సొంత పార్టీపై రేవంత్ తొలి దాడి!

1 0
Read Time:11 Minute, 32 Second
  • యనమల బంధువులకు రూ. 2000 కోట్ల కాంట్రాక్టు.. పరిటాలకు బీరు ఫ్యాక్టరీ..!
  • ఇక కేసీఆర్ పై ఒక్క మాటైనా యనమల మాట్లాడనిస్తారా?
  • నన్ను జైలుకు పంపినోడికి ఆంధ్రలో వంగి వంగి దండాలా…!
  • టీడీపీ ఆంధ్రప్రదేశ్ నేతలపై రేవంత్ రెడ్డి మండిపాటు
  • పలు అంశాల్లో పార్టీ వైఖరికీ భిన్నమైన వ్యాఖ్యలు
  • తెలంగాణలో పార్టీల్లేవు… కేసీఆర్, ఆయన వ్యతిరేక కూటమే
  • పార్టీ ఎటువైపో తేల్చాలని అధిష్ఠానానికీ డిమాండ్!
  • కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్న

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీవైపు అడుగులేయడం ప్రారంభించారు. సొంత పార్టీ నేతలపై రాజకీయ దాడికి బుధవారం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానాన్ని నేరుగా విమర్శించకుండా పరోక్షంగా ప్రశ్నలను సంధించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఇతర నేతలపై తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. కొంతమంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో లాలూచీ పడి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తనను జైలుకు పంపిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ నేతలు వంగి వంగి దండాలు పెడుతున్నారంటూ రేవంత్ మండిపడ్డారు. ఇదంతా.. బుధవారం కొద్దిమంది విలేకరులతో ఆంతరంగికంగా మాట్లాడే సందర్భంలో వెల్లడైంది.

గత మూడు రోజుల్లో ఢిల్లీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలసి ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. బుధవారం ఆయన ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్ పెద్దలను కలసినట్టు పరోక్షంగా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి… ఆ భేటీలను సమర్ధించుకున్నారు. సొంత పార్టీ విషయానికొచ్చినప్పుడు… వ్యక్తిగతంగా కొందరు నేతల వ్యవహార శైలిని విమర్శించడంతో మొదలు పెట్టి పార్టీ వైఖరిని ఆక్షేపించేవరకు రేవంత్ వ్యాఖ్యల పర్వం కొనసాగింది.

టార్గెట్ యనమల, పరిటాల

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2,000 కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ‘ఇక యనమల… కేసీఆర్ పైన ఈగ వాలనిస్తాడా’ అని రేవంత్ ప్రశ్నించారు. ఏపీలో మరో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మేనల్లుడులకు తెలంగాణలో బీర్ల ఉత్పత్తికి లైసెన్సును కేసీఆర్ ఇప్పించారని ఆరోపించారు. మరికొంత మంది తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా టీఆరెస్ ప్రభుత్వంనుంచి ప్రయోజనాలు పొందినట్టు రేవంత్ చెప్పారు.

ఇక్కడే పరిటాల శ్రీరాం పెళ్ళికి కేసీఆర్ వెళ్ళడాన్ని, ఆ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రికి లభించిన అతిధి మర్యాదలను ప్రస్తావించిన రేవంత్ ’ఇక్కడ నన్ను జైలుకు పంపినవాడికి అక్కడ వంగి వంగి దండాలు పెడతారా?’ అని ప్రశ్నించారు. అదే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీతక్క కుమారుడి పెళ్ళికి తెలంగాణ వస్తే ఇక్కడి మంత్రులు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని రేవంత్ చెప్పారు.

అనంతపురం నుంచి కేసీఆర్ తిరుగు ప్రయాణమయ్యే సమయంలో పయ్యావుల కేశవ్ చేతులు పట్టుకొని ఆంతరంగికంగా మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ ’ఏపీలో ప్రజలు పయ్యావులను తిరస్కరించారు. నేను తిట్టాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఏపీ నేతలు కేసీఆర్ కు అంత మర్యాదలు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూ… వారు అన్నం పెట్టినవారికే సున్నం పెడుతున్నారని దుయ్యబట్టారు. అసలు తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటని రేవంత్ ప్రశ్నించారు.

