2017లో 7,000 మంది విదేశాలకు వలస వెళ్ళారు
సంపన్నుల వలసలో రెండో స్థానం మనదే
దేశంలో పెరుగుతున్న సంపద కొద్దిమంది వద్దే పోగుపడుతోంది. అదే సమయంలో సంపన్నుల్లో చాలామంది ఈ దేశంలో నివాసం ఉండటానికి ఇష్టపడటంలేదు. 2017లో ఏకంగా 7,000 మంది మిలియనీర్లు, బిలియనీర్లు తమ నివాసాన్ని ఇండియానుంచి వేరే దేశాలకు మార్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2015లో 4,000 మంది, 2016లో 6,000 మంది మహా సంపన్నులు దేశంనుంచి తమ నివాసాన్ని విదేశాలకు మార్చుకున్నారు. ఏటేటా దేశం వదిలిపోతున్న సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం.
దేశం వదిలిపోతున్న సంపన్నుల సంఖ్యలో ఇండియా రెండో స్థానంలో ఉంది. చైనా ఈ విషయంలో అగ్ర స్థానంలో ఉంది. 2017లో చైనా నుంచి 10,000 మంది సంపన్నులు విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. చైనా, ఇండియా తర్వాత స్థానాల్లో టర్కీ (6,000 మంది), యుకె (4,000 మంది), ఫ్రాన్స్ (4,000 మంది), రష్యా (3,000 మంది) ఉన్నాయి. 2017లో మొత్తంగా 95,000 మంది సంపన్నులు ఒక దేశం నుంచి మరో దేశానికి మకాం మార్చారు. 2016లో ఈ సంఖ్య 82 వేలుగా ఉంటే 2015లో 64,000 ఇలా మరో దేశానికి వలస వెళ్ళారు.
ఇండియా నుంచి తరలిపోతున్న సంపన్నుల్లో ఎక్కువ మంది అమెరికా, అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలను ఎంచుకుంటుండగా చైనా నుంచి ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్తున్నారు. అయితే, ఈ సంపన్నుల వలస ఆందోళనకరమేమీ కాదని భావిస్తున్నారు. ఎందుకంటే... వలస వెళ్ళే సంపన్నుల కంటే ఎక్కువ మంది ప్రతి ఏటా కొత్తగా సంపన్నుల జాబితాలో చేరుతున్నారు.
ఇదిలా ఉంటే.. విదేశీ సంపన్నులు ఎక్కువగా ప్రవేశిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి 10 వేల మంది మహా సంపన్నులు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళారు. అమెరికాను తలదన్ని ఆస్ట్రేలియా మహాసంపన్నుల డెస్టినేషన్ గా నిలవడం విశేషం. 2017లో అమెరికాకు వలస వెళ్లిన విదేశీ సంపన్నుల సంఖ్య 9,000 కాగా కెనడాకు 5,000 మంది, యుఎఇకి 5,000 మంది వెళ్ళారు.
సంపన్న దేశాల జాబితాలో ఇండియా ఆరో స్థానంలో ఉండగా దేశంనుంచి వలస వెళ్ళే సంపన్నుల సంఖ్య విషయంలో మాత్రం రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ఇండియాలో ఒక మిలియన్ డాలర్ల (సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులు 3,30,400 మంది, మల్టీ మిలియనీర్లు 20,730 మంది, బిలియనీర్లు (ఒక బిలియన్ డాలర్లు.. అంటే 6,500 కోట్లకంటే ఎక్కువ ఉన్నవారు) 119 మంది ఉన్నట్టు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక చెబుతోంది.