డాలర్ కు 70.08 స్థాయికి దిగజారిన భారత కరెన్సీ
మంగళవారం మార్కెట్లు మరోసారి వణికాయి. రూపాయి విలువ పతనం కొనసాగి ఏకంగా డాలర్ కు 70 రూపాయలు దాటిపోయింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి డాలర్ కు 70.08 రూపాయలుగా విలువ నమోదైంది. తర్వాత కొద్దిగా తేరుకొని 70కి సమీపంలోనే 69.98 రూపాయల వద్ద నిలబడింది. సోమవారమే రూపాయి విలువ పతనమైంది. డాలర్ తో మారకం విలువ సోమవారం 69.92 రూపాయలకు పడిపోయింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యాక ఆ పతనావస్థ కొనసాగింది.
డాలర్ కు రూ. 70 మార్కును దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. టర్కీపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ లిరా విలువ పతనమైంది. దాని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా పడింది. అయితే, ఆసియా కరెన్సీల మొత్తంలో రూపాయి విలువ మాత్రమే ఇంతగా పతనమైంది. ఈ ఏడాదిలో రూపాయి విలువ 9 శాతం మేరకు పతనమైంది. మంగళవారం రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకోవడంతో ఈ మాత్రమైనా నిలబడినట్టు సమాచారం.
అమెరికా చేపట్టిన రక్షణాత్మక చర్యలు, ఇతర దేశాలపై ఆంక్షలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడటం వంటి కారణాలు వర్ధమాన దేశాల కరెన్సీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటం, దాని ప్రభావంతో కరెంటు ఖాతా లోటు పెరగడం వంటి అంశాలూ రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి. ఇతర అభివ్రుద్ధి చెందుతున్న దేశాల కరెన్సీల విలువ కూడా తగ్గుతుండటంతో.. రూపాయి విలువ కూడా తక్కువ ఉంటేనే ఎగుమతులు గిట్టుబాటవుతాయనే భావనను కొంతమంది ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.