తాను పార్టీకోసమే జైలుకు వెళ్ళాల్సి వచ్చిందని, కుమార్తె పెళ్లి సమయంలో ఆంక్షలతో బయటకు వచ్చి అక్షింతలు వేసి మళ్ళీ జైలుకు వెళ్ళానని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకోసం తెగించి తాము కొట్లాడుతుంటే… ఆంధ్రా నేతలు కేసీఆర్ కు రాచ మర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో పార్టీ ఉనికి, పొత్తులపై..

తెలంగాణకు సంబంధించినంతవరకు టీడీపీ వైఖరికి భిన్నమైన రీతిలో తన నడవడిక ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీలంటూ లేవని, కేసీఆర్… ఆయన వ్యతిరేక కూటమి మాత్రమే ఉంటాయని సూత్రీకరించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని, అందులో తాను కీలక పాత్ర పోషిస్తానని ఉద్ఘాటించారు. తెలంగాణలో కేసీఆర్ ను మళ్ళీ సీఎంను చేయడానికి తామెవరం సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇప్పటిదాకా పొత్తులపై ఎక్కడా మాట్లాడలేదంటూనే.. తెలంగాణలో కేసీఆర్ వైపా లేక ఆయన వ్యతిరేక కూటమివైపా అన్నది నాన్చకుండా తేల్చాలని దాదాపు డిమాండ్ చేసినట్టుగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించినంతవరకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత తమకే ఇవ్వాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీతో పొత్తు విషయం ప్రస్తావించినప్పుడు.. ’ఆ పార్టీ తెలంగాణలో లేదు. అందుకే కదా దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవినుంచి తప్పించారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. అయినా ’ఏపీలోనే పొత్తు. తెలంగాణలో లేదు’ అని బీజేపీ ఎప్పుడో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలే ప్రక్క ప్రక్కనే ఉన్న రాష్ట్రాల్లో వేర్వేరుగా పొత్తులు పెట్టకుంటే టీడీపీ కూడా అలా పెట్టుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్న తన వైఖరికి మద్ధతుగా రేవంత్ ఈ ప్రశ్న సంధించారు. టీడీపీ సిద్ధాంతం పేదలకు న్యాయం చేయడమేనన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటి?

కాంగ్రెస్ అధిష్ఠానంలోని పెద్దలను కలసిన విషయాన్ని మంగళవారం ఖండించిన రేవంత్ రెడ్డి బుధవారం తన వ్యాఖ్యల ద్వారా ఒప్పుకున్నారు. పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ‘సింగరేణి ఎన్నికలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేశాం. ఇంకా కలసి పని చేస్తాం’ అని రేవంత్ చెప్పారు. చాలామంది టీడీపీ నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీవల్లనే మంత్రులు అయ్యారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మొదటిసారి మంత్రి అయింది కాంగ్రెస్ పార్టీలోనే కావడం ఈ సందర్భంగా గమనార్హం. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకోసం మూడో వంతు సీట్లను కోరుతున్నామని రేవంత్ చెప్పారు. టీఆరెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకునే నేతలు.. 2009 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి టీడీపీ ఇచ్చినన్ని సీట్లు (52) తేవాలని సవాలు విసిరారు.

చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరలేదు

తాను మంగళవారం ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి అపాయింట్ మెంట్ కోరినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రేవంత్ స్పష్టం చేశారు. అయితే, చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తాను కలుస్తానని చెప్పారు. ఇదంతా మాట్లాడటానికి ముందు యథావిధిగా తన ఢిల్లీ పర్యటన కేసుల పనికి ఉద్దేశించినదేనని చెప్పుకొచ్చారు. 2007 నుంచీ తనకు వివిధ పార్టీలలో అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాను పార్టీ మారబోనని ఎక్కడా స్పష్టంగా చెప్పని రేవంత్ రెడ్డి… పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మడంలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు… డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ పరిధిలో ఉంటూ అలాంటి ఒక కార్యక్రమం ఏమైనా చేపడితే అధిష్ఠానం అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ, ఇక్కడ టీడీపీకి సమాచారం కూడా లేదు. కొసమెరుపేమంటే.. పాదయాత్ర చేయడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

%d bloggers like this: