ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విడివిడిగా వివాదాలకు ప్రసిద్ధులు. అలాంటివారు ఒకరికి ఒకరు తోడైతే.. ఇక రచ్చ రచ్చే! విశాఖపట్నం నోవాటెల్ హోటల్ లో అదే జరిగింది. వ్యవసాయ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సుకోసం విశాఖపట్నం వచ్చిన ఎమ్మెల్యేలలో ఆ ఇద్దరూ భిన్నంగా వ్యవహరించారు. తమకు వసతి కేటాయించిన హోటల్ ను కాదని నోవాటెల్ లోనే కావాలని పట్టుపట్టారు. అదీ… అర్ధరాత్రి వేళ అనూహ్యంగా రచ్చ చేశారు. అగ్రిటెక్ సదస్సుకోసం వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధుల సాక్షిగా పరువు బజారున పడుతుందన్న ఇంగిత జ్ఞానమైనా లేకుండా దాాదాగిరికి దిగారు.
ఆ ఇద్దరూ నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు. ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది వారెవరో…! ఒకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగంటి రామకృష్ణ. మరొకరు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఎపి ఆగ్రిటెక్ సమ్మిట్ 2017 పేరిట రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ, బిల్ అండ్ మెలిండా గేట్స్ సహకారంతో 15, 16, 17 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి చివరి రోజున బిల్ గేట్స్ కూడా హాజరయ్యారు. అదే రోజున రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సుకోసం వివిధ దేశాలు, వివిధ రంగాలనుంచి హాజరైన ప్రముఖులకు నిర్వాహకులు వేర్వేరుగా వసతి ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులకు నోవాటెల్ హోటల్లో వసతి ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ఇతరులకు మారియట్ హోటల్లో రూములు బుక్ చేశారు. అంతా బాగానే ఉన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏమైందో ఏమో.. గురువారం రాత్రి నోవాటెల్ హోటల్ లో వీరంగం వేశారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం… వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణతో మొదలైంది రచ్చ. ఎప్పుడూ ముందుండే చింతమనేని ఈసారి సెకండరీ రోల్ ప్లే చేసినట్టు చెబుతున్నారు. తమకు అక్కడే వసతి కేటాయించాలని రామకృష్ణ హోటల్ సిబ్బందిని డిమాండ్ చేశారు. దీనికి వారు ససేమిరా అనడంతో తామేంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. బెదిరింపులు కేకలతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.
ఈ రచ్చ తర్వాత వారికి కూడా అక్కడే రూములు బుక్ చేసినట్టు సమాచారం. దీనికోసం నిర్వాహకులు అదనపు రూములకు డబ్బు చెల్లించినట్టు చెబుతున్నారు. ఆగ్రిటెక్ సదస్సుకు ఎమ్మెల్యేలు హాజరైంది ఒక్కరోజు.. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. తాము అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులు. ఇవేవీ వారిలో ఆలోచనను రేకెత్తించలేకపోయాయి. తమకు వేరొక హోటల్ లో వసతి కల్పించినా పట్టించుకోకుండా మంత్రులకు కేటాయించిన చోటనే కావాలని పట్టుపట్టడం వెనుక కారణమేమిటో తెలియదు.
అంతకు ముందు పగటి సమయంలో ఇదే ఎమ్మెల్యేలు ప్రశాంతంగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సందర్శించారు. చింతమనేని అయితే… తమ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాదరంగా స్వాగతం పలికారు. మధ్యాహ్న సమయంలో విందు ఏర్పాటు చేశారు. దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ముఖ్యులకు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలకడం నుంచి ప్రాజెక్టుల సందర్శన పూర్తయ్యేవరకు అందరికీ తలలో నాలుకలా నడుచుకున్నారు. మరోవైపు రామకృష్ణ ఏ హడావిడీ చేయకుండా కూల్ గా గడిపారు. మరి రాత్రి అయ్యేసరికి వీరికి ఏమైందో…!
వ్యవసాయంలో డ్రోన్లు, ఐఒటి వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై సదస్సు నిర్వహించి ప్రజాప్రతినిధులు కూడా నేర్చుకుంటారని అసెంబ్లీకి విరామమిచ్చి మరీ తీసుకెళ్తే… ఏదో ముతక సామెత చెప్పినట్టు తమ మొరటుతనాన్నే ప్రదర్శనకు పెట్టారు.