్న జాతీయ అధ్యక్షులవారికి నివేదిస్తాం.
26న టీ.టీడీఎల్పీ సమావేశం తర్వాత నిర్ణయం
  • తెలంగాణలో టీడీపీకి అనుభవం, సమర్ధత గల నాయకులున్నారు.
  • 2015లో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసెడెంట్ అయ్యారు. అంతకు ముందు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేదు.
  • పార్టీ అధ్యక్షుడిగా నేనున్నా. పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మరొకరికి ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడికి సూచించాను.
  • ఔత్సాహికుడైన రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు.
  • రేవంత్ రెడ్డికి అన్ని విధాలా సాయమందించాం. ప్రోత్సహించాం.
  • ఇప్పుడు పార్టీ ఎదుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించాలనుకోవడం, వ్యక్తిగత స్వార్ధంకోసం ఆలోచించడం సరికాదు.
  • 26న జరిగే టీ. టీడీఎల్పీ సమావేశంలో మా పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాం.
టీఆరెస్ ప్రతిపక్షాలన్ని శత్రువులుగా..
  • టీఆరెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని పక్షాలతో కలసి పని చేశాం.
  • టీఆరెస్ ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్ధులుగా భావించడంలేదు. శత్రువులుగా పరిగణించి అణచివేత ధోరణిని అవలంభిస్తోంది.
  • ఇక్కడి పార్టీ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను జాతీయ అధ్యక్షుడు మాకు ఇచ్చారు.
పొత్తులపై ఎవరైనా మాదారికొస్తేనే…
  • వచ్చే ఎన్నికల్లో మాకు శత్రువులెవరో.. మిత్రులెవరో ఇప్పుడే నిర్ణయించలేం.
  • పొత్తులపై నిర్ణయం ఏ ఒక్కరో తీసుకునేది కాదు. పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించాల్సిందే.
  • మేం ఎవరి పార్టీ లైన్ లోకి వెళ్లం. ఇతరులే మా పార్టీ లైన్ లోకి రావాలి. అప్పుడు పొత్తులపై పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం.
టీడీపీకి సమర్ధ నాయకత్వం, ధైర్యవంతులైన కార్యకర్తలున్నారు
  • తెలంగాణలో టీడీపీకి అనుభవం, సమర్ధత గల నాయకులున్నారు.
  • తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత ధైర్యవంతులు.
  • పార్టీ అధ్యక్షునిగా కార్యక్రమాలను సజావుగా నిర్వహించడం నా బాధ్యత.
  • తెలుగుదేశం పార్టీ సామాజిక తెలంగాణకు, పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉంటుంది.
  • గత 35 సంవత్సరాల్లో టీడీపీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
  • రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు తెలంగాణలోనే మహానాడు నిర్వహించాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగితే… తెలంగాణ వరకు ప్రత్యేక మహానాడు నిర్వహించుకున్నాం.
  • తెలంగాణ మహానాడులో అన్ని విషయాలూ చర్చించాం.
  • నేను టీఆరెస్ పార్టీలో చేరుతున్నానని ఎక్కడా చెప్పలేదు. నేను ఏ వ్యక్తినీ వ్యక్తిగతంగా కలసిన సందర్భాలు లేవు.
  • పార్టీని, నాయకులను కాపాడుకోవలసిన బాధ్యత అధ్యక్షుడిగా నాపైన ఉంది.
  • సామాజిక తెలంగాణే టీడీపీ లక్ష్యం.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply