టీడీపీకి రేవంత్ టాటా… ఎమ్మెల్యే పదవికీ రాజీనామా!

admin
1 0
Read Time:10 Minute, 35 Second
శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ..
రేవంత్ ను అనుసరించిన వేం నరేందర్ రెడ్డి

అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీకి టాటా చెప్పేశారు. టీడీపీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖను శనివారంనాడిక్కడ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అందజేసి వెళ్ళారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసనసభా పక్ష నాయకుడిగా ఆయనను ఇదివరకే బాధ్యతలనుంచి తప్పించడంతో…చివరి రోజుల్లో రేవంత్ రెడ్డి ఆ పదవుల్లో నామమాత్రంగానే ఉన్నారు. ఎమ్మెల్యేగా, పార్టీ సభ్యునిగా మిగిలారు. తాజాగా పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖను అధినేత కార్యాలయంలో అందజేసిన రేవంత్, ఎమ్మెల్యే పదవికి (27వ తేదీతో ఉన్న) రాజీనామా లేఖను కూడా దానికి జత చేశారు.

తెలంగాణలో మరో ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని అనుసరించి పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. రేవంత్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలసిన సందర్భంలోనూ వేం నరేందర్ రెడ్డి తోడుగా ఉన్నారు. రేవంత్ రాజీనామాతో తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సంఖ్యా బలం 2కు పరిమితమైంది. 2014లో 15 మంది గెలిచినా 12 మంది అధికార టీఆరెస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో రేవంత్ రెడ్డితోపాటు బీసీ నాయకుడు ఆర్. క్రిష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య మిగిలారు. వీరిలో శాసనసభా పక్ష నేతగా ఉన్న రేవంత్ తాజాగా రాజీనామా చేస్తూ.. గతంలోనే తన బాధ్యతలు సండ్రకు అప్పగించినట్టు చెప్పారు.

చంద్రబాబుకు రాసిన లేఖలో రేవంత్ ఎక్కడా పార్టీనిగానీ, ఇతర నేతలను గానీ విమర్శించలేదు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మరింత తీవ్రంగా పోరాడవలసిన ఆవశ్యకత ఉందని, అందుకు రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని, అందుకే పార్టీని వీడుతున్నానని వివరించారు. టీడీపీ కుటుంబంతో బంధాన్ని తెంచుకోవడం తనకు గుండె కోతతో సమానమని పేర్కొన్నారు. అధినేత చంద్రబాబుతో సహచర్యం అద్రుష్టంగా పేర్కొన్న రేవంత్.. అందుకు, తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందినందుకు ఎప్పటికీ గర్విస్తానని స్పష్టం చేశారు. పార్టీ నేతలనుంచి ఎదురుదాడిని నివారించడానికి, కార్యకర్తలు తన వెంట నిలవడానికి రేవంత్ వ్యహూత్మకంగా వ్యవహరించారని చెప్పవచ్చు.

కొద్ది రోజుల క్రితం సొంత పార్టీ నేతలపై రేవంత్ ఆరోపణలు చేసినప్పుడు వచ్చిన స్పందనల్లో వ్యతిరేకత పాలే ఎక్కువ కనిపించింది. టీడీపీ శ్రేణులు రేవంత్ ను తప్పు పట్టాయి. అయితే, శనివారం రేవంత్ రాజీనామా సందర్భంగా ఎక్కడా పార్టీని, నేతలను విమర్శించకపోవడంతో… ప్రతిస్పందనలోనూ పెద్దగా ప్రతికూలత లేదు. రేవంత్ రాజీనామాకు ముందు, తర్వాత కూడా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఆ తర్వాత బయట మాట్లాడిన నేతలు రేవంత్ పై ఆరోపణలు చేయలేదు. చంద్రబాబు విలేకరుల సమావేశంలో రేవంత్ వ్యవహారాన్ని ప్రస్తావించినప్పుడు.. నాయకులు బయటకు వెళ్లడం కొత్తేమీ కాదని, కొంతమంది వాళ్ల భవిష్యత్తుకోసం దూరమవుతుంటారని వ్యాఖ్యానించారు. అప్పటికి ఇంకా రేవంత్ రాజీనామా లేక చంద్రబాబుకు అందలేదు.

