తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ధీటైన కౌంటర్ ఇచ్చారు. తన మేనల్లుడు స్నేహితులతో కలసి హైదరాబాద్ లో పబ్ పెట్టుకుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకేదో బీరు కంపెనీకి లైసెన్సు ఇచ్చినట్టు ఆరోపించడం ఏమిటని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కుమార్తె కవితతో కలసి రేవంత్ రెడ్డి ఒక కంపెనీని రిజిస్టర్ చేయించారని కేశవ్ వెల్లడించారు.
సోమవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన కేశవ్.. రేవంత్ పార్టీని వదలడానికి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. సొంత రాజకీయ లబ్దికోసం స్నేహాన్ని పణంగా పెట్టాడని రేవంత్ రెడ్డిపై కేశవ్ విరుచుకుపడ్డారు. గత స్నేహాన్ని నెమరు వేసుకుంటూనే… రేవంత్ వ్యవహారం మొత్తం తనకు తెలుసని, గత ఆరు నెలలుగా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎవరెవరిని కలిసిందీ తన వద్ద వివరాలున్నాయని కేశవ్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని కలసిన విషయం తెలిసిందే. తర్వాత రోజు మీడియాతో చిట్ చాట్లో ఆంధ్రప్రదేశ్ నేతలు యనమల, పయ్యావులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. యనమల బంధువుకు కేసీఆర్ రూ. 2000 కోట్ల కాంట్రాక్టులు ఇప్పించారని, పయ్యావుల కేశవ్ మేనల్లుడికి బీరు ఫ్యాక్టరీ లైసెన్సు ఇచ్చారని రేవంత్ విమర్శించారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం వివాహానికి కేసీఆర్ వచ్చిన సందర్భంగా.. కేశవ్ అతిగా మర్యాద చేశారని మండిపడ్డ రేవంత్, కేసీఆర్ తో లబ్ది పొందిన యనమల ఈగ వాలనిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ ఆరోపణలపై పరిటాల శ్రీరాం వెంటనే స్పందించి తనకు సంబంధించినంతవరకు కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్పందించారు. రేవంత్ ఆరోపించినట్టు… తనకూ, మంత్రి పరిటాల సునీతతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. ఒకే పార్టీ కాబట్టి రేవంత్ వ్యాఖ్యలపై స్పందించకూడదనుకున్నానని, అయితే ఈ వ్యవహారంపై ఇతర పార్టీల నేతలు స్పందించిన తర్వాత ఇక తప్పనిసరై స్పందిస్తున్నానని కేశవ్ చెప్పారు.
రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో కూడా సంబంధాలున్నాయని కేశవ్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి జగన్ పత్రిక సాక్షిలో కవరేజ్ బాగా ఇస్తారని పేర్కొన్నారు.