కేంద్రం చేసింది రాజ్యాంగ ఉల్లంఘన
వదిలేస్తే ప్రతిదానికీ ఇదే ఉదాహరణ అవుతుంది
మీ చట్టాలను మేమెందుకు పాటించాలి
పార్లమెంటులో ఏదో చేసి వదిలేస్తే కుదరదు
రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షానికీ హెచ్చరిక
రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదాకోసం ఆమరణ నిరాహార దీక్షకు తాను సిద్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్లమెంటులో హామీ ఇచ్చి తప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, దాన్ని ఉపేక్షిస్తే ఇకపైన పార్లమెంటులో ఇచ్చే హామీలకు ఇదే గతి పడుతుందని, హోదా అంశం రాజ్యాంగ ఉల్లంఘనులకు ఒక ఉదాహరణగా మారుతుందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్ళు గడచిన నేపథ్యంలో వార్షికోత్సవాన్ని బుధవారంనాడిక్కడ ఘనంగా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోని నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఉన్న విశాలమైన స్థలంలో భారీగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
25 మంది ఎంపీలను నియంత్రించడం ద్వారా ఐదు కోట్ల మంది ఆంధ్రులను నియంత్రించలేరని పవన్ కేంద్రానికి స్పష్టం చేశారు. ‘‘తెలుగువాడి పౌరుషం, ఆంధ్రుల ఆత్మగౌరవం తెలిసిరావాలి. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి ఇంకా ఉంది. రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తాం. ప్రత్యేక కేటగిరిపై మీరు చేతులు దులుపుకొని పోతే ఊరుకోం. అవసరమైతే నా బలిదానంతో హోదాను సాధిస్తాం’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పారు. యువతను రోడ్లపైకి తీసుకురాబోయే ముందు అవసరమైతే తానే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని పవన్ చెప్పారు. హోదా విషయంలో ఆమరణదీక్ష చేయవలసిన అవసరం కచ్చితంగా వస్తుందని భావించిన పవన్ కళ్యాణ్ ‘‘ఈ రోజునుంచి ఎప్పుడైనా చేయడానికి నేను సిద్ధం. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ దీక్ష తర్వాత తలెత్తే పరిణామాలకు బాధ్యత నాది కాదు’’ అని స్పష్టం చేశారు.
‘‘కేంద్రం అంటే మనవాళ్లకు భయం. దోపిడీ చేసేవాళ్ళకు పిరికితనం ఉంటుంది…మనకెందుకు? మనం టంగుటూరి వారసులం. సైమన్ కమిషన్ వస్తే… చొక్కా చించి గుండె చూపించి కాల్చుకోమన్నాడు టంగుటూరి. వారి వారసులం. కొన్ని బుల్లెట్లు మా ఉద్యమాన్ని ఆపలేవు. సీబీఐ కేసులు, మరికొన్ని కేసులవల్ల అవినీతి నేతలు మీరంటే భయపడవచ్చు. నావంటి వారు, ఇక్కడ ఉన్న ప్రజలు భయపడరు. కేంద్రం అంటే మాకు భయం లేదు..మేం వీధుల్లోకి వస్తాం. హైవేలు దిగ్భందిస్తాం. జంతర్ మంతర్ లో చేయం. అమరావతిలోనే చేస్తాం. మొత్తం ఇండియా మావైపు చూస్తుంది. మీరు మమ్మల్ని ఈ స్థితికి తెచ్చారు’’అని కేంద్రానికి అల్టిమేటమ్ జారీ చేశారు. పార్లమెంటులో ఏదో చేసి దాటవేస్తే కుదరదని కేంద్ర ప్రభుత్వంతో పాటు టీడీపీ, వైసీపీలనూ హెచ్చరించారు.
