‘‘స్వచ్ఛభారత్’’లో మురికి కూపాలుగా నదులు!

5 0

దేశవ్యాప్తంగా 351 నదీ భాగాలు కలుషితం

ఏపీలో 5, తెలంగాణలో 8... పట్టణాల మురికి నదుల్లోకి..

ఉత్పత్తి అవుతున్న మురుగులో మూడో వంతే శుద్ధి

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణందో దేశమంతా స్వచ్ఛంగా తయారైందని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. టాయిలెట్ల నిర్మాణంతో పాటు మరికొన్ని ప్రయత్నాలతో ‘‘స్వచ్ఛభారత్’’ సాకారమైందన్నది ఢిల్లీనుంచి గల్లీదాకా నేతలు చెబుతున్న మాట. అది వాస్తవమా?

నదులను పూజించే దేశంలో ప్రధాన నదులన్నీ మురుగుమయమైతే ‘‘స్వచ్ఛభారత్’’ సాకారమైనట్టేనా? దేశంలోని 351 నదీ ప్రవాహ ప్రాంతాలు కలుషితమైనట్టు... కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వమే శుక్రవారం లోక్ సభలో ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 53, అస్సాంలో 44 నదీ ప్రాంతాలు కలుషిత జాబితాలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో... ఏపీలో 5, తెలంగాణలో 8 నదీ ప్రవాహ ప్రాంతాలు కాలుష్యం భారిన పడినట్టు కేంద్రం తెలిపింది.

మురికి కూపాల జాబితాలో నదులు, వాటి ఉప నదులు ఉన్నాయి. ‘‘పవిత్రం’’గా భావించే గంగా, యమున... దేశ దక్షిణ భాగానికి జీవనదులైన గోదావరి, క్రిష్ణా... ఇలా అన్ని నదుల్లోనూ మురుగు ప్రవహిస్తోంది. ప్రధానగా నగరాలు, వివిధ పట్టణాలను ఆనుకొని ప్రవహిస్తున్న నదుల్లో కాలుష్యం చేరుతోంది. హిమాలయ రాష్ట్రాలనుంచి దక్షిణ ధ్రువాన ఉన్న తమిళనాడు వరకు ఏ నదీ కాలుష్యానికి అతీతంగా లేదంటే అతిశయోక్తి కాదు.

పశ్చిమాన ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నర్మద నదినుంచి ఈశాన్యాన బ్రహ్మపుత్రవరకు కలుషిత నదుల జాబితాలో ఉన్నాయి. ఒకటికి మించి వివిధ రాష్ట్రాల్లో ప్రవహించే నదులను వేర్వేరు ప్రాంతాలుగా విభజించారు. ఉదాహరణకు క్రిష్ణా నదిని తీసుకుంటే... మూడు (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో వేర్వేరు నదీ భాగాలుగా చూపించారు. ఈ విధంగా రిపీట్ అయినవాటితో కలిపి మొత్తంగా 323 నదులు, ఉప నదుల్లోని 351 నదీ భాగాలను కలుషిత జాబితాలో చేర్చారు.

బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బిఒడి) స్థాయి ఆధారంగా కలుషిత నదులను నిర్ధారించారు. 2015 మార్చినాటి అంచనా ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రోజుకు 61,948 మిలియన్ లీటర్ల మురుగు నీరు (ఎం.ఎల్.డి) ఉత్పత్తి అవుతుండగా... అందులో కేవలం 23,277 (ఎం.ఎల్.డి) మాత్రమే శుద్ధి చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అంటే.. మిగిలిన మొత్తం కాల్వలు, ఉప నదుల ద్వారా నదుల్లోకే ప్రవహిస్తోంది. దీంతోపాటు పారిశ్రామిక వ్యర్ధ జలాలు, ఇతరత్రా మురుగు కూడా నదుల్లోకి చేరుతోంది.

మురుగునీటి ఉత్పత్తిలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ముందున్నాయి. పట్టణ ప్రాంతాల్లో తయారవుతున్న మురుగునీటిని శుద్ధి చేయడంలో గుజరాత్, మహారాష్ట్ర ముందున్నాయి.

ఏ రాష్ట్రంలో ఎన్ని...

ఏపీలో 5, అస్సాంలో 44, బీహార్ రాష్ట్రంలో 6, చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 5, డామన్ డయ్యూ-దాద్రానగర్ హవేలీలో 1, ఢిల్లీలో 1 (యమున), గోవాలో 11, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో 20, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 7, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 9, జార్ఖండ్ లో 7, కర్నాటకలో 17, కేరళలో 21, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22, మహారాష్ట్రలో 53, మణిపూర్ లో 9, మేఘాలయలో 7, మిజోరాంలో 9, నాగాలాండ్ లో 6, ఒడిషాలో 19, పుదుచ్ఛేరి 2, పంజాబ్ లో 4, రాజస్థాన్ 2, సిక్కింలో 4, తమిళనాడులో 6, తెలంగాణలో 8, త్రిపురలో 6, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 12, ఉత్తరాఖండ్ లో 9, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 17 నదీ భాగాలు కలుషితమైనట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.