విలేేకరుల సమావేశానికి ముందు జరిగిన తెలంగాణ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే, అప్పుడేమీ ఈ విషయం మాట్లాడలేదు. చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి బయటకు వచ్చినప్పుడు ఆయన వెంటే కొద్దిదూరం నడిచిన రేవంత్… ఇక తాను పార్టీలో కొనసాగలేనని, సెలవు తీసుకుంటానని చెప్పారు. చంద్రబాబు ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తీకరించారు. అయితే, దీనికి చంద్రబాబు విలేకరుల సమావేశం ముగిశాక మాట్లాడతాను..ఉండమని సూచించారు. అయితే, రేవంత్ రెడ్డి తన లేఖను అక్కడే ఉన్న పార్టీ కేంద్ర కమిటీ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్థన్ కు అందజేసి వెళ్లిపోయారు.

2007లో తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగారు. చురుగ్గా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేవంత్ రెడ్డిని ప్రోత్సహించారు. సుమారు దశాబ్దం పాటు పార్టీలో ఉన్న రేవంత్, ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారన్న సమాచారం రావడంతో టీడీపీ కూడా అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డిని ట్రీట్ చేసింది. ఢిల్లీనుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ నేతలు, మంత్రులపై ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు అపరిమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, కొంతమంది మంత్రులు, నేతలు తెలంగాణలో ఆర్థిక ప్రయోజనాలు పొందారని రేవంత్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడే రేవంత్ పార్టీపై ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం అప్పుడే వ్యక్తమైంది. తర్వాత జరిగిన టీటీడీపీ ముఖ్య నేతల సమావేశంలో పలువురు సీనియర్లు రేవంత్ వైఖరిని ప్రశ్నించారు. అయితే, తాను అధినేత చంద్రబాబుతోనే అన్ని విషయాలూ మాట్లాడతానని రేవంత్ సమాధానమిచ్చారు. మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ వంటి నేతలు బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 26వ తేదీన టీడీఎల్పీ సమావేశానికి రేవంత్ పిలుపిచ్చినా ఎవరూ హాజరు కాలేదు. అదే రోజు బీజేపీతో కలసి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఏర్పాటు చేసిన సమావేశానికి నేతలంతా హాజరయ్యారు.

అంతకు ముందు రోజే.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ రెండు పత్రికా ప్రకటనలు చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగాగానీ, శాసనసభా పక్ష నాయకుడిగా గానీ ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించరాదని స్పష్టం చేశారు. అధినేత ఆమోదంతోనే తానీ ప్రకటన చేస్తున్నట్టు రమణ పేర్కొనడంతో పార్టీ నేతలు రేవంత్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళడానికి సిద్ధపడలేదు. అయితే, తాను టీడీఎల్పీ సమావేశం నిర్వహించే తీరుతానని, శాసనసభా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రమణను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. తీరా సమావేశం రోజు (26వ తేదీ) వచ్చేసరికి చివరి నిమిషాల్లో రేవంత్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య కూడా రమణ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. రేవంత్ పార్టీని వీడే ప్రక్రియ వేగవంతమైంది. విదేశీ పర్యటన నుంచి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ లో తెలంగాణ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అందులో రేవంత్ పై సీనియర్లు ఫిర్యాదు చేశారు. అంతా కలసి పని చేయాలని సూచించిన చంద్రబాబు.. శనివారం ముఖ్య నేతలు విజయవాడ రావాలని సూచించారు. విడిగా వేం నరేందర్ రెడ్డితో కలసి వచ్చిన రేవంత్.. కొద్ది సమయంలోనే రాజీనామా తంతును ముగించుకొని వెళ్లిపోయారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

ఇప్పుడు కాకుంటే ఇక జీవితంలో కాదు

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి..  కేంద్ర వైఖరిపై పెదవి విరుపు Share Tweet LinkedIn Pinterest
error

Enjoy this blog? Please spread the word