అరుణ్ జైట్లీ జీ… నేను పవన్ కళ్యాణ్
అరుణ్ జైట్లీ ప్రకటనలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ కేంద్రానికి అర్ధమయ్యేలా చెబుతానంటూ హోదాపై ఆంగ్లంలో మాట్లాడారు. ‘‘అరుణ్ జైట్లీ జీ… నా పేరు పవన్ కళ్యాణ్. 2014లో పార్లమెంటు సెంట్రల్ హాలులో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. గత నాలుగేళ్లలో రాష్ట్రం పట్ల మీ నిర్లక్ష్యం మాకు చాలా బాధ కలిగించింది. సెంటిమెంట్ కోసం కేటగిరి హోదా ఇవ్వం అని మీరన్నారు. మరి తెలంగాణ ఎలా ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు. 1972లో ఆంధ్రప్రజలు ప్రత్యే క రాష్ట్రం కోరితే కేంద్రం ఇవ్వలేదని, అప్పుడు 1000 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు వద్దంటున్నా విడదీసి హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఐదేళ్ళు చాలదని, పదేళ్లు ఇవ్వాలని కోరిన అరుణ్ జైట్లీ ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.
‘‘మీరు మాట తప్పారు. చట్టాన్ని ఉల్లంఘించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మీ చట్టాలను మేమెందుకు పాటించాలి? చట్టాలు మాకేగాని మీకు కాదా?’’ అని అరుణ్ జైట్లీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఇది కేవలం ఏపీకి ప్రత్యేక కేటగిరి ఇవ్వడానికి సంబంధించిన అంశమే కాదని, ఇకపై పార్లమెంటులో ఇచ్చిన హామీలేవీ అమలు చేయనవసరంలేదనడానికి ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని పవన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇది రాజ్యాంగ ఉల్లంఘన… అందుకే చాలా బలంగా తీసుకుంటున్నాం. చంద్రబాబు, జగన్ వేర్వేరు కారణాల వల్ల మీరంటే భయపడుతున్నారు. నేను అమరావతినుంచి చెబుతున్నా. 25 మంది ఎంపీలను నియంత్రించడం ద్వారా 5 కోట్ల మంది ప్రజలను నియంత్రించలేరు’’ అని స్పష్టం చేశారు.
అత్యంత అప్రజాస్వామికమైన పద్ధతిలో రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారని, తాము ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొన్ని అంశాలను నిగ్గుదేల్చిందని పవన్ చెప్పారు. ‘‘మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన అంశం కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవ అంశం’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్రం హోదా ఇవ్వకపోతే మన పిల్లలకు ఉపాధి కల్పించుకోలేమా? అనే అంశానికి జనసేన మేనిఫెస్టోలో చోటుంటుందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ సాధించి తీరతామన్న పవన్…‘‘ఈ ప్రభుత్వంలో కాకపోతే మరో ప్రభుత్వంలో’’ అని నర్మగర్భంగా ప్రకటించారు.
వామపక్షాలతో చర్చలు
తనతో కలసి వచ్చే పార్టీలో చర్చలు జరుపుతామన్న పవన్ కళ్యాణ్… సీపీఎం, సీపీఐలతో జనసేన రాష్ట్ర కార్యాలయంలో చర్చలు జరపబోతున్నామని వెల్లడించారు. ‘‘ప్రత్యేక కేటగిరిపై ఏం చేయాలి? అనే విషయం ఆలోచిస్తాం. ఒకరోజు ఇస్తామని మరోసారి లేదంటే చేవ చచ్చి కూర్చోం. మీరు అనుకున్నది కుదరదు. పోరాడి తీరతాం. ఇది చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాను’’ అని పవన్ పునరుద్ఘాటించారు. మీరంతా చదువుకునే పిల్లలు. మీరు బాగా చదవండి. రాజకీయ పోరాటాలు మేం చేస్తాం. మీమీద బాధ్యత పెట్టను. బలిదానాలు కోరను. బలిదానం అవసరమైతే పవన్ కళ్యాణ్ చేస్తాడు. మీరు సుఖంగా ఉండండి. ఉద్యోగాలు చేసుకోండి’’ అని పవన్ యువతకు చెప్పారు.