కాంగ్రెస్ గూటికి రేవంత్ రెడ్డి!

1 0
Read Time:9 Minute, 16 Second
  • ఢిల్లీలో అధిష్ఠాన పెద్దలతో సమావేశం?
  • ప్రచార సారథిగా నియమించవచ్చని ప్రచారం..
  • వార్తలను ఖండించిన రేవంత్ 

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పాార్టీని వీడుతున్న సంకేతాలు వెలువడ్డాయి. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన రేవంత్.. కాంగ్రెస్ పెద్దలు పలువురిని కలసినట్టు సమాచారం. చర్చలు ఫలించాయని, త్వరలో రేవంత్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేవంత్ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రేవంత్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారు. అనంతరం రాహుల్ గాంధీతో కూడా భేటీ అయినట్టు చెబుతున్నారు. భవిష్యత్తులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కావాలని రేవంత్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార సారధిగా రేవంత్ ను నియమించడానికి కాంగ్రెస్ పెద్దలు అంగీకరించినట్టు సమాచారం.

రేవంత్ రెడ్డితోపాటు టీటీడీపీ మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. రేవంత్, సండ్ర… ఇద్దరూ దూరమైతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి మూలిగే నక్కపైన తాటిపండు పడిన చందమే. ఇక మిగిలే ఎమ్మెల్యే పార్టీ ఛట్రంలో ఇమడలేని ఆర్. క్రిష్ణయ్య ఒక్కరే.

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ లోని జానారెడ్డి వంటి సీనియర్ నేతల ఆశీస్సులు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. జైపాల్ రెడ్డికి రేవంత్ స్వయానా బంధువు. జానారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలతో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.

అయితే, రేవంత్ రాకను కాంగ్రెస్ లో వ్యతిరేకించేవారూ లేకపోలేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పాత్రను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ కేసు ఏకంగా చంద్రబాబు హైదరాబాదును వదిలి వెళ్ళడానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టును కూడా కోల్పోవడానికి కారణమైందని… ఒకరిద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్ఠానం వద్ద రికార్డు వేసినట్టు సమాచారం. రేవంత్, సండ్ర ఇద్దరూ ఆ కేసులో ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడే ఈ కేసు నమోదైంది. ఇప్పుడు ఆ ముగ్గురూ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడారని వచ్చిన సమాచారం టీటీడీపీలో మిగిలిన నేతలకు ఆగ్రహం తెప్పించింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోవడం, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్లు సైతం అధికార టీఆరెస్ పార్టీలో చేరి మంత్రి పదవుల్లో సెటిల్ కావడంతో… జూనియర్ అయినా రేవంత్ రెడ్డికి నాయకత్వ పగ్గాలు దక్కాయి. దీన్ని సహజంగానే కొంతమంది సీనియర్లు వ్యతిరేకించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు రేవంత్…తనకు వచ్చిన అవకాశాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు.  ఓటుకు నోటు కేసును, కొన్ని సందర్భాల్లో అవసరానికి మించి వాడే పదజాలాన్ని మినహాయిస్తే.. రేవంత్ టీడీపీలో వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నట్టే లెక్క.

రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని పార్టీలో మిగిలిన సీనియర్లనుంచి అధినేతకు అనేకసార్లు ఫిర్యాదులు అందాయి. మరోవైపు… ఏ పని చేసినా వారు అడ్డు వస్తున్నారని, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొన్నిసార్లు వారి మాటలు విని బ్రేకులు వేస్తున్నారని రేవంత్ ఆక్షేపణ తెలిపేవారు. తెలంగాణలో పార్టీపైన పూర్తి స్థాయి అధికారాన్ని రేవంత్ కోరుకున్నారు. అయితే, అది సాధ్యం కాలేదు.

అధికార టీఆరెస్ పార్టీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావులపై రేవంత్ స్థాయిలో విమర్శలు గుప్పించినవారు మరొకరు లేరు. మంచి వాగ్ధాటి ఉన్న యువ నేతగా రేవంత్ గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పూర్తి స్థాయిలో అందుకోబోతున్న రాహుల్ గాంధీ రాష్ట్రాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నారు. అదే సమయంల తెలంగాణలో రేవంత్ ముందుకు రావడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయుక్తమైన అంశమే.

అయితే, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడడానికి ముందే… దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకునేందుకు కొన్ని కారణాలను చూపుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార టీఆరెస్ పార్టీతో చేతులు కలుపుతోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు దిశగా రేవంత్ ప్రతిపాదించగా మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఇతర నేతలు దాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే.. ఎపి మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం వివాహానికి కేసీఆర్ హాజరైన సందర్భంలో పయ్యావుల కేశవ్ వంటివారు సన్నిహితంగా మెలగడంపట్ల రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేస్తాననేవరకు సంకేతాలిచ్చారు. సో… రేపు రాజీనామా చేసినా ఇలాంటి కారణాలు వినవస్తాయి.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. తాను కేసుల పని ఉండి ఢిల్లీ వచ్చానని ఆయన తనను అడిగినవారికి చెప్పారు. తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రులు ’బంగారు కూలీ’ పేరిట చందాలు వసూలు చేశారని, దీనిపై తాను గతంలో ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోకపోవడంతో ఆ సంస్థపైనే కేసు వేయడానికి వచ్చానని రేవంత్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో బహిరంగంగా మీడియాతో ఏమీ చెప్పలేదు. రెండు రోజుల తర్వాత విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడతానని సెలవిచ్చారు.

ఆ విలేకరుల సమావేశంలో పార్టీ మారే విషయం చెబుతారా… లేక ఖండిస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే, రేవంత్ గత ఢిల్లీ సందర్శనలకు, ఇప్పటికీ తేడా సుస్పష్టం. గతంలో ఆయన టీడీపీకి చెందినవారితో కలసి తిరగేవాడు. ఈసారి అది జరగలేదు. పార్టీ మారడానికి నిర్ణయించుకున్న తర్వాతే ఇలా పంథా మార్చారా? లేక తెలుగుదేశం అధిష్ఠనానికి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నారా?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply